సంస్కరణల జోరు పెంచుతాం: ప్రధాని నరేంద్ర మోడీ హామి
న్యూఢిల్లీ: సంస్కరణల బాటలో ఇకపై టాప్ స్పీడ్‌లో దూసుకెళ్తామని ప్రధాని నరేంద్ర మోడీ ఇన్వెస్టర్లకు హామీ ఇచ్చారు. దేశంలో మౌలిక వసతుల అభివృద్ధికి ఊతమివ్వడంతో పాటు పన్నుల వ్యవస్థను స్థిరీకరించడం, సానుకూల నియంత్రణా చట్టాలను అమలులోకి తీసుకురావడం ద్వారా ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని 2 ట్రిలియన్ డాలర్ల నుంచి 20 ట్రిలియన్ డాలర్లకు చేర్చేందుకు సంస్కరణల ప్రక్రియను శరవేగంగా ముందుకు తీసుకెళ్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు.
‘ఎకనామిక్ టైమ్స్' పత్రిక ఆధ్వర్యంలో శుక్రవారం న్యూఢిల్లీలో నిర్వహించిన ప్రపంచ వ్యాపార సదస్సులో ప్రసంగిస్తూ మోడీ ప్రసంగించారు. దేశంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు ఉపాధి అవకాశాలను పెంపొందించేవిగా ఉండాలని ఇందుకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న నిబంధనల్లో మార్పులు చేర్పులు చేసి పన్నుల వ్యవస్థను సంస్కరిస్తామని అన్నారు.

అలాగే అవసరమైన వారికి రాయితీలను అందించే విషయంపై దృష్టి సారిస్తామని ఆయన స్పష్టం చేశారు. పన్నుల వ్యవస్థను స్థిరీకరించి, సానుకూల నియంత్రణా చట్టాలను అమలులోకి తీసుకురావడం ద్వారా వ్యాపార రంగంలో మరింత వెసులుబాటు తీసుకువచ్చేందుకు శరవేగంగా చర్యలు చేపడతున్నామని చెప్పారు.
దేశంలో పెట్టుబడులకు అవరోధంగా పరిణమిస్తున్న వివిధ అనుమతులను గణనీయంగా కుదిస్తున్నామని తెలిపారు. అలాగే ఎంతో సంక్లిష్టంగా ఉన్న మన పన్నుల వ్యవస్థను సంస్కరించే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని వెల్లడించారు. ఇవన్నీ శరవేగంగా ముందుకు సాగుతాయని.. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రగతి పథంలో పరుగులు తీయించేందుకు తాము చేపట్టిన ఈ చర్యలను మున్ముందు మీరంతా అభినందిస్తారని తాను గట్టిగా విశ్వసిస్తున్నట్లు మోడీ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications