నేడు పట్టాలెక్కనున్న మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్- హాల్ట్ స్టేషన్లు, ఛార్జీల వివరాలివీ..
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టుల్లో ఒకటి- వందే భారత్ ఎక్స్‌ప్రెస్. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైలు దశలవారీగా అన్ని రాష్ట్రాల్లోనూ పట్టాలెక్కుతోంది. ఇప్పటివరకు మొత్తం 17 రైళ్లు వేర్వేరు రాష్ట్రాలు/నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి. కొత్తగా 18వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికుల కోసం అందుబాటులోకి రానుంది.
ఢిల్లీ- డెహ్రాడూన్ మధ్య ఈ రైలు రాకపోకలు సాగించనుంది. ఈ ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రైలును పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. ఉత్తరాఖండ్‌కు కేటాయించిన మొట్టమొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇది. ఢిల్లీ-డెహ్రాడూన్ మధ్య 302 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల 45 నిమిషాల్లో అధిగమిస్తుంది.

ఇవ్వాళ మోదీ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించిన అనంతరం 29వ తేదీ నుంచి ప్రయాణికులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది. బుధవారం మినహా మిగిలిన అన్ని రోజులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఢిల్లీ- డెహ్రాడూన్ ఏసీ చైర్ కార్ టిక్కెట్‌కి ధర 1,065 రూపాయలుగా నిర్ధారించారు. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ టిక్కెట్ ధర 1,890 రూపాయలు.
22457 నంబర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఢిల్లీ ఆనంద్ విహార్ టెర్మినల్ స్టేషన్ నుంచి తెల్లవార జామున 5:50 నిమిషాలకు బయలుదేరుతుంది. 10:35 నిమిషాలకు డెహ్రాడూన్‌కు చేరుకుంటుంది. డెహ్రాడూన్‌లో ఉదయం 7:00 గంటలకు ఢిల్లీకి బయలుదేరుతుంది. 11:45 నిమిషాలకు ఢిల్లీ ఆనంద్ విహార్ టెర్మినల్‌కు చేరుకుంటుంది. హరిద్వార్ జంక్షన్, రూర్కీ, సహరన్‌పూర్, ముజఫర్‌నగర్, మీరట్ మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.
కమర్షియల్ ఆపరేషన్స్ మొదలు పెట్టిన తరువాత ఈ షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నట్లు ఐఆర్‌సీటీసీ తెలిపింది. ప్రయాణికుల సౌకర్యాన్ని బట్టి షెడ్యూల్‌లో మార్పులు ఉంటాయని పేర్కొంది. ఇటీవలే ప్రధాని మోదీ 17వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా నుంచి ఒడిశాలోని పూరీకి ఈ రైలు రాకపోకలు సాగిస్తోంది.












Click it and Unblock the Notifications