మోడీ సోదరితో యోగి ఆదిత్యనాథ్ సోదరి భేటీ- ఉత్తరాఖండ్ ఆలయంలో ఆప్యాయంగా..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోదరీమణులు నిన్న ఉత్తరాఖండ్‌లోని గర్వాల్‌లో ఉన్న ఓ ఆలయంలో అనుకోకుండా కలిశారు. ప్రధాని మోదీ సోదరి వాసంతీబెన్ శ్రావణ మాసంలో శివుడికి ప్రార్థనలు చేసేందుకు పౌరీ గర్వాల్‌లోని నీలకంఠ మహాదేవ్ ఆలయానికి తన భర్తతో కలిసి వచ్చారు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన యోగీ ఆదిత్యనాథ్ సోదరి శశీదేవితో ఆమె కలిశారు.
స్ధానికంగా ఉన్న కొఠారి గ్రామంలోని పార్వతి ఆలయాన్ని సందర్శించిన సమయంలో వీరిద్దరూ భేటీ అయ్యారు. వీరిద్దరూ ఆలయాన్ని సందర్శించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ అవుతోంది. ఇందులో ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకోవడం, పలకరించుకోవడం, వారి ముఖాల్లో చిరునవ్వులు కనిపించాయి. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్న తర్వాత ఆలయం వద్దకు వెళ్లి ఇద్దరూ ప్రార్థనలు చేసుకున్నారు.

బీజేపీ నేత అజయ్ నందా ఈ వీడియోను షేర్ చేస్తూ, ప్రధాని మోడీ సోదరి బసంతిబెన్, సిఎం యోగి సోదరి శశి సమావేశం సరళత, భారతీయ సంస్కృతి, సంప్రదాయాల సారాంశానికి ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. రాజకీయాలకు అతీతంగా వారి బంధాన్ని చూడటం హృదయపూర్వకంగా ఉందన్నారు. భారతదేశ విలువలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఇద్దరు గొప్ప వ్యక్తుల గురించి తమకు గర్వంగా ఉందన్నారు.
సాధారణంగా ప్రధాని మోడీ, యోగీ ఆదిత్యనాథ్ ఇద్దరూ బీజేపీలోనే కలిసి పనిచేస్తున్నా వీరిద్దరి కుటుంబాలు అంతగా కలిసినట్లు ఎక్కువగా కనిపించదు. అలాగే ప్రధాని మోడీ తరహాలోనే రాజకీయాల్లో వేగంగా ఎదిగేందుకు యోగీ ఆదిత్యనాథ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మోడీ స్ధానాన్ని భవిష్యత్తులో భర్తీ చేయగల నేతగా యోగీ ఆదిత్యనాథ్ ఎదుగుతున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి సోదరీమణులు కలుసుకోవడంతో జనం ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications