మోడీ ప్రతిజ్ఞ నెరవేరిన రోజు: అయోధ్యలో హనుమాన్‌గఢీలోనే తొలి పూజ ఎందుకంటే.?
అయోధ్య: ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రామ మందిర భూమిపూజ బుధవారం ఎంతో వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ రామ మందిర భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే, భూమి పూజ కార్యక్రమానికి ముందే ప్రధాని మోడీ.. అయోధ్యలోని హనుమాన్ గఢీ(గర్హీ)లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

హనుమాన్ గర్హీలో మోడీ తొలి పూజలు
హనుమాన్ దేవాలయం ప్రధాన అర్చకుడు మోడీకి తలపాగా అందజేశారు. కాగా, అయోధ్య చేరుకున్న మోడీ రామ జన్మభూమి కంటే ముందుగా హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడానికి కారణాలున్నాయని అర్చకులు తెలిపారు.

హనుమంతుడి నివాసం..
పురాణాల ప్రకారం శ్రీరాముడి భక్తుడైన హనుమంతుడి ఆశీర్వాదం లేకుండా ఏపనీ పూదని చెప్పారు. రావణుడిని సంహరించిన తర్వాత రాముడు అయోధ్యకు తిరుగుపయనమయ్యారు. ఆ సందర్భంలోనే హనుమంతుడు నివాసం ఉండేందుకు రాముడు ఈ గఢీ ప్రాంతాన్ని ఆయనకు అప్పగించారు. అందుకే ఈ ప్రాంతాన్ని హనుమాన్ గఢీ లేక హనుమాన్ కోటగా పిలుస్తారు.

గఢీ నుంచే హనుమంతుడి రక్షణ..
అంతేగాక, ఈ గఢీ నుంచే హనుమంతుడు రామకోటను పరిరక్షిస్తున్నాడని ఇక్కడ ఓ విశ్వాసం ఉందని అర్చకులు వివరించారు. ఉత్తర భారతదేశంలోని ప్రముఖ ఆలయాల్లో హనుమాన్ గఢీ కూడా ఒకటని తెలిపారు.

29ఏళ్ల తర్వాత అయోధ్యకు మోడీ..
ఇది ఇలావుంటే, సుమారు 29ఏళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యలో పర్యటించారు. రామ మందిరం నిర్మించినప్పుడే తిరిగి ఈ ప్రాంతానికి తిరిగి వస్తానని 1992లోనే ప్రతిజ్ఞ చేశారు. జమ్మూకాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 రద్దు కోసం బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీ నాయకత్వంలో జరిగిన తిరంగా యాత్రకు కన్వీనర్‌గా ఉన్న మోడీ చివరిసారిగా ఇక్కడ పర్యటించారు. ఈ ఆగస్టు 5 నాటికి ఆర్టికల్ 370 రద్దై ఏడాది పూర్తి కావడం గమనార్హం.

ప్రతిజ్ఞ నిలబెట్టుకున్న మోడీ..
కాగా, గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫజియాబాద్-అంబేద్కర్ నగర్ ప్రాంతాల్లో మోడీ నర్యటించినప్పటికీ.. అయోద్యకు మాత్రం వెళ్లలేదు. ఆ తర్వాత తిరిగి ఇప్పుడే రామ మందిర భూమి పూజ కోసమే మోడీ అయోధ్యకు రావడం విశేషం. అయోధ్య రాముడిని దర్శించుకున్న తొలి ప్రధాని మోడీనే అని యూపీ ప్రభుత్వం వెల్లడించింది. హనుమాన్ గఢీలో పూజలు నిర్వహించిన ప్రధాని కూడా మోడీనేనని తెలిపింది. రామ మందిర నిర్మాణం అంశం కూడా బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనడం గమనార్హం. దీంతో ఈ హామీని కూడా మోడీ నెరవేర్చినట్లయింది.