ప్రధాని రాజీనామా పుకార్లు: కొట్టిపారేసిన పిఎంవో
న్యూఢిల్లీ: ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ రాజీనామా చేస్తారని పుకార్లు వ్యాపించాయి. 2014 ఎన్నికల నేపధ్యంలో ఆయన ప్రధాన మంత్రి పదవి నుంచి దిగిపోతారంటూ ఊహాగానాలు చెలరేగాయి. అయితే, ఆ ఊహాగానాలను ప్రధాని కార్యాలయం కొట్టి పారేసింది. జనవరి 3వ తేదీన మీడియా సమావేశం నిర్వహించాలని ప్రధాని నిర్ణయించడంతో ఆ పుకార్లకు రెక్కలు వచ్చాయి.
ప్రధాని పూర్తి కాలం పదవిలో ఉంటారని పిఎంవో మంగళవారం స్పష్టం చేసింది. ఎన్నికలకు ముందే ప్రధాని పదవి రాజీనామా చేస్తారనే వార్తల్లో నిజం లేదని చెప్పింది. రాహుల్ గాంధీకి అవకాశం కల్పిస్తూ మన్మోహన్ సింగ్ ప్రధాని పదవి నుంచి తొలగిపోయే అవకాశాలున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

ఐదు రాష్ట్రాల శానససభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించాలనే డిమాండ్ ఓ వర్గం నుంచి గట్టిగా వినిపిస్తోంది. వచ్చే లోకసభ ఎన్నికల కోసం కాంగ్రెసు ప్రధాని అభ్యర్థిని ప్రకటించాలని కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం సోమవారంనాడు అన్నారు. ఇది తన అభిప్రాయం మాత్రమేనని, పార్టీ అభిప్రాయం కాదని ఆయన అన్నారు.
రాహుల్ గాంధీ ఈ మధ్య కాలంలో క్రియాశీలక పాత్ర నిర్వహిస్తున్నారు. కాంగ్రెసు పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని నిర్వహించారు. లోక్‌పాల్ బిల్లు గురించి, ఆదర్శ్ హౌసింగ్ కుంభకోణం గురించి మాట్లాడారు. పార్టీని రాహుల్ గాంధీ నడిపించాలని మన్మోహన్ సింగ్ పలుమార్లు అన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు కూడా చెప్పారు.
జనవరి 3వ తేదీన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన ప్రభుత్వ పనితీరుపై మన్మోహన్ సింగ్ మాట్లాడే అవకాశాలున్నాయని అంటున్నారు. రెండోసారి ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మన్మోహన్ సింగ్ ఐదుగురు సంపాదకులతో, కొంత మంది టీవీ చానెల్ సంపాదకులతో సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications