చెన్నైలో తెలంగాణ టెకీ కిడ్నాప్ సుఖాంతం : డబ్బు కోసం స్నేహితులే..

Subscribe to Oneindia Telugu

చెన్నై : చెన్నైలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపింది. టెకీని విడిచిపెట్టడానికి కోటి రూపాయలు డిమాండ్ చేసిన నిందితులు ఎట్టకేలకు పోలీసుల వలకు చిక్కగా.. కిడ్నాప్ కు ప్లాన్ చేసింది సదరు టెకీ స్నేహితులేనని తేలడం గమనార్హం.

వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన దేవరాజ్ అనే వ్యక్తి కుమారుడు ప్రేమ్ కుమార్‌ (28) తమిళనాడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. కాగా, అతను పనిచేస్తున్న కంపెనీ కాంచీపురం జిల్లా నావలూర్ లో ఉంది. ఇదే క్రమంలో గురువారం నాడు విధులు ముగించుకుని కంపెనీ నుంచి బయటకొచ్చిన ప్రేమ్ కుమార్ కేళంబాక్కంలోని తన గదికి వెళ్లేందుకు ఓ కారును లిఫ్ట్ అడిగాడు.

అయితే ముందస్తు పథకం ప్రకారమే అక్కడకు చేరుకున్న కిడ్నాపర్లు.. ప్రేమ్ కుమార్ లిఫ్ట్ అడగ్గానే అతన్ని కారులో ఎక్కించుకుని నిర్భంధించారు. అనంతరం తైయూరులోని ఓ అపార్ట్ మెంటుకి తీసుకెళ్లి అక్కడ బంధించారు. కిడ్నాప్ అనంతరం ప్రేమ్ కుమార్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి కోటి రూపాయలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. దీంతో కుమారుడికి ఏ అపాయం జరుగుతుందోనని కలవరపడ్డ తల్లిదండ్రులు వెంటనే తాళంబూర్ పోలీసులకు సమాచారం అందించారు.

ప్రేమ్ కుమార్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఉత్తర జోన్‌ ఐజీ సెంతామరైకన్నన్, కాంచీపురం ఎస్పీ ముత్తరసి సహా పలువురు సిబ్బంది ఘటనా ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. ఇదే క్రమంలో మరోసారి ప్రేమ్ కుమార్ తల్లిదండ్రులకు ఫోన్ చేసిన నిందితులు డబ్బు కోసం గట్టిగా డిమాండ్ చేశారు. అయితే అంత డబ్బు లేదని లక్ష వరకైతే సర్దగలమని చెప్పడంతో.. డబ్బు తీసుకుని కేళంబాక్కం బస్టాండ్ కు రావాల్సిందిగా కోరారు. అయితే డబ్బును ప్రేమ్ కుమార్ గదిలో ఉండే సందీప్ అనే వ్యక్తితో పంపించాల్సిందిగా డిమాండ్ చేశారు నిందితులు.

police chased techie kidnap in chennai

విషయాన్ని పోలీసులకు చెప్పడంతో.. ఓ పోలీస్ కానిస్టేబుల్ తో డబ్బును పంపించిన పోలీసులు వెనకాలే అతన్ని ఫాలో అవుతూ వెళ్లారు. అయితే పోలీసులు కళ్లు గప్పేందుకు రెండు సార్లు పలానా చోటుకు రావాలంటూ మకాం మార్చిన నిందితులు ఎట్టకేలకు శుక్రవారం తెల్లవారుజామున కోవళం రోడ్డు వద్ద పోలీసులకు పట్టుబడ్డారు.

అనంతరం వారిని విచారించగా తైయూర్ పెరియమానగర్ కు చెందిన పార్తిబన్, జయశీలన్ గా గుర్తించారు పోలీసులు. తర్వాత బంధీగా ఉన్న ప్రేమ్ కుమార్ ను విడిపించిన పోలీసులు కిడ్నాప్ వెనుక ప్రేమ్ కుమార్ స్నేహితులు ప్రవీణ్ బాలాజీ, వివేక్ రాజ్ ఉన్నట్లుగా తేల్చారు. డబ్బుకు ఆశపడి స్నేహితులే ప్రేమ్ కుమార్ ను కిడ్నాప్ చేసినట్లుగా నిర్దారించారు పోలీసులు. ప్రస్తుతం అదుపులో ఉన్న నిందితుల నుంచి మరిన్ని వివరాలు రాబడుతున్నారు పోలీసులు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
police chased techie kidnap in chennai. Atlast kidnappers were arrested kidnappers, and the kidnapped person premkumar was safely out from them

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X