హిస్సార్‌లో 'బాబా అరెస్ట్' ఉద్రిక్తం: అనుచరుల కాల్పులు
ఛండీగఢ్: హర్యానా రాష్ట్రం హిస్సార్‌లో గల సత్యలోక్ ఆశ్రమం వద్ద మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఓ హత్య కేసులో రామ్ పాల్ అనే స్వామీజీకి హర్యానా హైకోర్టు సోమవారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మంగళవారం అతనిని అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రామ్ పాల్ అనుచరుల పైన పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇరువైపుల కాల్పులు జరుగుతున్నాయి.
పోలీసులు కాల్పులు జరపగా.. రామ్ పాల్ ఆశ్రమంలో నుండి ఆయన అనుచరులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పలువురికి గాయాలయ్యాయి. బాబాను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసుల పైకి తిరగబడ్డ రామ్ పాల్ అనుచరులు ఏకంగా కాల్పులకు దిగడం గమనార్హం.

ప్రస్తుతం ఆశ్రమం వద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. భారీ సంఖ్యలో పోలీసులు మోహరించినా బాబా అనుచరులు వెనుకంజ వేయడం లేదు. మహిళా అనుచరులు కూడా పోలీసుల పైకి తిరగబడ్డారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ గోళాలను ప్రయోగించారు.
పోలీసులు రబ్బరు బుల్లెట్లను కూడా ప్రయోగించారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు. హైకోర్టు కఠిన ఆదేశాల నేపథ్యంలో రామ్ పాల్‌ను అరెస్ట్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు. మరిన్ని బలగాలను ఆశ్రమానికి రప్పిస్తున్నారు.
ముఖ్యమంత్రి అత్యవసర సమావేశం
హిసార్‌లోని బాబా రామ్ పాల్ ఆశ్రమం వద్ద నెలకొన్న తాజా పరిస్థితిపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. అందుబాటులో ఉన్న మంత్రులు, సీనియర్ అదికారులు ఈ భేటీ అయ్యారు.
అనుచరుల ధర్నా
హర్యానాలోని బాబా రామ్ పాల్ ఆశ్రమం వద్ద పోలీసుల దాడి చేశారంటూ బాబా మద్దతుదారులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆశ్రమంపై దాడి జరిగిందనే సమాచారం తెలియగానే ఢిల్లీలో దాదాపు వెయ్యి మందికి పైగా బాబా భక్తులు జంతర్ మంతర్ వద్ద పోగయ్యారు. ఆశ్రమంపై పోలీసు దాడి ఖండిస్తూ వారు రోడ్డుపై బైఠాయించారు. పోలీసు చర్యకు నిరసనగా ప్లకార్డులు చేతబట్టి ఆందోళన చేశారు. మహిళా భక్తులే ఎక్కువగా ఉన్నారు.
జర్నలిస్టులకు గాయాలు
రామ్ పాల్ ఆశ్రమం వద్ద జరుగుతున్న సంఘటనను షూట్ చేస్తున్న జర్నలిస్టుల పైన హర్యానా పోలీసులు దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. ఈ సంఘటనలో పలువురు జర్నలిస్టులకు గాయాలయ్యాయి.
కాగా, వివాదాస్పద బాబా రామ్ పాల్‌కు పంజాబ్, హర్యానా హైకోర్టు సోమవారం తాజాగా నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో రామ్ పాల్ సోమవారం విచారణకు హాజరు కాకపోవడంతో ఈ నెల 21న ఆయనను హాజరుపరచవలసిందిగా ఆదేశిస్తూ ఇద్దరు సభ్యులతో కూడిన హైకోర్టు ధర్మాసనం ఈ వారెంట్‌ను జారీ చేసింది.
రామ్‌పాల్ కోర్టుకు హాజరయ్యేందుకు చేసిన భద్రతా ఏర్పాట్లకు ఎంత మొత్తాన్ని ఖర్చు చేశారన్న దానిపై వివరాలను తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు పంజాబ్, హర్యానా ప్రభుత్వాలను, చండీగఢ్ అధికార యంత్రాంగాన్ని న్యాయస్థానం ఆదేశించింది. ఇదిలావుంటే, రామ్ పాల్ అనారోగ్యంతో బాధపడుతున్నారని, దీంతో ఆయనను చికిత్స నిమిత్తం హిస్సార్ జిల్లాలోని బర్వాలా ఆశ్రమం నుంచి రహస్య ప్రాంతానికి తరలించడం జరిగిందని మద్దతుదారులు చెప్పారు.












Click it and Unblock the Notifications