రాహుల్ , ప్రియాంకా గాంధీలతో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ .. దేశ రాజకీయాల్లో ఆసక్తి
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తాను చేస్తున్న పనిని వదిలేస్తానని, కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకుంటానని చెప్పిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజాగా రాహుల్ గాంధీని కలవడం దేశ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు కారణమవుతుంది. ప్రశాంత్ కిషోర్ రాహుల్ గాంధీ తో కలిసిన సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ప్రియాంక గాంధీ వాద్రా, కేసి వేణుగోపాల్ కూడా హాజరైనట్లుగా తెలుస్తుంది.

రాహుల గాంధీ నివాసంలో రాహుల్, ప్రియాంకా గాంధీలతో భేటీ అయిన పీకే
ప్రశాంత్ కిషోర్ ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసానికి వెళ్ళి అక్కడ రాహుల్ గాంధీతో మాట్లాడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ నేతలతో పీకే చర్చించనున్నట్లు సమాచారం. ఇప్పటికే బిజెపికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అతిపెద్ద రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు కోసం వివిధ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో, రాహుల్ గాంధీని పీకే కలవడం ఆసక్తికరంగా మారింది.

బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు చేసే పనిలో అంటూ చర్చ
కాంగ్రెస్ పార్టీతో కలిసి అతిపెద్ద రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు చేస్తారా లేదా? కాంగ్రెస్ పార్టీ లేకుండానే ఇతర పార్టీలన్నీ కలిపి రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు అవుతుందా అన్న చర్చ కొనసాగుతున్న సమయంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీ లేకుండా బిజెపియేతర అతిపెద్ద రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు సాధ్యం కాదని తేల్చి చెప్పారు. అంతేకాదు 2024 లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) కు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల జాతీయ ఫ్రంట్ గురించి శరద్ పవార్, ప్రశాంత్ కిషోర్ జూన్ 21 న సమావేశమయ్యారు.

ఇప్పటికే శరద్ పవార్ ను కలిసిన పీకే .. తాజాగా రాహుల్ తో భేటీ
ఎన్‌సిపి చీఫ్ నివాసంలో కిషోర్ మరియు పవార్ మధ్య జరిగిన సమావేశం సుమారు ఒకటిన్నర గంటలు కొనసాగింది. దీనికి ముందు శరద్ పవార్ మరియు ప్రశాంత్ కిషోర్ జూన్ 11న ముంబైలో దాదాపు మూడు గంటలు సమావేశమయ్యారు. ఇప్పుడు తాజాగా రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు ప్రక్రియలో భాగంగానే రాహుల్ గాంధీని పీకే కలిశారని వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో కొద్ది రోజుల క్రితం ప్రశాంత్ కిషోర్ రాహుల్ గాంధీని ప్రశంసించడం భవిష్యత్తు నేత రాహుల్ నే అంటూ వ్యాఖ్యలు చేయడం కూడా కొత్త రాజకీయ సమీకరణాలకు కారణంగా కనిపిస్తుంది.












Click it and Unblock the Notifications