టీటీవీ దినకరన్ ఈసీ లంచం కేసు: జడ్జికే ఫోన్ చేసి బెదిరించారు, మరో కేసు!
రెండాకు చిహ్నం కోసం ఎన్నికల కమిషన్ కు రూ. 50 కోట్లు లంచం ఎర వేశారని నమోదు అయిన కేసు విచారణ చేస్తున్న న్యాయమూర్తికి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్లు చేసి బెదిరించారని వెలుగు చూసింది.
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్ కు రూ. 50 కోట్లు లంచం ఎర వేశారని నమోదు అయిన కేసు విచారణ చేస్తున్న న్యాయమూర్తికి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్లు చేసి బెదిరించారని వెలుగు చూసింది. న్యాయమూర్తికే ఫోన్ చేసి బెదిరించిన నిందితుల కోసం ఢిల్లీ పోలీసులు గాలిస్తున్నారు.
అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం కోసం ఎన్నికల కమిషన్ కు లంచం ఎర వేశారని తెలుసుకున్న ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు ఢిల్లీలోని బ్రోకర్ సుఖేష్ చంద్రశేఖర్ ను అరెస్టు చేశారు. సుఖేష్ చంద్రశేఖర్ నుంచి రూ. 1.3 కోట్ల నగదు, రెండు విలాసవంతమైన కార్లు స్వాధీనం చేసుకున్నారు.

టీటీవీ దినకరన్ అరెస్టు
ఎన్నికల కమిషన్ కు లంచం ఎరవేశారని నమోదు అయిన కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న టీటీవీ దినకరన్ ను సైతం అరెస్టు చేసి తీహార్ జైలుకు పంపించారు. ఇదే కేసులో అనేక మందిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

ఢిల్లీతో పెట్టుకుంటారా ?
ఢిల్లీలోని హసరి ప్రత్యేక కోర్టు ఉంది. ఈ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పూనమ్ చౌధరి ఎన్నికల కమిషన్ లంచం కేసు విచారణ చేస్తున్నారు. ఈకేసులో మొదట అరెస్టు అయిన బ్రోకర్ సుఖేష్ చంద్రశేఖర్ కు బెయిల్ ఇప్పించాలని అతని న్యాయవాదులు కోర్టులో అనేక సార్లు ప్రయత్నించారు.

బెయిల్ ఇవ్వలేదని జడ్జినే బెదిరించారు
సుఖేష్ చంద్రశేఖర్ కు బెయిల్ ఇవ్వడానికి న్యాయమూర్తి పూనమ్ చౌధరి నిరాకరించారు. ఈ సందర్బంలో గుర్తు తెలియని వ్యక్తులు న్యాయమూర్తి పూనమ్ చౌధరికి ఫోన్ చేసి వెంటనే సుఖేష్ చంద్రశేఖర్ కు జామీను మంజూరు చేసి విడుదల చెయ్యాలని హెచ్చరించారు.

సీన్ రివర్స్, మరో కేసు
సుఖేష్ చంద్రశేఖర్ కు జామీను మంజూరు చెయ్యకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని నిందితులు జడ్జిని హెచ్చరించారు. న్యాయమూర్తి పూనమ్ చౌధరి ఫిర్యాదు చెయ్యడంతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి రంగంలోకి దిగారు. ఈ విషయంలో సుఖేష్ ను విచారించాలని పోలీసు అధికారులు నిర్ణయించారు.

తిక్కచేష్టలు చేసింది ఎవరు ?
ఎన్నికల కమిషన్ కు లంచం ఎరవేశారని అరెస్టు అయ్యి తీహార్ జైల్లో ఉన్న టీటీవీ దినకరన్ ను సైతం విచారించి వివరాలు సేకరించాలని ఢిల్లీ పోలీసు అధికారులు భావించారని తెలిసింది. ఇలాంటి పిచ్చిచేష్టలు చేస్తూ న్యాయమూర్తికి బెదిరింపు ఫోన్లు చేసిన వ్యక్తులు పోలీసులకు చిక్కితే కచ్చితంగా సినిమా చూపిస్తారాని తెలిసింది.












Click it and Unblock the Notifications