వ్యవసాయ రంగానికి రిలీఫ్.. అన్ని మంత్రిత్వ శాఖలు తిరిగి యాక్టివ్.. మోదీ కీలక నిర్ణయాలు?
లాక్ డౌన్ పొడగింపుపై సర్వత్రా చర్చ జరుగుతున్న వేళ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యమంత్రులు అభిప్రాయాలు,సూచనలను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ తర్వాత ఆయా రాష్ట్రాల సీఎంలు చేసిన సూచనలు కూడా బయటకొచ్చాయి. అయితే కాన్ఫరెన్స్‌లో ప్రధాని ఏం చెప్పారన్నది మాత్రం తెలియరాలేదు. దీనిపై ప్రముఖ జాతీయ మీడియా ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.

అన్ని మంత్రిత్వ శాఖలు తిరిగి యాక్టివ్..
వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రుల అభిప్రాయాలు,సూచనలు విన్న తర్వాత.. లాక్ డౌన్ పొడగింపు విషయంలో రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం ఉన్నట్టు కనిపిస్తోందని మోదీ పేర్కొన్నట్టు సమాచారం. ఇక ఏప్రిల్ 13వ తేదీ నుంచి ప్రభుత్వ వర్గాలు పూర్తి స్థాయిలో పనిచేస్తాయని వెల్లడించినట్టు తెలుస్తోంది. కౌన్సిల్‌లోని మంత్రులందరూ సోమవారం నుంచి ఆయా మంత్రిత్వ శాఖల్లో తిరిగి విధులు ప్రారంభించాలని కోరినట్లు సమాచారం. సోషల్ డిస్టెన్స్ చర్యలు చేపడుతూనే విధులు నిర్వహించాలని సూచించారు.

వ్యవసాయ రంగానికి రిలీఫ్..
కేంద్రం పరిధిలో పనిచేస్తున్న సీనియర్ అధికారులందరినీ సోమవారం(ఏప్రిల్ 13) నుంచి విధులకు రావాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు రొటేషన్ పద్దతిలో పనిచేస్తున్న క్లాస్-2,3,4 ఉద్యోగులను తిరిగి పూర్తి స్థాయిలో విధులకు పిలుస్తారని తెలుస్తోంది. రాష్ట్రాల ప్రతిపాదన మేరకు లాక్ డౌన్ నుంచి వ్యవసాయ రంగానికి మినహాయింపునివ్వడానికి కేంద్రం అంగీకరించినట్టు సమాచారం. ఇక భారీ పరిశ్రమల విషయంలో ప్రభుత్వం పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపి ఉత్పత్తిని పునరద్దరించే అవకాశం కనిపిస్తోంది. లాక్ డౌన్ కారణంగా పరిశ్రమలకు తలెత్తిన సమస్యల పరిష్కారంపై కేంద్రం దృష్టి సారించింది.
అయితే అంతరాష్ట్ర రవాణా,ఎయిర్ లైన్స్,రవాణా విషయంలో మోదీ ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదని సమాచారం.

లాక్ డౌన్ పొడగింపుపై చర్చ..
లాక్ డౌన్ పొడగించడమే మంచిదని వీడియో కాన్ఫరెన్స్‌లో చాలామంది ముఖ్యమంత్రులు అభిప్రాయపడ్డారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్,తెలంగాణ సీఎం కేసీఆర్ సహా పలువురు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒడిశా,పంజాబ్,కర్ణాటక రాష్ట్రాలు ఇప్పటికే లాక్ డౌన్‌ను మరో 2 వారాలు పొడగించాయి. తమిళనాడు,రాజస్తాన్ కూడా అదే బాటలో నడిచే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా లాక్ డౌన్ పొడగింపుకు సుముఖంగానే ఉండవచ్చునన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకటి,రెండు రోజుల్లో ప్రధాని మోదీ దీనిపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications