ఆ విషయం మోడీ సాహెబ్‌కు బాగా తెలుసు: ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయదుందుభి మోగించింది. పంజాబ్ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ ఘన విజయాన్ని అందుకుంది. తన నాలుగు రాష్ట్రాలను తాను నిలబెట్టుకోగలిగింది. ఈ నాలుగు చోట్ల కూడా వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా.. కాషాయమయం అయ్యాయి. ఈ నాలుగింటితో పాటు పంజాబ్‌లో కాంగ్రెస్ మాయమైంది.

నాలుగు రాష్ట్రాల్లో జైత్రయాత్ర..
ఉత్తర ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభంజనం వీచింది. ఒంటి చేత్తో పార్టీని విజయతీరాలకు చేర్చారాయన. ఉత్తరాఖండ్‌లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ-కాంగ్రెస్ మధ్య హోరాహోరి పోరు ఉంటుందని అంచనా వేసినప్పటికీ అవి తలకిందులయ్యాయి. ఇక్కడ బీజేపీ విజయం నల్లేరు మీద నడకే. మణిపూర్‌లో పూర్తిస్థాయి మెజారిటీని సాధించింది. గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలానికి బీజేపీ ఒక్క సీటు దూరంలో ఆగింది.

ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలు..
ఈ అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ పెద్దగా వార్తల్లో కనిపించని ఆయన- ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు ఉదయమే తెర మీదికి వచ్చారు. తన అధికారిక మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌పై ప్రత్యక్షం అయ్యారు. తన అభిప్రాయాలను పంచుకున్నారు. కీలక వ్యాఖ్యలు చేశారు. అవి కాస్తా వైరల్‌గా మారాయి.

సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కావాలి..
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీపై యుద్ధానికి- రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకూ సంబంధం లేదని స్పష్టం చేశారు. దేశం కోసం సాగించే పోరాటం 2024లో ఉంటుందని పేర్కొన్నారు. 2024 నాటి సార్వత్రిక ఎన్నికలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఢీ కొట్టడానికి సార్వత్రిక ఎన్నికల యుద్ధానికి సిద్ధం కావాల్సి ఉంటుందని సూచించారు. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు- సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపబోవని ఆయన పరోక్షంగా చెప్పుకొచ్చారు.

సాహెబ్‌కు తెలుసు..
ఈ విషయం సాహెబ్ (ప్రధానమంత్రి నరేంద్ర మోడీ)కు బాగా తెలుసునని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. ప్రజల్లో ఒక రకమైన ఉన్మాదకర వాతావరణాన్ని సృష్టించడంలో ఆయన విజయవంతం అయ్యారని పేర్కొన్నారు. ఫలితంగా- ప్రతిపక్షాలపై మానసికంగా పైచేయి సాధించారని వ్యాఖ్యానించారు. ఇది ఎంతోకాలం పాటు కొనసాగే అవకాశాలు లేదని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి తప్పుడు కథనాల వలలో చిక్కుకోవద్దని ప్రశాంత్ కిశోర్ విజ్ఞప్తి చేశారు.
Recommended Video

విజయానికి కారణాలివే..
ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ తన మిత్రపక్షాలతో కలుపుకొని 273 స్థానాలను గెలుచుకుంది. యోగి ఆదిత్యనాథ్ ప్రభంజనం స్పష్టంగా కనిపించింది. ఒంటి చేత్తో పార్టీని విజయతీరాలకు చేర్చారాయన. అవినీతి రహిత పరిపాలనను అందించడం, శాంతిభద్రతలను కాపాడటం, మహిళలకు రక్షణ కల్పించడం, విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలకు తోడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఛరిష్మా.. బీజేపీకి విజయానికి కారణాలయ్యాయంటూ విశ్లేషణలు వెలువడుతున్నాయి.












Click it and Unblock the Notifications