"జ్ఞానేష్ మాత్రమే కాదు. గతంలో ఆయన కూడా"-ప్రశాంత్ కిషోర్ సంచలనం..!
ఎస్ఐఆర్ అక్రమాల నేపథ్యంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు దేశవ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘంలో తోటి కమిషనర్ల అభ్యంతరాలు లెక్కచేయకుండా ఆయన తీసుకున్నట్లు చెబుతున్న నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. ఆ తర్వాత ఈసీ దిద్దుబాటు చర్యలు తీసుకున్నా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో ఇప్పుడు సీఈసీ జ్ఞానేష్ రాజీనామా చేసినా విపక్షాలు, కాక్రోచ్ జనతా పార్టీ, విద్యార్ధులు వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలో జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, బీహార్ ఎమ్మెల్యే ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) ఈ వివాదంపై స్పందించారు. జ్ఞానేష్ కుమార్‌కు ముందు రాజీవ్ కుమార్ ఉండేవారని, ఆయన కూడా ఎన్నికల సంఘాన్ని దాదాపు ఇదే పద్ధతిలో నడిపారని పీకే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన పదవీ విరమణ తర్వాత, దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు అయిన హెచ్‌డిఎఫ్‌సికి ఛైర్మన్‌గా నియమితులయ్యారని గుర్తుచేశారు. కాబట్టి, ఎన్నికల సంఘం యొక్క ప్రతిష్ట, విశ్వసనీయత ప్రమాదంలో ఉన్నాయన్నారు. ఇది ఏ ఒక్క వ్యక్తి వల్లనో లేదా ఒకే ఒక్క సంఘటన వల్లనో కాదన్నారు.

గత ఏడు, ఎనిమిది సంవత్సరాలుగా, ఓటర్ల జాబితాల తయారీ, ఎన్నికల షెడ్యూల్, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, బీహార్‌లో ప్రభుత్వం రూ.10వేలు లంచాలు ఇచ్చి ఓట్లు కొనడం వంటి ఉదంతాలు, లేదా ఓట్ల లెక్కింపులో అవకతవకలు వంటి ప్రతి విషయంలోనూ, ఎన్నికల సంఘం బహిరంగంగా ప్రభుత్వానికి, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు కనిపించిందన్నారు. అందుకే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగడం లేదని ప్రజలు భావిస్తున్నారన్నారు. ఇది నిరసనలకు దారితీస్తోందన్నారు. జ్ఞానేష్ కుమార్ పదవి నుంచి వైదొలగాలని, కానీ అంతకంటే ముఖ్యంగా, ఎన్నికల సంఘంలోనే సంస్కరణలు జరగాలన్నారు. ఎన్నికల కమిషనర్ల నియామకంలో సంస్కరణలు అవసరమని, ఓటర్ల జాబితాలను సంకలనం చేసే ప్రక్రియను మెరుగుపరచాలని కోరారు. ఫారం 17ను ప్రవేశపెట్టాలని, ఓట్ల లెక్కింపు రోజుకు ముందే ఫలితాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించడానికి మొత్తం లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ప్రశాంత్ కిషోర్ వరుస డిమాండ్లు చేశారు.














Click it and Unblock the Notifications
