కొత్త బాధ్యతల్లో ప్రశాంత్ కిషోర్ : జాతీయ స్థాయిలో -జగన్ ను ఒప్పిస్తారా : టీడీపీ రోల్ కీలకంగా..!!
అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో జాతీయ సమీకరణాల్లో మార్పులు మొదలయ్యాయి. కాంగ్రెస్ లో అంతర్మధనం మొదలైంది. ఎలాగైనా ప్రధాని మోదీ - బీజేపీకి ధీటుగా అడుగులు వేయాలని ప్రత్యర్ధి పార్టీ లు ఒక్కటయ్యే ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ తో కలిస్తేనే అది సాధ్యమని ఆ పార్టీ మద్దతుగా నిలుస్తున్న పార్టీలు స్పష్టం చేస్తున్నాయి. ఇందు కోసం కాంగ్రెస్ తో దూరంగా ఉన్న పార్టీలను సైతం దగ్గర చేసేందుకు తిరిగి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బాధ్యతలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా గతంలోనే కాంగ్రెస్ లోనే చేరుతారనే ప్రచారం సాగినా..చేరని..పీకే ఇప్పుడు తిరిగి తన ఆలోచన మార్చుకు న్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ వేదికగా జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలనే నిర్ణయానికి వచ్చారు.

కొత్త బాధ్యతల్లో ప్రశాంత్ కిషోర్
2024 ఎన్నికల నాటికి బీజేపీ దీటుగా పోటీ ఇవ్వాలంటే కాంగ్రెస్ బలపడటంతో పాటుగా ప్రాంతీయ పార్టీలను ఒకే వేదిక మీదకు తీసుకురావటం పైన ఫోకస్ పెడుతున్నారు. ఇదే అంశం పైన ప్రశాంత్ కిషోర్ తాజాగా.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకలతో కలిసి చర్చించినట్లు సమాచారం. దీంతోపాటు ప్రాంతీయ పార్టీలను జాతీయ స్థాయిలో ఒక కూటమిగా ఏర్పరిచేందుకు ఆయా పార్టీల నేతలతో చర్చలు జరిపారని తెలుస్తోంది. మమతా బెనర్జీ, శరద్ పవార్, స్టాలిన్, ఉద్ధవ్ ఠాక్రే, అఖిలేశ్ యాదవ్, కేసీఆర్, హేమంత్ సోరెన్, అరవింద్ కేజ్రీవాల్‌లతో ప్రశాంత్ కిశోర్‌కు ఉన్న సంబంధాలతో అందరినీ ఒకే వేదికపైకి ఆయన తీసుకురాగలరని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. కాంగ్రెస్ పార్టీలో తీసుకురావాల్సిన సమూల మార్పుల పైన సమాచాలోచనలు చేస్తున్నారు.

సఖ్యత ఉన్న పార్టీలతో మంతనాలు
అయితే, కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత్ కిషోర్ కోరిన విధంగా పార్టీ అధినాయకత్వం అంత స్వేచ్ఛ ఇస్తుందా లేదా.. ఆ పార్టీలో ఆయన పాత్ర ఏంటి.. చివరకు కాంగ్రెస్ లో అధికారిక ఎంట్రీ పైన ఇంకా ప్రశాంత్ కిషోర్ 10, జన్ పథ్ నుంచి క్లారిటీ వచ్చాక ఫైనల్ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. అయితే, ఇదే సమయంలో తనకు సత్సంబంధాలు ఉన్న నేతలను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి..జాతీయ స్థాయిలో వారంతా క్రియాశీలకంగా- కీలకంగా వ్యవహరించే విధంగా కొత్త ప్రణాళికలు ప్రశాంత్ కిషోర్ సిద్దం చేస్తున్నట్లు సమాచారం. ప్రశాంత్ కిషోర్ ప్రభావం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల పైన ఉంది. అటు టీఆర్ఎస్..ఇటు వైసీపీకి ఆయన రాజకీయ వ్యూహకర్తగా పని చేస్తున్నారు. తాజాగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ప్రశాంత్ కిషోర్ పైన ప్రశంసలు కురిపించారు.

జగన్ అడుగుల పై ఆసక్తి
ఆయన డబ్బులు తీసుకోరని..ఆయనతో కలిసి పని చేస్తున్నామని వెల్లడించారు. ఇప్పుడు కేసీఆర్ లక్ష్యం సైతం బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం. ఇక, ఇప్పుడు జగన్ పైన ఇదే సమయంలో ఏపీ బీజేపీ నేతలు ఆరోపణల తీవ్రత పెంచారు. విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ, సీఎం జగన్ కు అటు ప్రధాని - షా తో సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. దీంతో..సీఎం నేరుగా ఎక్కడా బీజేపీ పైన విమర్శలు చేయటం లేదు. రాజకీయంగా బీజేపీ నేతల విమర్శలకు వైసీపీ ముఖ్యులు సమాధానం ఇస్తున్నారు. ఇక, 2024 ఎన్నికల్లో తిరిగి 2014 పొత్తులు ఏపీలో రిపీట్ అవుతాయనే అంచనాలు కనిపిస్తున్నాయి. కానీ, వైసీపీ ఒంటరిగానే పోటీ చేయనుంది. జాతీయ స్థాయిలో కేంద్రానికి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు అయితే, వారితో జగన్ నాయకత్వంలోని వైసీపీ కలుస్తుందా లేదా అనే చర్చ వినిపిస్తోంది.

టీడీపీ తో క్లారిటీ వచ్చానకే నిర్ణయం
దక్షిణాదిలో కర్ణాటక మినహా దాదాపు అన్ని రాష్ట్రాల్లోని అధికార పార్టీలు రాజకీయంగా బీజేపీకి వ్యతిరేకంగా పని చేస్తున్నాయి. అయితే, జగన్ ఇదే సమయంలో కాంగ్రెస్ నాయకత్వం వహిస్తే..ఆ కూటమిలోనూ చేరటానికి సిద్దంగా లేరని సమాచారం. దీంతో పాటుగా ఇప్పటికిప్పుడు బీజేపీ వ్యతిరేకంగా ఏర్పడే కూటమిలో చేరే ఛాన్స్ లేదని చెబుతున్నారు. ఎన్నికల వరకు జగన్ స్టాండ్ లో మార్పు ఉండదని విశ్లేషకుల అంచనా. ప్రశాంత్ కిషోర్ జాతీయ స్థాయిలో ఎటువంటి రాజకీయాలు చేసినా.. ఏపీలో మాత్రం వైసీపీకి రాజకీయ వ్యూహకర్త పాత్రకే పరిమితం అని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. అయితే, బీజేపీ మరింతగా వైసీపీని టార్గెట్ చేసినా.. అదే విధంగా టీడీపీతో జత కట్టినా.. బీజేపీ పైన జగన్ విధానం మారే అవకాశం ఉందని విశ్లేషకుల అభిప్రాయం. దీంతో..ఇప్పుడు ఏపీతో పాటుగా జాతీయ స్థాయి రాజకీయాల్లో జగన్ అడుగులు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications