బడ్జెట్ సమావేశాల తొలిరోజే రచ్చ -రాష్ట్రపతి ప్రసంగం మధ్యలో ఆర్ఎల్‌పీ ఎంపీ హల్‌చల్ -మార్షల్స్ ఎంట్రీ
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలిరోజే సభలో రచ్చ చోటుచేసుకుంది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, రైతులు చేస్తోన్న ఆందోళనలకు మద్దతుగా కాంగ్రెస్ సహా 16 ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించగా, సభకు హాజరైన పార్టీల ఎంపీలు సైతం తీవ్ర నిరసనను తెలిపారు. శుక్రవారం ఉదయం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ(ఆర్ఎల్‌పీ)కి చెందిన ఎంపీ హనుమాన్ బెనివాల్ హల్‌చల్ చేశారు.
వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ ఆర్ఎల్‌పీ ఎంపీ బెనివాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ''మూడు నల్ల చట్టాలు ఉపసంహరించుకోవాలి'' అని ఇంగ్లీషులో రాసిన ఫ్లకార్డులు చూపిస్తూ పదే పదే నినాదాలు చేశారు. బెనివాల్ నినాదాలు చేస్తున్నప్పటికీ ఎలాంటి ఇబ్బందికీ లోను కాకుండా రాష్ట్రపతి తన ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే..

ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు, ప్లకార్డు ప్రదర్శనతో సభకు ఆటంకం కలిగిస్తోన్న సదరు ఎంపీని పార్లమెంట్ మార్షల్స్ సభ నుంచి తీసుకెళ్లారు. అనంతరం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ప్రసంగాలు ప్రశాంతంగా కొనసాగాయి. ప్రసంగాల అనంతరం ఉభయ సభలు ఫిబ్రవరి 1కి వాయిదా పడ్డాయి. అదే రోజు కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఇక..

బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడిన రాష్ట్రపతి కోవింద్.. రైతుల సంక్షేమం కోసమే కొత్త వ్యవసాయ చట్టాలు తెచ్చామని, ఆత్మనిర్భర్‌తో స్వయం సమృద్ధికి అడుగులు వేస్తున్నామని ఉద్ఘాటించారు. రైతుల నిరసనల్లో భాగంగా రిపబ్లిక్ డే నాటి ట్రాక్టర్ ర్యాలీ, అనంతర ఘటనలు దురదృష్టకరమని, జాతీయ జెండాను అవమానించడం విద్రోహచర్య అని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications