తెలంగాణ నూతన సీఎస్ గా - రేవంత్ ఛాయిస్..!!
తెలంగాణ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరు. ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం నెలాఖరుతో ముగియనుంది. ఇప్పటికే ఆయన కేంద్రం ఇచ్చిన ప్రత్యేక వెసులుబాటు తో గడువు పొడిగించటంతో సీఎస్ గా కొనసాగుతున్నారు. దీంతో.. కొత్త సీఎస్ గా ఎవరికి అవకాశం దక్కుతుంది అనేది చర్చగా మారింది. ముగ్గురు సీనియర్ అధికారులు రేసులో ఉన్నారు. అయితే, సీఎం రేవంత్ ఈ విషయంలో ఎవరికి అవకాశం ఇస్తారనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఎవరికనేది అధికార వర్గాల్లో చర్చగా మారింది. గతేడాది ఆగస్టు 31న రామకృష్ణారావు పదవీ కాలం ముగిసినప్పటికీ ఆయనను కొనసాగించాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకు రామకృష్ణారావు పదవీ కాలాన్ని ఏడు నెలలు కేంద్రం పొడిగించింది. మార్చి 31న ఆ సమయం కూడా ముగియగా మరింత కాలం పొడిగించాలని మరోసారి రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించటంతో ఆ గడువు ఈ నెల 30న ముగియనుంది. ఈ రేసులో ప్రస్తుతం రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ , అర్బన్ డెవలప్‌మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న డాక్టర్ జయేష్ రంజన్ అందరికంటే ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది.

సీఎం రేవంత్ నిర్ణయం పై ఉత్కంఠ
జయేశ్ రంజన్ రాష్ట్రంలో ఐటీ ఎగుమతుల పెంపు, స్టార్టప్ ఎకోసిస్టమ్ బలోపేతం, గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షించడంలో కీలకంగా వ్యవహరించారు. రేసులో జయేష్ రంజన్‌తో పాటు మరికొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. రవాణా, ఆర్ అండ్ బీ ప్రత్యేక సీఎస్ వికాస్‌రాజ్ 2028 మార్చి, ఫ్లాగ్‌షిప్ పథకాల అమలు విభాగం ప్రత్యేక సీఎస్ సవ్యసాచి ఘోష్ 2027 ఏప్రిల్ వరకు సర్వీసులో ఉండనున్నారు. నవీన్ మిత్తల్, దానకిషోర్, వాణిప్రసాద్ కూడా ప్రత్యేక సీఎస్ హోదాలో ఉన్నారు. దీంతో.. వీరిలో సీఎం రేవంత్ ఎవరికి అవకాశం ఇస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. జయేశ్ రంజన్ కు అవకాశం దక్కుతుందనే అభిప్రాయం అధికార వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తోంది.













Click it and Unblock the Notifications