అదే మనకు బలం, జమిలి ఎన్నికలే ఉత్తమం: ప్రణబ్ ముఖర్జీ సందేశం
పార్లమెంటుకు, శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడమే ఉత్తమమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు.
న్యూఢిల్లీ: పార్లమెంటుకు, శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడమే ఉత్తమమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. రాజకీయపార్టీలతో చర్చించి ఈ ఆలోచనను ఆచరణలోకి తీసుకురావడంపై ఎన్నికల సంఘం దృష్టి సారించాలని సూచించారు. గురువారం జరగనున్న 68వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం రాష్ట్రపతి జాతినుద్దేశించి ప్రసంగించారు.
పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం సమర్థనీయమని చెప్పారు. దీనివల్లతలెత్తే ఇబ్బందులు తాత్కాలికమేనని అన్నారు. 'అవినీతిపై పోరాటం, నల్లధనాన్ని అరికట్టే ప్రయత్నంలో తీసుకొచ్చిన నోట్లరద్దు కారణంగా తాత్కాలికంగా ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదించాయి. ఇబ్బందులు తలెత్తాయి. లావాదేవీలు నగ దు రహితంగా మారటం వల్ల మన ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుంది' అని ముఖర్జీ స్పష్టం చేశారు.
బహుళత్వంలోనే దేశ బలం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు సుస్థిరాభివృద్ధికి లక్షించినవేనని ఆయనన్నారు. '2016-17 ప్రథమార్థంలో వృద్ధిరేటు 7.2గా ఉంది. మనం ఆర్థిక స్థిరత్వం దిశగా వెళ్తున్నాం. ద్రవ్యోల్బణం కూడా సౌకర్యవంతంగానే ఉంది. ఇన్నాళ్లుగా జరుగుతున్న ప్రయత్నం దేశాన్ని ముందుకు తీసుకెళ్తోంది. అయితే పరిస్థితులకు అనుగుణంగా వ్యవస్థలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది' అని తెలిపారు.
అశాంతితో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రాంతంలో భారత ప్రజాస్వామ్యం మాత్రం ఆరున్నర దశాబ్దాలకు పైగా ఎడారిలో ఒయాసిస్సులా పరిఢవిల్లుతోందంటే ఆ ఖ్యాతి మన ప్రజాస్వామ్య వ్యవస్థల్ని నిర్మించిన వ్యవస్థాపకులదేనన్నారు. 'మనకు 15.8.1947న స్వాతంత్య్రమైతే వచ్చినా సొంత పాలన వ్యవస్థ అప్పటికి లేదు. అందువల్లనే 1950 జనవరి 26 వరకు వేచిఉన్నాం' అని తెలిపారు.

'భారత పౌరులందరికి భద్రత, సమాన న్యాయం, స్వేచ్ఛ, అనేక రకాల సమానత్వాలను ప్రసాదించే రాజ్యాంగాన్ని భారతీయులు ఆ రోజు తమకు తాము అంకితం ఇచ్చుకున్నారు. సోదరభావం, వ్యక్తిగత గౌరవం, దేశ ఐక్యత, సమగ్రతలను పెంపొందిస్తామని మనం వాగ్దానం చేసుకున్నాం. ఆరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ అవతరించింది. స్వాతంత్య్ర భారతంలో జన్మించిన చాలామంది స్వాతంత్య్రపు సముపార్జన విలువను మరిచిపోతుంటారు. నిరంతరం జాగ్రత్తగా చూసుకుంటూ స్వాతంత్య్రమనే చెట్టుకు పోషణ అందించాలనేది విస్మరిస్తుంటారు. ప్రజాస్వామ్యం మనకు హక్కులతో పాటు బాధ్యతల్నీ ఇచ్చింది. మన సంప్రదాయంలో వాదనపటిమ ఉంది గానీ అసహనం లేదు' అని పేర్కొన్నారు.
సహనశీలతకు పరీక్ష
భారతదేశంలో శతాబ్దాలుగా భిన్న ఆలోచనలు, భిన్న సిద్ధాంతాలు ఒకదానితో ఒకటిశాంతియుతంగా పోటీపడ్డాయని.. దేశ గొప్పదనమంతా భిన్నత్వం, బహుళత్వంలోనే ఉందన్నారు. 'మన దేశంలోని బహుళత్వం, సహనశీలతకు కొన్ని శక్తులు పరీక్ష పెడుతున్నాయి. జాగ్రత్తగా గమనించి ముందడుగేయాల్సిన అవసరం ఉంది' అని రాష్ట్రపతి సూచించారు. ఉగ్రవాదంపై పోరు జరుపుతూనే మన సైనికుల సంక్షేమం గురించీ మరింత దృష్టిపెట్టాలన్నారు. అంతకుముందు, జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనూ ఒకేసారి పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు జరపాలన్న ఆలోచనకు ప్రణబ్ మద్దతు తెలిపారు.
మరింత కష్టపడదాం
'గణతంత్ర వేడుకల సందర్భంగా మన వ్యవస్థల్లో లోపాలను గుర్తించి సరిదిద్దుకోవాలి. ఎన్నికల సంస్కరణలపై నిర్మాణాత్మక చర్చ జరగాలి. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు ఎలా జరిగేవో ఇప్పుడూ అలాగే జరిగేలా చూడాలి. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకొనేందుకు మరింత కష్టపడి పనిచేయాలి' అని అన్నారు.
'ప్రతీ కన్నీటిచుక్కనూ తుడవాలన్న గాంధీజీ లక్ష్యం ఇంకా నెరవేరలేదు. గ్రామీణ ప్రజలూ నాణ్యమైన జీవనాన్ని సాగించేలా మెరుగైన వసతులు కల్పించాలి. యువతకు ఇంకా మంచి అవకాశాలు కల్పించాలి. మహిళలు, పిల్లలకు రక్షణ కల్పించాలి. ఉగ్రవాదాన్ని ఆమడ దూరంలో ఉంచాలి. మన తల్లి ముందు అందరం సమానమే. మనం ఏ పాత్ర పోషిస్తున్నా దానిలో నిజాయతీ, అంకితభావం, విధేయతలతో, రాజ్యాంగ విలువల పట్ల నిబద్ధతతో పనిచేయాలని భరతమాత కోరుతోంది. జైహింద్' అని ప్రణబ్ తన గణతంత్ర ప్రసంగాన్ని ముగించారు.












Click it and Unblock the Notifications