ప్రధాని మోదీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ - పీఎంఓ ఫిర్యాదు : పునరుద్దరణ..!!
భారత ప్రధాని నరేంద్రమోదీ ట్విటర్ అకౌంట్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఈ తెల్లవారు జామున ప్రధాని ట్విట్టర్ ఎకౌంట్ కొద్ది సేపు హ్యాక్ అయినట్లుగా గుర్తించారు. ప్రధాని మోదీ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాలో అగంతకులు బిట్ కాయిన్ ను ఉద్దేశిస్తూ పోస్టింగ్ చేసారు. భారత్ లో బిట్ కాయిన్‌లను లీగల్ చేశామని వాటిని కోనాలని ట్వీట్ చేశారు. 500 బిట్ కాయిన్‌లు పంచుతున్నామంటూ హ్యాకర్లు లింకు ట్వీట్ చేశారు. దీంతో అప్రమత్తమైన పీఎంవో అధికారులు ట్విట్టర్ సంస్థను సమాచారం ఇచ్చారు.

దీంతో.. వెంటనే ఆ ట్వీట్‌ను తొలగించారు. అదే సమయంలో ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. ప్రధాని మోదీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయిందని... ఆ ఖాతాలో ఏవైనా ట్వీట్లు.. పోస్టులు వస్తే కొద్ది సేపు స్పందించవద్దని కోరింది. కాసేపటికే ట్విట్టర్ సంస్థ ఆ ఖాతాను పునరుద్దరించింది. ఏకంగా ప్రధాని ట్విట్టర్ ఖాతా హ్యాక్ అవ్వటం ఇప్పుడు చర్చకు కారణమైంది. సెలబ్రిటీల ట్విట్టర్ ఖాతాలపైనే హ్యాకర్లు ఫోకస్ పెట్టటం పలు సందర్భాల్లో బయటకు వచ్చింది.
అనేక మంది టాప్ టెక్ దిగ్గజాలు, బిలియనీర్ల ట్విట్టర్ అకౌంట్లు హ్యాకింగ్ కు గురైన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రధాని ఎకౌంట్ హ్యాక్ చేయటం.. అందులోనూ బిట్ కాయిన్ గురించి పోస్టింగ్ పెట్టటంతో దీని పైన ఇప్పుడు అధికారులు ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications