సెంట్రల్ జైలులో ఉగ్రవాదుల బీభత్సం, దాడులు
చెన్నయ్: కట్టుదిట్టమైన భద్రత కలిగిన సెంట్రల్ జైలులో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జైలు సిబ్బందిని బంధీలుగా చేసుకుని బీభత్సం సృష్టించారు. తీవ్రగాయాలైన ముగ్గురు ఉన్నతాధికారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని కోయంబత్తూరుతో సహ తమిళనాడులోని పలు ప్రాంతాల్లో వరుస బాంబు పేలుళ్లకు పాల్పడిన అల్-ఉమా ఉగ్రవాదులు జైలు సిబ్బందిని పట్టుకుని కొన్ని గంటల పాటు చితకబాదేశారు.
అల్- ఉమా ఉగ్రవాద నేత ఫక్రుద్దీన్ అలియాస్ పోలీస్ ఫక్రుద్ధీన్, అతని అనుచరులు పన్నా ఇస్మాయిల్, బిలాల్ మాలిక్, మన్నాడి అబ్దుల్లా తదితరులను అరెస్టు చేసిన పోలీసులు చెన్నై శివార్లలోని పుళల్ సెంట్రల్ జైలులో కట్టుదిట్టమైన భద్రత ఉన్న బ్లాక్ నెంబర్ 1లో పెట్టారు.
శుక్రవారం ఫక్రుద్ధీన్ కుటుంబ సభ్యులు బయట నుంచి జైలు దగ్గరకు ఆహారం తీసుకు వెళ్లారు. అయితే ఫక్రుద్ధీన్ కుటుంబ సభ్యులు తీసుకువచ్చిన ఆహారాన్ని లోపలికి అనుమతించడానికి జైలు సిబ్బంది నిరాకరించారు. ఆ సందర్బంలో ఉగ్రవాదులకు, జైలు సిబ్బందికి జరిగిన వాగ్వివాదం ఉద్రిక్తతలకు దారితీసింది.

ఫక్రుద్ధీన్ అతని అనుచరులు ఆందోళనకు దిగారు. అదే సమయంలో జైలు వార్డెన్లు ముత్తుమణి, సెల్విన్ దేవన్, రవి మోహన్ అనే ముగ్గురిని పట్టుకున్న ఉగ్రవాదులు ఇష్టం వచ్చినట్లు చితకబాదేశారు. తరువాత అసిస్టెంట్ జైలర్ కుమార్, మరో వార్డెన్ మారీలను వారి బ్యారెక్ లోనే బందీలుగా చేసుకున్నారు.
విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులంతా జైలు వద్దకు చేరుకున్నారు. కొన్ని గంటల పాటు ఉగ్రవాదులు రెచ్చిపోయారు. తమ న్యాయవాదులతో మాట్లాడించాలని, లేదంటే బ్యారెక్ లలో నుంచి మీ అధికారులను బయటకు వదిలిపెట్టమని తేల్చిచెప్పారు.
కొన్ని గంటల పాటు జరిగిన హై డ్రామా అనంతరం ఉగ్రవాదులు బందీలుగా ఉన్న జైలు సిబ్బందిని విడిచిపెట్టారు. తీవ్రగాయాలైన అధికారులను స్టాన్లీ మెడికల్ కాలేజ్ కు తరలించి చికిత్స అందిస్తున్నామని అధికారులు చెప్పారు.
స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని జైళ్ల శాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ జే.కే. తిరుపతి తెలిపారు. ముందు జాగ్రత చర్యగా ఉగ్రవాదులు ఉంటున్న బ్యారెక్ ల దగ్గర గట్టి బందోబస్తు ఎర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications