ప్రియాంకకు 'కీ'లక పదవి, అమిత్ షాకి చెక్ పెట్టేనా?
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం కాంగ్రెసు పార్టీ పూర్వ వైభవం కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూతురు ప్రియాంకా గాంధీ వాద్రాను కాంగ్రెసు పార్టీలోకి తీసుకోవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కుంగిపోతున్న పార్టీ నాయకులలో ఉత్సాహం పెంచేగలిగేవారు, మునిగిపోతున్న పార్టీని గట్టెక్కించగలిగిన వారు ప్రస్తుతానికి ప్రియాంక గాంధీ ఒక్కరేనని పార్టీలోనే చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు పార్టీలో ఏదో పదవి కట్టబెట్టే అవకాశాలు లేకపోలేదనే వార్తలు వస్తున్నాయి.
పలు రాష్ట్రాల్లో కొద్ది నెలల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల అనంతరం ప్రియాంకకు పార్టీలోకి తీసుకొని, ఏదో ఒక ముఖ్యమైన పదవి ఇవ్వవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రియాంకా గాంధఈ అమేథీ, రాయ్ బరేలీ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో తనదైన పాత్ర పోషిస్తున్నారు.

తన తల్లి సోనియా, సోదరుడు రాహుల్‌లు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆ నియోజకవర్గాల్లోని పార్టీ వ్యవహారాల్లో ఆమె పాత్ర కూడా ప్రధానంగా ఉంటోంది. అయితే, పార్టీకి పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు ఆమెకు కీలక పదవి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
అయితే, ఆమెకు ఏం పదవి ఇస్తారనే విషయమై ఇప్పటి వరకు ఓ స్పష్టత రాలేదని తెలుస్తోంది. సమాచారం మేరకు ఆమెకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయట. ప్రస్తుతం ఆ పదవిలో జనార్ధన్ ద్వివేది ఉన్నారు. ఆయన సోనియాకు నమ్మదగిన నేత.
మరో వాదన కూడా వినిపిస్తోంది. ఉత్తర ప్రదేశ్ బాధ్యతలను ఆమెకు అప్పగించే అవకాశాలు ఉన్నాయట. ఆమెకు ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర బాధ్యతలు ఇవ్వవచ్చునట. ప్రియాంకకు ఉత్తర ప్రదేశ్ బాధ్యతలు అప్పగిస్తే ఆమె బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాను ఢీకొంటుందా అనే చర్చ అప్పుడే సాగుతోంది.
ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పర్యవేక్షణలో యూపీ 73 లోకసభ స్థానాలు గెలిచింది. ఇప్పుడు అదే అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షులు. ఆయనను ఆమె ఢీకొంటుందా? ఆయన ఎత్తులకు పై ఎత్తులు వేస్తుందా? అనే చర్చ సాగుకోంది. కాగా, ప్రియాంకను పార్టీలోకి తీసుకున్నప్పటికీ.. పార్టీ నేషనల్ బాధ్యతలు మాత్రం రాహుల్ గాంధీకేనని అంటున్నారు. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పైన ఇటీవల రాహుల్ గాంధీని పలువురు నేతలు ప్రశ్నించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications