రెచ్చిపోయిన ఉగ్రవాదులు: ప్రముఖ కెమిస్ట్, కాశ్మీర్ పండిట్‌ను కాల్చేశారు, మరో ఇద్దర్ని కూడా
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. మంగళవారం శ్రీనగర్‌లో ప్రముఖ కెమిస్ట్, కాశ్మీరీ పండిట్ మఖన్ లాల్ బింద్రోను ఉగ్రవాదులు కాల్చి చంపారు. గంట వ్యవధిలోనే వేర్వేరు ప్రాంతాల్లో ఉగ్రవాదులు మఖన్ లాల్ తోపాటు మరో ఇద్దరు పౌరులను హత్య చేశారు.
వివరాల్లోకి వెళితే.. మఖన్ లాల్ బింద్రో(70) స్థానికంగా ప్రముఖ వ్యాపారవేత్త, శ్రీనగర్‌లోని ఇక్బాల్ పార్క్ వద్ద బింద్రో మెడికేట్ ఫార్మసీ పేరుతో ఓ పెద్ద మందుల దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. అయితే మంగళవారం ఫార్మసీలో బింద్రో.. మందులను పంపిణీ చేస్తుండగా.. మంగళవారం రాత్రి 7గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా ఫార్మసీపై కాల్పులకు తెగబడ్డారు. బింద్రోను పాయింట్-బ్లాంక్ రేంజ్లో కాల్చారు.

తీవ్రగాయాలపాలైన బింద్రోని వెంటనే హాస్పిటల్‌కి తరలించినా ఫలితం దక్కలేదు. మార్గం మాధ్యలోనే బింద్రో ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఘటనపై సమాచారం అందుకున్నవెంటనే భారీగా భద్రతా దళాలు ఘటనా స్తలానికి చేరుకున్నాయి. అప్పటికే ఉగ్రవాదులు పరారయ్యారు.
దుకాణాన్ని సీల్ చేసి, కాల్పులకు తెగబడిన ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా,1990లో కాశ్మీర్ లో తీవ్రవాద దాడుల సమయంలో కాశ్మీర్ నుంచి వలస వెళ్లని అతికొద్ది మంది కాశ్మీరీ పండిట్లలో బింద్రో ఒకరు. ఆయన భార్యతో ఉండిపోయి శ్రీనగర్ లో ఫార్మసీ వ్యాపారాన్ని కొనసాస్తున్నారు. శ్రీనగర్‌లో ఎప్పుడు ఎవరికీ ఏ మందులు అవసరమున్నా.. బింద్రో ఫార్మసీకే వచ్చేవారు ప్రజలు. అన్ని మందులను అందుబాటులో ఉండేలా చూసే బింద్రో మరణం స్థానికంగా విషాధ ఛాయలు నింపింది.
జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఉగ్రదాడిని ఖండించారు. బింద్రో ఎంతో దయగల వ్యక్తి అని, ఆయన సేవలు మరువలేనివని అన్నారు. బింద్రో కుటుంబసభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఉగ్రవాదులకు భయపడకుండా ప్రజలుకు మందులను అందుబాటులో ఉంచేందుకు రాత్రిపూట కూడా ఎక్కువ సమయం వరకు ఫార్మసీని బింద్రో తెరిచి ఉంచేవారని గుర్తు చేసుకున్నారు.
Recommended Video
మరోవైపు, శ్రీనగర్ శివారులోని హవల్ ప్రాంతంలోని మదిన్ సాహిబ్ దగ్గర జరిగిన ఉగ్రదాడిలో వీరేంద్ర పాశ్వాన్ అనే ఓ వీధివర్తకుడు మరణించాడని, లాల్‌బజార్ ప్రాంతంలో రోడ్డు పక్కన బేల్పూరిని విక్రయించే ఓ స్థానికేతరుడు మొహమ్మద్ షఫీని కూడా ఉగ్రవాదులు కాల్పి చంపేశారని జమ్మూకాశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు, సైనికులు.












Click it and Unblock the Notifications