రైల్ రోకో ప్రశాంతం: దేశ వ్యాప్తంగా రైతులు పాల్గొన్నారన్న నేతలు, పలుచోట్ల ఆసక్తికర ఘటనలు
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న పంజాబ్, హర్యానా రైతులు గురువారం రైల్ రోకో నిర్వహించిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా రైల్ రోకోకు పిలుపునివ్వగా ఎక్కువగా పంజాబ్, హర్యానా, పశ్చిమఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ ప్రాంతాల్లోనే ఈ రైల్ రోకో ప్రభావం కనిపించింది.
రైల్ రోకో విజయవంతమైందని ప్రకటించిన రైతు సంఘాల నేతలు.. ఈ రైల్ రోకో పంజాబ్, హర్యానాలకే కాదు దేశ వ్యాప్తంగా జరిగిందని క్రాంతికారి కిసాన్ యూనియన్స్ నేత భజన్ సింగ్ తెలిపారు. వ్యవసాయ చట్టాలకు విరుద్ధంగా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రైతులు నిరసనలు చేపట్టారని చెప్పారు. మహారాష్ట్ర, కర్ణాటక లాంటి ఇతర రాష్ట్రాల్లో కూడా రైతులు నిరసనల్లో పాల్గొన్నారన్నారు.

కాగా, రైతు సంఘాలు నిర్వహించిన ఈ రైల్ రోకో శాంతియుతంగానే ముగిసింది. రైల్ రోకో సందర్భంగా రైల్వే శాఖ.. పంజాబ్, హర్యానాల్లోని పలు ప్రాంతాలకు రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించింది. రైల్వే పోలీసులు, ఇతర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైల్ రోకో ప్రశాంతంగా ముగియడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ రైల్ రోకో చేపట్టారు. రైల్ రోకో శాంతియుతంగానే ముగిసిందని భారత రైల్వే ప్రకటించింది. రైళ్ల రాకపోకలపై స్వల్ప ప్రభావమే పడిందని తెలిపింది. కాగా, రైల్వే అధికారులకు రైతులు పలుచోట్ల సహకరించడంతో ఎలాంటి సమస్యలు తలెత్తలేదు.
రైతులు పట్టాలపై బైఠాయించడంతో రైల్వే అధికారులు ఆ మార్గంలో వెళ్ల రైళ్లను నిలిపివేశారు. రైల్ రోకో ముగిసిన తర్వాత రైతులు అక్కడ్నుంచి వెళ్లిపోవడంతో రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. కాగా, యూపీలోని ఘజియాబాద్ జిల్లా మోడీ నగర్‌లో రైతులు రైల్వే పోలీసులపై పూలు చల్లడం గమనార్హం. ఆ తర్వాత స్వీట్లు కూడా పంచారు.
రైతుల ఆందోళన కారణంగా ఒడిశాలోని పూరి నుంచి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ వరకు ప్రయాణించే ఉత్కల్ ఎక్స్ ప్రెస్ రైలు కొన్ని గంటలపాటు నిలిచిపోయింది.
మరోవైపు రైల్ రోకో కారణంగా రైలు నిలిచిపోవడంతో గుజరాత్‌కు చెందిన పలువురు ప్రయాణికులు జలంధర్ రైల్వే స్టేషన్ లో గార్భా నృత్యం చేశారు. మొత్తంగా ఢిల్లీ ట్రాక్టర్ ర్యాలీలా కాకుండా ప్రశాంతంగా రైల్ రోకో ముగియడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.