రంజాన్ రోజున రెచ్చిపోయిన వేర్పాటువాదులు .. పోలీసులపై దాడి
శ్రీనగర్ : పవిత్ర రంజాన్ రోజున శ్రీనగర్‌లో అల్లరి మూకలు రెచ్చిపోయారు. ఇటీవల భద్రతాదళాలు కశ్మీర్ విభాగ అల్ ఖైదా అధిపతి జకీర్ ముసాను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. దీనిని నిరసిస్తూ ప్రముఖ జమియా మసీదు వద్ద ఆందోళనకారులు బీభత్సం సృష్టించారు.
ప్రార్థన చేసి వస్తుండగా ..
రంజాన్ పర్వదినం సందర్భంగా తెల్లవారుజామున మసీదుల వద్దకు ముస్లింలు వెళ్లారు. అక్కడ ప్రార్థనలు చేసి .. ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్తున్నారు. శ్రీనగర్‌లోని జమియా మసీదు వద్దకు కూడా ముస్లింలు పోటెత్తారు. మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రంజాన్ సందర్భంగా అల్లరిమూకల ఆందోళన చేపడుతారనే ఉద్దేశంతో ఆ ప్రాంతంలో పోలీసు బలగాలను మొహరించారు. ఊహించినట్టే జకీర్ ముసా మద్దతుదారులు మసీదు వద్దకొచ్చారు. ముసా ఆర్మీ పేరుతో నినాదాలు చేశారు. ఇంతలో అక్కడున్న వారిపై రాళ్లతో దాడికి తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అల్లరిమూకలను ధీటుగా తిప్పికొట్టారు. ఆందోళనకారులు పట్టుకున్న ఫోటోల్లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఫోటో కూడా స్పష్టంగా కనిపించింది.

టియర్ గ్యాస్ ప్రయోగం ...
ఆందోళనకారులు రాళ్ల దాడి ఎక్కువవడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఆందోళనకారులను తరిమికొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించినట్టు పోలీసులు తెలిపారు. శ్రీనగర్‌తోపాటు బారాముల్లా, ఉత్తర కశ్మీర్‌లో కూడా మరికొందరు అల్లరిమూకలు ఆందోళన చేపట్టారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అక్కడ కూడా ఆందోళనకారులను భద్రతాదళాలు తరిమికొట్టాయని వివరించారు.












Click it and Unblock the Notifications