సీఎం అభ్యర్థి ఎంపికకు ప్రజాభిప్రాయణ సేకరణ.. కొత్త పంథాలో కేజ్రీవాల్
పంజాబ్‌లో పాగా వేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కొత్త పంథాలో వెళ్తున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఉచిత హామీలు గుప్పిస్తున్నారు. తాజాగా సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. మీ సీఎంను మీరే నిర్ణయించుకోండి.. అంటూ ప్రజాభిప్రాయ సేకరణకు పూనుకున్నారు. ప్రజల ఓట్ల ద్వారా సీఎం అభ్యర్థి ఎంపిక చేసే విధానానికి శ్రీకారం చుట్టారు.

ప్రజల ఓట్ల ద్వారా సీఎం అభ్యర్థి ఎంపిక
పంజాబ్‌లో రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకోసం అన్నిపార్టీలు తమ శక్తి యుక్తులను దారపోస్తున్నాయి. ఉచిత హామీలతో ప్రజలను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ మరో అడుగు ముందుకు వేశారు. మఖ్యమంత్రి అభ్యర్థిని పార్టీ నుంచి ప్రకటించే విధానానికి స్వస్తి చెప్పారు. ప్రజలే ఎన్నుకునేలా ప్లాన్ చేశారు. మీ సీఎంను మీరు ఎంచుకోండి అంటూ ఎస్ఎంఎస్, వాట్పాప్, కాల్ చేసి.. ఆమ్ ఆద్మీ పార్టీ తరుపున తమకు నచ్చిన అభ్యర్థిని ఎంచుకోవాలని పంజాబ్ ప్రజలను కేజ్రీవాల్ కోరారు.

ప్రజాభిప్రాయానికి జనవరి 17 డెడ్‌లైన్..
పంజాబ్ శాసన సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యతను రాష్ట్రంలోని మూడు కోట్ల మంది ప్రజలకు వదిలిపెట్టాలని నిర్ణయించినట్లు కేజ్రీవాల్ తెలిపారు. ప్రజలు తమ అభిప్రాయాన్ని జనవరి 17 సాయంత్రం 5 గంటల్లోగా తెలియజేయాలన్నారు. ప్రజల ఓట్ల ద్వారా సీఎం అభ్యర్థిని ఎంపిక చేసే విధానాన్ని అమలు చేయడం దేశంలో ఇదే తొలిసారి అని చెప్పారు. ప్రజాభిప్రాయం ప్రకారమే సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు.

భగవంత్ మాన్ సింగ్ సీఎం అభ్యర్థిగా ప్రచారం
మరోవైపు పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ శాఖ అధ్యక్షుడు, సంగ్రూర్ ఎంపీ భగవంత్ మాన్ సింగ్ ఆ పార్టీ సీఎం అభ్యర్థి అవుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక నాలుగు గోడల మధ్య కాదు.. ప్రజల వద్దకు వెళ్లాలని మాన్ సింగ్ తనకు చెప్పినట్లు కేజ్రీవాల్ తెలిపారు. పంజాబ్ లో ఆప్ తప్పక విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఇచ్చిన ప్రతి హామీలను నెరవేర్చుతామని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధికి ప్రజలతో మమేకమవుతామన్నారు.












Click it and Unblock the Notifications