పెట్రోల్, డీజిల్ రేట్లను భారీగా తగ్గించిన రాష్ట్రం: ఈ రాత్రి నుంచే అమలు
విజయవాడ: దేశవ్యాప్తంగా కొన్ని నెలల పాటు భారీగా పెరుగుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ రేట్లు ఒక్కసారిగా తగ్గాయి. దీపావళి పండగను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఇంధనంపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. పెట్రోల్‌పై అయిదు రూపాయలు, డీజిల్‌పై 10 రూపాయల మేర ఈ సుంకాన్ని తగ్గించింది. ఫలితంగా- వాటి రేట్లు దేశవ్యాప్తంగా 100 రూపాయలకు పడిపోయింది. వాహనదారులకు కొంత మేర ఊరట కలిగించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పలు రాష్ట్రాలు అనుసరించాయి.

బీజేపీ అధికారంలో ఉన్న చోట్లే..
తాము కూడా ఇంధన అమ్మకాలపై విధించిన వ్యాట్, సేల్స్ ట్యాక్స్‌ను కొంతమేర తగ్గించాయి. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్, అమ్మకం పన్నును తగ్గించలేదు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు మాత్రమే వ్యాట్, సేల్స్ ట్యాక్స్‌ను కొంతమేర తగ్గించాయి. ఒక్కో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో రకంగా వ్యాట్‌ను తగ్గించింది. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గించడానికి ఆసక్తి చూపట్లేదు.

పంజాబ్‌లో తగ్గింపు..
ఖజానాకు వచ్చే రోజువారీ ఆదాయం తగ్గుతుందనేది ప్రధాన కారణం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. దీనికి అదనంగా వ్యాట్ తగ్గించాలనే డిమాండ్ క్రమంగా ఊపందుకుంటోంది ఆయా రాష్ట్రాల్లో. బీజేపీ అధికారంలో లేని పంజాబ్.. తాజాగా ఈ జాబితాలో చేరింది. ఇంధన ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ అర్ధరాత్రి నుంచే సవరించిన ధరలు అమల్లోకి వస్తాయని తెలిపింది. ఈ మేరకు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ.. ఓ ప్రకటన విడుదల చేశారు.

పెట్రోల్‌పై రూ.10
లీటర్ ఒక్కింటికి పెట్రోల్ మీద 10 రూపాయలు, డీజిల్ మీద అయిదు రూపాయలను తగ్గించబోతున్నామని చెప్పారు. పంజాబ్ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. రైతులు వ్యవసాయ అవసరాల కోసం వినియోగించే ట్రాక్టర్లు, ఇతర వాహనాలు పెద్ద ఎత్తున డీజిల్‌ను వాడుతుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది పంజాబ్.

ఎన్నికల ఎఫెక్ట్..
ఇప్పటికే పలు రకాల రాయితీలను ప్రకటించారు ముఖ్యమంత్రి. విద్యుత్ వినియోగంపై రాయితీలను ప్రకటించారు. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను కూడా కుదించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ- ఇంధన ధరలను తగ్గించిన అంశాన్ని కమలనాథులు రాజకీయ అజెండాగా మార్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంధన ధరలను తగ్గించాల్సిందేనంటూ డిమాండ్ చేస్తోన్నారు. ఇది మరింత తీవ్రరూపం దాల్చకముందే- బీజేపీ నేతలకు చెక్ పెట్టేలా చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ.. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించారు.

తెలుగు రాష్ట్రాల్లో తగ్గని వ్యాట్..
రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్, తమిళనాడు, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అండమాన్ అండ్ నికోబార్‌లల్లో వ్యాట్‌ను తగ్గించడానికి అక్కడి ప్రభుత్వాలు సుముఖంగా లేవు. దీనిపట్ల బీజేపీ అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. వ్యాట్‌ను తగ్గించాలంటూ డిమాండ్ చేస్తోంది. ఏపీ, తెలంగాణల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వ్యాట్‌ను తగ్గించాలంటూ గురువారం తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను నిర్వహించనుంది.












Click it and Unblock the Notifications