
పంజాబ్ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే ! .. బీజేపీ తొత్తుగా అమరీందర్ సింగ్ : సిద్ధూ సంచలన వ్యాఖ్యలు
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గరపడింది. దీంతో కాంగ్రెస్ పార్టీ మరింత దూకుడు పెంచింది. పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. పంజాబ్ లోక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, ఎస్ఏడీ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. వారిద్దరూ ఒకే నాణేనికి రెండు వైపుల వంటి వారంటూ ఆరోపించారు.

విపక్షాలకు అవకాశం ఇస్తే అభివృద్ధి తిరోగమనం
అమృతసర్ ఈస్ట్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ బీజేపీ కూటమిపై విరుచుకుపడ్డారు. పేదలకు అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి వైపు పయనిస్తుంది. మరోసారి తమ పార్టీకి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. విపక్షలకు అవకాశం రాష్ట్రాభివృద్ధి తిరోగమనమేనని విమర్శించారు. వారి వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అమరీందర్ సింగ్‌ను పంజాబ్ సీఎంగా పదవిని కట్టబెడితే బీజేపీ తొత్తుగా వ్యవహరించారని ఆరోపించారు. అందుకే ఆయనను తప్పించిందని పేర్కొన్నారు.

సిద్ధూకు మద్దతుగా చన్నీ ప్రచారం
అమృతసర్ ఈస్ట్ నుంచి బరిలోకి దిగిన నవజ్యోత్ సింగ్ సిద్ధూకు మద్దతుగా పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ ప్రచారం చేశారు. విపక్షాల తీరును ఎండగట్టారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ పై విపక్షాలు ఆసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, ఆప్ పార్టీల తప్పుడు ప్రచారాలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిప్పి కొట్టాలని పిలుపు నిచ్చారు. మరలా అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు.

చన్నీ వైపు అధిష్టానం చూపు..
పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చరణ్ జిత్ సింగ్ చన్నీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిలబెట్టింది. పంజాబ్‌లో దాదాపు 30 శాతం జనాభా దళితులు ఉన్నారు. పైగా ప్రజాభిప్రాయం కూడా చన్నీకి అనుకూలంగా వచ్చింది. దీంతో దళిత నేత చన్నీ వైపు అధిష్టానం మొగ్గుచూపింది. అటు సీఎం అభ్యర్థిత్వం కోసం నవజ్యోత్ సింగ్ సిద్ధూ తీవ్రంగా ప్రయత్నించారు. అయినా చివరకు చన్నీనే ప్రకటించింది. ఫిబ్రవరి 20న ఒకే దశలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు