వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుష్ప-సమంత ఐటెం సాంగ్: ‘నా రక్తంలో నా పూర్వీకులైన కుక్కలు, నక్కలు ఇంకా సంచరిస్తూనే ఉన్నారు’

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

"నా రక్తంలో నా పూర్వీకులైన సింహం, కుక్కలు, నక్కలు ఇంకా సంచరిస్తూనే ఉన్నారు" అనే చలం మాటలే స్ఫూర్తిగా సాగిన ఈ పాట ప్రయాణాన్ని చంద్రబోస్ బీబీసీ న్యూస్ తెలుగుకు వివరించారు.

ఐటెం సాంగ్ అనగానే అమ్మాయిల ఒంపు, సొంపులు చూపిస్తూ, అందచందాలు వర్ణిస్తూ, మగవారిని ఉద్రేకపరుస్తూ, సెక్స్ కోరికను ప్రదర్శిస్తూ, ఆహ్వానిస్తూ, కవ్వించేలా ఉంటాయి. ఈ పంథా వివిధ రూపాల్లో ఎప్పటి నుంచో దృశ్య మాధ్యమాల్లో ఉంది.

ఇటీవల విడుదలైన "ఊ అంటావా, ఉఊ అంటావా" అనే పాట సోషల్ మీడియాలో, ఆఫీసు బ్రేక్ అవుట్స్‌లో, కిట్టీ పార్టీలలో, కాలేజీ క్యాంపస్‌లలో కూడా చర్చనీయాంశంగా మారింది.

పుష్ప సినిమాలో చంద్ర‌బోస్ రాసిన ఈ పాట అమ్మాయిల అంగాంగ వర్ణన చేసే స్టైల్ నుంచి కాస్త పక్కకు తప్పుకుని కొత్త దారి పట్టిందని చెప్పవచ్చు.

సాధారణ పరిభాషలో ఐటెం సాంగ్‌లని చెప్పుకునే ఈ ప్రత్యేక శృంగార భరిత పాటలు "ప్రేమ నగర్‌లో "లేలేలే లేలేలే నా రాజా" నుంచి నిన్న మొన్నటి జిగేలు రాణి (రంగస్థలం) పాట వరకూ కూడా సాహిత్యం అంతా అబ్బాయిలను ఉద్రేకపరిచేదిగానో, కవ్వించేదిగానో సాగింది.

ఇవి కమర్షియల్‌గా హిట్ పాటలుగా మారినప్పటికీ సమాజంలోని కొన్ని వర్గాల నుంచి విమర్శలను మాత్రం ఎదుర్కొంటూనే ఉండేవి.

అబ్బాయిలను కవ్విస్తూ వచ్చిన ఈ ధోరణి అమ్మాయిల వైపు తిరిగింది. సమాజంలో కొన్ని ధోరణులను వేలెత్తి చూపించింది. ఇదే ఈ పాట గురించి చర్చకు రావడానికి కారణం. దానికి తోడు, సమంత ఈ పాటకు అభినయం చేయడం దీనికి మరింత ప్రచారాన్ని తెచ్చి పెట్టింది.

గతంలో "మగాళ్లు వట్టి మాయగాళ్లే, ప్రేవంటే ఏవిటో తెలీదే" అంటూ గీతా మాధురి పాడిన పాటలో ఒకమ్మాయి మగవారి ప్రవర్తనకు విసుగు చెంది పాడిన పాటగా చూపించారు. కానీ, దానిని ఐటెం సాంగ్‌గా చిత్రించలేదు.

రాంగోపాల్ వర్మ అంతం సినిమాలో "ఎంత సేపైనా, ఎదురు చూపేనా నా గతి" అంటూ సిల్క్ స్మిత అభినయించిన పాటలో కూడా ఒక కోరికతో తపించే మహిళ గొంతు, పురుషుని మరుపుని హైలైట్ చేశాయి.

చంద్రబోస్

పంథా మారుతోందా?

"ప్రతీ పాటకు ఒక ప్రయాణం ఉంటుంది. ఆ ప్రయాణపు ప్రవాహంలో కొత్త తరహా పాటలు పుడతాయి. ఇదీ అంతే!" ఈ పాటకు పల్లవి "ఊ అంటావా.. ఉ ఊ అంటావా అనే బాణీ మాత్రం నాలుగేళ్ల క్రితమే పుట్టింది. పాట రాస్తూ ఉండగా చరణంలో "మగ బుద్ధి" అనే పదం వచ్చింది. ఇక దానిని అల్లుకుంటూ, ఇదే పదాన్ని పాట అంతా విస్తరిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనే ఈ పాట ఊపిరి పోసుకోవడానికి కారణం" అని చంద్రబోస్ బీబీసీతో అన్నారు.

ఒక సామాజిక అంశాన్ని, అది కూడా ఒక జెండర్ లక్షణాలను పూర్తిగా వేలెత్తి చూపడం వెనుక గల కారణాలేంటి అని అడిగినప్పుడు...

''వ్యావహారిక శైలిలో ఐటెం సాంగ్‌లుగా చెప్పుకుంటున్న ఈ ప్రత్యేక గీతాల్లో ఇప్పటి వరకూ శృంగార నాయికలు వారి అందం, కోరిక గురించి వర్ణిస్తూ మగవారిని ఆకర్షించడమే ప్రధానాంశాలుగా చాలా పాటలు పుట్టాయి. ఆ పంథాను తిరగరాయాలనే ప్రయత్నమే ఈ పాటకు నాంది’’ అంటారు చంద్రబోస్.

"ఈ పాటను నా పిల్లలకు వినిపించగలనా అని నాకు నేనే ఒక ప్రశ్నను వేసుకున్నాను. అన్నిటి కంటే ముఖ్యంగా కుటుంబమంతా కలిసి పాటను వినగలిగేలా ఉండాలని కోరుకున్నాను. మనం రాసే రచన దిండు కింద పెట్టుకుని, పుస్తకాల మధ్య పెట్టుకుని చదివే రచన కాకూడదని భావించాను. ఇది వార్తాపత్రికో, కుటుంబ పత్రికో కావాలి".

"మహిళలకు రక్షణాత్మకంగా ఉండాలి, వారిని కించపరిచే స్వభావానికి స్వస్తి పలకాలి. సమాజంలో మహిళల పై జరుగుతున్న వేధింపులు, సమస్యలు, స్త్రీని సమాజం చూస్తున్న కోణాన్ని పాట ద్వారా చెప్పాలన్న ప్రయత్నమే ఈ పాట".

"శృంగారం ఓవర్ డోస్‌లో ఉన్న పాటంటే పక్కకు వెళ్ళిపోయి, చెవులు మూసుకునే పరిస్థితి నుంచి మహిళలు బహిరంగంగా చర్చిస్తూ, అక్కున చేర్చుకోవాలనే కోరికతోనే ఈ అక్షరాలకు జన్మనిచ్చాను. మగవారి బుద్ధిని మహిళల దృష్టి కోణంలో ముందుకు తీసుకొచ్చాను" అని చంద్రబోస్ వివరించారు.

"ప్రతీ మనిషిలో మంచీ, చెడూ రెండూ ఉంటాయి. వాటిని అంచనా వేసుకుంటూ, అణచివేయాల్సిన చోట అణచివేస్తూ, అమలు చేయాల్సిన చోట అమలు చేయడమే విచక్షణ. ఆ విచక్షణను తట్టి లేపడమే ఈ పాట ఉద్దేశం" అని అన్నారు.

https://twitter.com/PushpaMovie/status/1469319301316239362

కానీ, "ఈ పాట సాహిత్యాన్ని విడిగా కాగితం మీదో, కంప్యూటర్ స్క్రీన్‌ మీదో అక్షరాల్లో రాసుకుని చదివితే తప్ప అందులో రేప్‌ కల్చర్‌ని వ్యతిరేకించారనో మరోటనో ఆలోచనకు అందదు. కనుక ఇదొక మ్యాజిక్ మాత్రమే" అని కోరా కమ్యూనిటీ మేనేజర్ పవన్ సంతోష్ అంటారు.

సందేశమే ఇవ్వాలనుకుంటే ఐటెం సాంగ్‌గా ఎందుకు ఇవ్వాలి? సాధారణ పాటలో కూడా చెప్పవచ్చు కదా. ఈ పాటకు సినిమాలో నేపధ్యం ఉందా? అని ప్రశ్నించినప్పుడు..చంద్ర బోస్ వెంటనే, "ఊ అంటావా, ఉఊ అంటావా" అంటూ రాగయుక్తంగా ఆ పాటను ఆలపించి "ఇలా పాడితే ఎంత మందికి చేరుతుందీ పాట" అని ప్రశ్నించారు.

ఈ పాటకు సినిమాలో నేపధ్యం లేదని వివరిస్తూ, కమర్షియల్ అంశం కోసమే ఈ పాటను పెట్టినట్లు చెప్పారు. "కమర్షియల్ యుగంలో పాట ఎక్కువ మంది ఆలకించి, ఆదరించాలని అనుకోవడంలో తప్పు లేదు కదా" అంటారాయన.

సమంత

ఈ పాటను మహిళలు ఆదరిస్తున్నారా?

"ఈ పాటలో నిజముంది. కొత్తదనముంది. ప్రతిఘటన సినిమాలో ఈ దుర్యోధన దుశ్శాసన" నుంచి "ఊ అంటావా, ఉ ఊ అంటావా’’ వరకు వచ్చిన మార్పు ఆకర్షిస్తోంది. పాటను ఆదరించేలా చేస్తోంది" అని అంటున్నారు ఐటీ ఉద్యోగి విజయ నాదెళ్ల.

"ఇది హస్కీగా, క్యాచీగా, సరదాగా పాడుకునేందుకు బీట్‌తో కూడుకుని ఉంది".

"ఈ పాట చివర్లో "ఊ అంటాం గాని, ఊహూ అంటామా" అని వచ్చిన పదానికి, తిడితే తిట్టు గాని, ఊ అనే అంటాం అనే అర్ధం రావడంతో, మగవారు కూడా ఈ పాటను ఇష్టపడుతున్నారు" అని విజయ అన్నారు.

ఈ పాటకు విమర్శలు ఎదురయ్యాయా?

"పాటను విన్నవారంతా తమలోకి తాము తరచి, తడిమి చూసుకున్నారు. సినిమా యూనిట్‌లో, వర్గాల్లో, స్నేహితుల్లో కూడా అందరూ ఈ పాటను సరదాగానే తీసుకున్నారు కానీ, ప్రతిఘటించలేదు" అని చంద్రబోస్ చెప్పారు.

అయితే, ఈ పాటకు వ్యతిరేకంగా కొంత మంది పురుష సంఘాల వారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు నమోదు చేశారనే వార్తలు వచ్చాయి, కానీ, బీబీసీ వాటిని స్వతంత్రంగా ధృవీకరించలేకపోయింది. ఈ మేరకు చంద్రబోస్ దగ్గర కూడా ఎటువంటి సమాచారం లేదు.

ఒక వేళ కేసు నమోదు చేయడం నిజమైతే, "ఆడవాళ్ల మీద ఇప్పటి వరకు వచ్చిన పాటలకు ఎన్ని కేసులు ఫైల్ చేయాలో కదా?" అని విజయ ప్రశ్నించారు.

"బూతు సాహిత్యం ఒక భారత దేశంలోనే లేదు. ప్రతి ప్రపంచ భాషల్లో ఉంది. కాకపోతే ఇంతకుముందు ఆడవారిపైనే ఉండేవి. ఇప్పుడు కథా వస్తువు మగవారిపై కూడా మారిపోయింది. రెచ్చగొట్టే అమ్మాయిలున్నారు, ఆశపడే అబ్బాయిలున్నారు. ఎవరిని అనగలం?" అని అన్నారు.

హాలీవుడ్ కార్డి బి పాడిన 'అప్ ' పాటకి భారతదేశం సెలెబ్రిటీలు, టిక్‌టాక్ స్టారులు ఎందుకు ఉర్రూతలూగారు? అని ప్రశ్నించారు

ఖజురహో శిల్పం

ఐటెం సాంగ్ అనే పరిభాష ఎలా పుట్టింది?

"స్త్రీ శరీరాన్ని వంకర్లు తిప్పుతూ మగవారి ఆనందం కోసము చిందులేయించడం అనే విషయంలో మూడు దశలు ప్రధానంగా కనిపిస్తాయి. తొలి దశ ఆస్థాన నర్తకి లేదా మేజువాణి దశ. రెండో దశ క్యాబరే డాన్సర్‌ లేదా క్లబ్బు సాంగులు అనే దశ. మూడో దశ ఐటెం సాంగ్స్" అని బీబీసీ న్యూస్ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ గతంలో సారంగ అనే వెబ్ పత్రికకు రాసిన బ్లాగ్ పోస్టులో పేర్కొన్నారు.

"శృంగార భరితమైన పాటలకు ఈ ఐటెం అనే పరిభాష 90ల తర్వాతది. ఇటెం, మాల్‌, చీజ్‌ అనేవి బాంబేలో ప్రబలంగా వినిపించే మాటలు. శృంగార భరిత, కవ్వించే పాటలకు ఈ వాడుక భాషతో చేర్చడంతో అవి క్రమేపీ ఐటెం సాంగ్‌లుగా స్థిరపడిపోయాయి" అని రామ్మోహన్ అభిప్రాయం.

అయితే, శృంగారం జీవితంలో, సంస్కృతిలో ఎప్పటి నుంచో భాగం అంటూ చిందు బాగోతాల్లో విదూషకుడు చేసే నాటు హాస్యం, శృంగార భరిత సంభాషణలను బోస్ ప్రస్తావించారు.

"దీపాలన్నీ ఆర్పేసాక అందరి బుద్ధీ వంకర బుద్ధే" అంటూ ఒక ఐటెం సాంగ్ ద్వారా పురుషుల బుద్ధిని చెప్పడం ఇదే మొదటిసారేమో'' అని చంద్రబోస్ అంటారు.

అయితే, "విజువల్‌గా ఐటమ్ సాంగ్‌గా చూపిస్తూనే, లిరిక్స్‌లో బూతులు, ద్వంద్వార్థాలూ కాక వేరే భావాలతో ఆర్జీవీ శిష్యులు పూరీ జగన్నాథ్‌, కృష్ణవంశీ కూడా కొన్ని పాటలు చేయించుకున్నారని పవన్ సంతోష్ అన్నారు.

"పుష్ప సినిమాలో "ఊ అంటావా మావా ఊఊ అంటావా మావా" అన్న పాట ఆ ధోరణినే ఇంకొక మెట్టు ఎక్కించింది . పాడిన విధానం ఎల్‌ఆర్ ఈశ్వరి "తీస్కో కోకాకోలా" వంటి పాటలు పాడిన గమ్మత్తైన పద్ధతికి ఏమీ తక్కువ లేదు. సాహిత్యం మాత్రం స్త్రీవాద ధోరణిలో ఉంది" అని అన్నారు.

సమంత ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణా?

ఈ పాట కోసం సమంత నటించడం ఈ పాటను మరో స్థాయికి తీసుకుని వెళ్లిందని కచ్చితంగా చెప్పవచ్చని అంటూ, పాట విడుదల తర్వాత తనను అభినందిస్తూ సమంత ఒక అరగంట సేపు మాట్లాడారని చెప్పారు. ఈ పాట కొన్ని లక్షల మంది మహిళల అభిప్రాయాలకు అద్దం పట్టేదిగా ఉందని, అలా అని మగవారంతా చెడ్డవారని చెప్పడం తమ ఉద్దేశం కాదని అన్నారు.

"తిరునాళ్లలో తప్పిన బిడ్డకు ఎదురొచ్చి తల్లి చిరునవ్వులాగా ఎంత చక్కగున్నావే? భూమి బొమ్మకు నువ్వు ప్రాణం పోస్తున్నట్లు ఎంత చక్కగున్నావే" అని రంగస్థలంలో స్త్రీ పాత్రను వర్ణించిన తర్వాత అంతటి సౌందర్యవతి అయిన స్త్రీ మరో పాత్రలో నటిస్తున్నప్పుడు, ఆమె గౌరవానికి, అభినయ కౌశలానికి భంగం వాటిల్లకూడదు అనే ప్రయత్నమే ఈ పాట" అని బోస్ అంటారు.

ఈ పాటకు అభినయం చేయడం ఒక సవాలుగా నిలిచిందని సమంత కూడా విడుదల చేసిన ఒక వీడియోలో అన్నారు. కొంత మంది సమంత అభిమానులు మాత్రం ''ఇటువంటి అభినయం మీ నుంచి ఆశించలేదు’’ అంటూ ట్వీట్ చేశారు.

విజయ చెప్పిన అభిప్రాయంతో విశాఖపట్నానికి చెందిన మరో డిగ్రీ కాలేజీ అమ్మాయి కూడా ఏకీభవించారు. "ప్రేమిస్తామని చెబుతారు. మోసం చేస్తారు. ఇదేగా జరుగుతోంది. సమాజంలో ఉన్న పరిస్థితిని ఈ పాట ద్వారా తెరకెక్కించడం, దానికి సమంత నటించడం మాకు మరింత నచ్చింది" అని అన్నారు.

"ఒకప్పడు స్త్రీవాదులు క్లబ్‌సాంగ్స్, ఐటం సాంగ్స్ అన్నవి స్త్రీని ఆబ్జెక్టిఫై చేస్తున్నాయని తిట్టేవారు.

మహిళల గౌరవాన్ని మంటగలుపుతున్నాయన్న భాష వాడి వ్యతిరేకించేవారు. ఇప్పుడు సాహిత్యంలో స్త్రీవాద దృక్పథాన్ని వినిపించి మిగిలినదంతా ఐటెం సాంగ్ పద్ధతిలోనే తీసే కొత్త ధోరణితో స్త్రీవాదులు మెచ్చుకునేలాగా చేయగలిగారు" అని పవన్ అభిప్రాయపడ్డారు.

ఈ పాట ప్రయాణం గురించి వివరిస్తూ...

పగలా, రాత్రా, ట్రాక్స్‌లో ఉన్నానా, పంచె కట్టుకుని ఉన్నానా, ఫార్మల్ డ్రెస్‌లో ఉన్నానా అని కూడా ఆలోచించకుండా ఈ పాట చర్చ కోసం సినీ దర్శకుడు సుకుమార్ ఇంటికి వెళుతూ ఉండేవాడినని చంద్రబోస్ చెప్పారు.

"ఈ పాట ప్రాణం పోసుకోవడానికి ఒక 20 రోజుల సంఘర్షణను అనుభవించాను" అని అన్నారు.

పాట "రాగం రసమయ వేదమై, స్వర సంచారములను చేయగా" అని ఇళయరాజా స్వరపరిచిన పాటలో మూడు స్వరాలతో చేస్తే, ఉ అంటావా, ఉ ఊ అంటావా పాట మాత్రం నాలుగు స్వరాలతో రూపొందించారు" అని చెబుతూ స్వరకర్త కృషిని ప్రశంసించారు.

https://twitter.com/adityamusic/status/1470652929266704384/photo/1

"ఆ ట్యూన్‌కే నేనీ పాట రాశాను" అని చెప్పారు.

పాట రాస్తూ ఉండగా, ఎక్కడో ఒక ఆందోళన, భయం, ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారోననే సంశయం ఉండేది. సాధారణంగా కవి ఇటువంటి పాటలు రాసేటప్పుడు నా కుటుంబంతో కలిసి వినగలనా, నా పిల్లలకు వినిపించగలనా అనే సంశయాన్ని ఎదుర్కొంటారు. కానీ, ఈ పాట ఆ సంకెళ్లను చేధించింది" అని అంటూ ఒక కవిగా, ఒక పురుషునిగా నేనెదుర్కొనే సంఘర్షణ అదే" అని అన్నారు.

దారి మారుతుందా?

"పంథా మారుతుందా లేదా అనేది స్వీకరించేవారి పై ఆధారపడి ఉంటుంది. అమ్మాయి అందం, చందం, వంపు, సోంపు, వయ్యారం మాత్రమే వర్ణించే పాటలు మరొక స్థాయి చేరి కథను చెప్పగలిగితే అది మేము సాధించిన విజయంగానే భావిస్తాం" అని బోస్ అన్నారు.

గతంలో ఆయన రాసిన పాటల గురించి ప్రస్తావిస్తూ, "జిగేలు రాణి (రంగస్థలం), డియాలో, డియాలో, రింగ రింగాలో కూడా.. .. ఒక కథ, ఒక ఎత్తుగడ, ఒక కొనసాగింపు, ఒక ముక్తాయింపు ఉంటుంది" అని వివరించారు.

రింగరింగ పాటలో కాస్త హద్దు దాటాను అని ఒప్పుకుంటూ, "ఇక పై ఏ పాటా అలా ఉండకూడదు అని అనిపించింది. 26 ఏళ్ల సినీ ప్రయాణంలో ఒక ఐటెం సాంగ్‌కు అభినందనలు అందుకోవడం ఒక కిరీటాన్ని తొడుగుకున్నట్లయింది" అని అన్నారు.

"ప్రస్తుతానికి ఐటెం సాంగ్ దారి మళ్ళించాం. ముందు ముందు ఇది ఇలా ప్రయాణిస్తుందో వేచి చూడాల్సిందే" అని అంటూ సంభాషణను ముగించారు చంద్రబోస్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Pushpa- Item Song: Samantha once again speaks about the love she has for animals
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X