20 మంది చిన్నారుల కిడ్నాప్.. ఈ ఉదంతంతో ప్రభుత్వానికి సంబంధం!
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని పవాయి ప్రాంతంలో జరిగిన ఆర్‌ఏ స్టూడియో కిడ్నాప్స్ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక సాధారణ వ్యక్తి, ఉగ్రవాది కాకపోయినా పిల్లలతో సహా 20 మందిని బందీగా పట్టుకోవడం వెనుక ఉన్న ఆర్థిక, మానసిక ఒత్తిడిని ఈ సంఘటన బట్టబయలు చేసింది. నిందితుడు రోహిత్ ఆర్య (49) తన ప్రాణాలను తీసుకోవడానికి బదులుగా.. ప్రభుత్వాన్ని బెదిరించి తన బకాయిలు రాబట్టేందుకు ఈ కిడ్నాప్ డ్రామాకు తెరతీశాడు. అయితే ముంబై పోలీసుల సమయస్ఫూర్తితో కూడిన చర్య, క్విక్ రియాక్షన్ టీమ్ (QRT) మెరుపు దాడి కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా బందీలను సురక్షితంగా రక్షించగలిగారు.
రూ. 2 కోట్ల బకాయిల కోసం ప్రాణాలకు తెగించి...
రోహిత్ ఆర్య ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ. 2 కోట్ల బకాయిలే అని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మాజీ విద్యాశాఖ మంత్రి దీపక్ కేసర్కర్ హయాంలో రోహిత్ ఆర్య 'ముఖ్యమంత్రి మాఝీ శాలా సుందర్ శాలా యోజన' కింద 'స్వచ్ఛతా మానిటర్' అనే ప్రాజెక్ట్‌ను చేపట్టాడు. ఈ ప్రాజెక్ట్ కోసం అతను తనకున్న ఇల్లు, ఆభరణాలను కూడా అమ్మి పెట్టుబడి పెట్టాడు. కానీ సంవత్సర కాలంగా ప్రభుత్వం నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో ఆర్థికంగా చితికిపోయాడు.

ఈ అంశంపై మాజీ మంత్రి కేసర్కర్.. రోహిత్ ఆర్య ప్రభుత్వ పని చేశారని అంగీకరించినా, అధికారిక ప్రక్రియల్లో ఆలస్యం జరుగుతుందని, ప్రజలను బందీగా పట్టుకోవడం పరిష్కారం కాదని తేల్చి చెప్పారు. మరోవైపు రాష్ట్ర విద్యాశాఖ మాత్రం ఆర్యతో తమకు ఎలాంటి అధికారిక సంబంధం లేదని పేర్కొనడం గందరగోళానికి దారితీసింది.
ఆడిషన్స్ పేరుతో ఉచ్చు: కిడ్నాప్ వివరాలు
గురువారం నాడు జరిగిన ఈ ఘటనలో రోహిత్ ఆర్య ఒక డాక్యుమెంటరీ కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్లు నమ్మించి పిల్లలను స్టూడియోకు రప్పించాడు. బందీలుగా చిక్కుకున్న వారిలో 8 నుంచి 15 ఏళ్ల వయస్సు గల 17 మంది పిల్లలు ఉన్నారు. వీరితో పాటు మరో ముగ్గురు పెద్దలు కూడా స్టూడియోలో ఉన్నారు. బందీలను పట్టుకున్న తర్వాత రోహిత్ ఆర్య సోషల్ మీడియాలో వీడియో సందేశం విడుదల చేశాడు. "నేను టెర్రరిస్ట్‌ని కాదు, డబ్బులు అడగట్లేదు. నేను కేవలం కొంతమంది ఉన్నతాధికారులతో మాట్లాడాలి. ప్రభుత్వం నన్ను ఆత్మహత్య చేసుకోమని బలవంతం చేసింది. నా ప్రాణం తీసుకోవడానికి బదులు, ఇలాంటి చర్య ద్వారా నా ఆవేదనను తెలియజేయాలని నిర్ణయించుకున్నా" అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
35 నిమిషాల క్విక్ రియాక్షన్ టీమ్ ఆపరేషన్
సమాచారం అందుకున్న వెంటనే పవాయి పోలీసులు చురుగ్గా వ్యవహరించారు. నిందితుడిని మాటల్లో పెట్టి సమయాన్ని వృథా చేయకుండా, ప్రత్యామ్నాయ ప్రణాళికను అమలు చేశారు పోలీసుల హెచ్చరికలను రోహిత్ ఆర్య పట్టించుకోకపోవడంతో, ప్రత్యేక శిక్షణ పొందిన క్విక్ రియాక్షన్ టీమ్‌కు చెందిన 8 మంది కమాండోలు రంగంలోకి దిగారు. కమాండోలు ఊహించని విధంగా స్టూడియోలోని బాత్‌రూమ్ మార్గం గుండా ఆడిషన్ గదిలోకి ప్రవేశించారు. కేవలం 35 నిమిషాల వ్యవధిలోనే ఈ ఆపరేషన్‌ను పూర్తి చేశారు. ఆపరేషన్ సమయంలో రోహిత్ ఆర్య తన ఎయిర్‌గన్‌తో ప్రతిఘటించబోయాడు. వెంటనే కమాండోలు జవాబీ చర్యగా కాల్పులు జరిపారు. బుల్లెట్ ఛాతీకి తగలడంతో రోహిత్ ఆర్య అక్కడికక్కడే మరణించాడు. బందీలుగా ఉన్న 20 మంది వ్యక్తులను ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా రక్షించారు.
వృద్ధ తల్లిదండ్రులు.. కుటుంబం
ఈ ఘటన రోహిత్ ఆర్య కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పుణెలోని కొత్రుడ్ ప్రాంతంలో నివసించే ఆర్యకు భార్య, కుమారుడు ఉన్నారు. అతని 70 ఏళ్లు పైబడిన తల్లిదండ్రులు, గుండె జబ్బుతో బాధపడుతున్న తండ్రి ప్రస్తుతం ముంబైకి చేరుకున్నారు. ఆర్థిక, మానసిక ఒత్తిడి ఒక మధ్యతరగతి వ్యక్తిని ఇంతటి తీవ్ర చర్యకు ఎలా పురికొల్పిందో ఈ సంఘటన ఉదాహరణగా నిలిచింది.












Click it and Unblock the Notifications