జార్ఖండ్ శాసనసభా పక్షం భేటీ: సీఎంగా రఘువర్ దాస్ ఎంపిక
న్యూఢిల్లీ: జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత రఘవర్ దాస్ ఎంపికయ్యారు. శుక్రవారం ఉదయం భేటీ అయిన జార్ఖండ్ బీజేపీ శాసనసభా పక్షం ఆయన అభ్యర్ధిత్వాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో రఘువర్ దాస్ జార్ఖండ్‌కు తొలి గిరిజనేతర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
జార్ఖండ్‌లో బీజేపీ ఉపాధ్యక్షుడిగా రఘవర్ దాస్ ఉన్నారు. జంషెడ్ పూర్ ఈస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్న ఆయన మొన్నటి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్ధి ఆనంద్ బీహారీ దుబేపై 70,157 ఓట్ల తేడాతో విజయం సాధించారు. గతంలో జార్ఖండ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన తాజాగా సీఎం పదవిని అధిష్టించనున్నారు.

2000వ కొత్త రాష్ట్రంగా అవతరించిన జార్ఖండ్‌కు ఇప్పటి వరకు తొమ్మిది సార్లు ప్రభుత్వాలు ఏర్పాటు చేయగా... ఐదుగురు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వహించారు. వీరిలో బాబూలాల్ మారండి, అర్జున్ ముండా, శిబూ సోరెన్, మధు కోడా, హెమంత్ సోరెన్‌లు ఉన్నారు. వీరంతా కూడా గిరిజన నేతలు కావడం విశేషం.
చత్తీస్‌గఢ్‌కు చెందిన రఘువర్ దాస్ జార్ఖండ్ లోనే స్థిరపడ్డారు. టాటా స్టీల్ మాజీ ఉద్యోగి. 1995 నుంచి జంషెడ్ పూర్ ఈస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జార్ఖండ్‌లో 81 అసెంబ్లీ స్ధానాలు ఉండగా, బీజేపీ మిత్ర పక్షాలకు 42 స్ధానాలు కైవసం చేసుకుని జార్ఖండ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.












Click it and Unblock the Notifications