ఈడీ విచారణకు హాజరైన రాహుల్ గాంధీ-ఏఐసీసీ కార్యాలయం నుంచి ఈడీ ఆఫీసుకు భారీ ర్యాలీ
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు ఇచ్చి ఇవాళ విచారణకు హాజరు కావాలని కోరింది. దీనికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశవ్యాప్తంగా సత్యాగ్రహ్ ర్యాలీలు నిర్వహిస్తోంది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం నుంచి రాహుల్, ప్రియాంక ర్యాలీగా బయలుదేరి ఈడీ ఆఫీసుకు వెళ్లారు.
ఈడీ ఆఫీసుల వద్ద నిరసనలు తెలియజేసేందుకు కాంగ్రెస్ ఇచ్చిన సత్యాగ్రహ్ ర్యాలీల పిలుపుతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు ర్యాలీలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఏఐసీసీ ఆఫీసు నుంచి రాహుల్, ప్రియాంక ఇద్దరూ భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ నేతలతో కలిసి ఈడీ ఆఫీసుకు బయలుదేరి వెళ్లారు. రాహుల్ పిలుపు మేరకు ఏఐసీసీ ఆఫీసుకు భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ నేతల్ని అడ్డుకునేందుకు పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. అయినా వారు బ్యారికేడ్లు దూకి మరీ ర్యాలీకి వెళ్లారు.

ఏఐసీసీ ఆఫీసు నుంచి బయలుదేరిన కాంగ్రెస్ కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పలు చోట్ల ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తాయి. పోలీసుల నుంచి తప్పించుకుని పలువురు కార్యకర్తలు రాహుల్ తో పాటు ర్యాలీగా ఈడీ ఆఫీసు వరకూ వెళ్లారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు గాయపడినట్లు తెలుస్తోంది. అయినా లెక్కచేయకుండా కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు ఈడీ ఆఫీసు వరకూ వెళ్లారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇవాళ రాహుల్ గాంధీ విచారణకు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications