మోడీ సార్.. మీరేమైనా తిట్టుకోండి-మణిపూర్ లో మేం చేసిది ఇదేనన్న రాహుల్..
విపక్ష కూటమి ఇండియాపై ఇవాళ ప్రధాని మోడీ ఇండియా పేరుతో చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఘాటు కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోడీ తీవ్రవాద గ్రూపులతో విపక్ష కూటమిని పోలుస్తూ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన మణిపూర్ గురించి అడుగుతుంటే విపక్షాల్ని టార్గెట్ చేయడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. అంతేకాదు విపక్ష కూటమి ఇండియా మణిపూర్ లో ఏం చేయబోతోందో కూడా రాహుల్ చెప్పేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్, నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాల పేర్లను ఉదాహరణగా చూపుతూ విపక్ష కూటమి ఇండియాపై తీవ్ర విమర్శలకు దిగిన కొన్ని గంటల తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తీవ్రంగా స్పందించారు. మణిపూర్‌ను బాగుచేయడానికి ప్రతిపక్ష కూటమి సాయం చేస్తుందని, అలాగే ఆ రాష్ట్రంలో ఇండియా ఆలోచనను పునర్నిర్మించడంలో సహాయపడుతుందని రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

మిస్టర్ మోడీ.. మీకు ఏది కావాలన్నా మాకు కాల్ చేయండి. మేము ఇండియా. మేము మణిపూర్ గాయాన్ని నయం చేయడానికి, ప్రతి మహిళ, పిల్లల కన్నీళ్లు తుడవడానికి సహాయం చేస్తాము. మేము ప్రజలందరికీ ప్రేమ, శాంతిని తిరిగి తెస్తాము. మేము మణిపూర్‌లో భారతదేశం యొక్క ఆలోచనను పునర్నిర్మిస్తాము. అంటూ రాహుల్ గాంధీ ట్విట్టర్ లో తెలిపారు.
తద్వారా మణిపూర్ మంటల్ని ఆర్పడంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్రం వైఫల్యాన్ని రాహుల్ పరోక్షంగా ప్రస్తావించారు.
అంతకుముందు ఉదయం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఇలాంటి 'దిక్కులేని ప్రతిపక్షాన్ని' తాను ఎప్పుడూ చూడలేదన్నారు. 'ఇండియా.. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్.. ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇండియన్ ముజాహిదీన్. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా- ఇవి కూడా ఇండియా. ఇండియా అనే పేరును వాడడం వల్ల ఏమీ అర్థం కావడం లేదు' అని వ్యాఖ్యానించారు. దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి.












Click it and Unblock the Notifications