2024లో బీజేపీ ఓడిపోతోందిలా..! రాహుల్ లెక్క పక్కా-యూఎస్ టూర్ లో వెల్లడి..
దేశవ్యాప్తంగా మారుతున్న రాజకీయ పరిస్ధితులపై యూఎస్ టూర్ లో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కర్నాటక ఎన్నికల తర్వాత దేశంలో పరిస్ధితులు వేగంగా మారుతున్నాయని ఊహిస్తున్న రాహుల్.. యూఎస్ టూర్ లో దీనిపై తనదైన విశ్లేషణ చేశారు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి.
వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలు చూస్తారని యూఎస్ టూర్ లో ఉన్న కాంగ్రెస్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ వెల్లడించారు. వాషింగ్‌టన్ లోని నేషనల్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన రాహుల్.. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీ అధికారం కోల్పోవడం ఖాయమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెరుగైన ప్రదర్శన చేయబోతోందని రాహుల్ జోస్యం చెప్పారు. ఇది కచ్చితంగా ప్రజల్ని ఆశ్చర్య పరుస్తుందన్నారు.

భారత్ లో ఐక్య ప్రతిపక్షం బీజేపీని కచ్చితంగా ఓడిస్తుందని రాహుల్ గాంధీ విశ్వాసం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ఏడాది కంటే తక్కువ సమయం ఉండడంతో కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీలతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతోందని చెప్పారు. ప్రతిపక్షం చాలా ఐక్యంగా ఉందని రాహుల్ తెలిపారు. అన్ని ప్రతిపక్షాలతో తాము చర్చలు జరుపుతున్నట్లు రాహుల్ వెల్లడించారు. ఇందులో ఇచ్చిపుచ్చుకునేందుకు తాము సిద్ధమన్నారు.

దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ సంస్ధల్ని ఆక్రమిస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. పరువు నష్టం కేసులో దోషిగా తేలిన కారణంగా తన పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోవడం అంతిమంగా తనకు ప్రయోజనమే చేస్తుందని ఆయన తెలిపారు. ఇది తనను తాను పూర్తిగా పునర్నిర్వచించుకోవడానికి అవకాశం కల్పిస్తుందన్నారు. బీజేపీతో తనకో బహుమతి ఇచ్చిందని, అది క్రమంగా వారికి అర్ధమవుతుందన్నారు. తనకు ప్రాణహానిపై వస్తున్న బెదిరింపులపై ఆందోళన చెందడం లేదన్నారు. తన తండ్రి, నానమ్మ చావుల నుంచి అందరూ చావాల్సిందే అన్న విషయం తాను అర్ధం చేసుకున్నట్లు రాహుల్ తెలిపారు.












Click it and Unblock the Notifications