మోడీ జీ.. కాస్త డెడ్‌లైన్ చెప్పండి!
జనాభా లెక్కలతోపాటు కులగణన కూడా చేపడతామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. కేంద్రం అనూహ్యంగా తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. కేంద్రం చేపట్టే కులగణనకు కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుందని చెప్పారు. అయితే, కులగణనకు నిర్ణీత సమయం తెలపాలని కోరుతున్నామన్నారు.
తెలంగాణలో చేపట్టిన కులగణన ప్రక్రియ ఇందుకు బ్లూప్రింట్‌గా నిలుస్తుందని రాహుల్ చెప్పుకొచ్చారు. కులగణన సమనత్వం తీసుకొస్తుందన్నారు రాహుల్. ఇది తొలి మెట్టేనని.. కులగణనకు అందరి భాగస్వామ్యం కూడా అవసరమని వ్యాఖ్యానించారు. కులగణనకు తెలంగాణ ఓ మోడల్‌గా నిలుస్తుందని రాహుల్ అన్నారు. అంతేగాక, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని కూడా ఎత్తివేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

జనాభా లెక్కలతోపాటు కులగణన
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో తదుపరి జనాభా లెక్కలను నిర్వహించాలని నిర్ణయించింది. అంతేగాక, జనాభా లెక్కలతోపాటు కులగణన కూడా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే జనాభా లెక్కల్లోనే దీన్ని చేర్చుతామని కేంద్రం పేర్కొంది.
ఈ మేరకు బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కులగణన విషయంలో కాంగ్రెస్ వైఖరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కులగణనను ఆ పార్టీ రాజకీయంగా వాడుకున్నట్లు విమర్శలు చేశారు. కాగా, 2011 తర్వాత దేశంలో జనాభా లెక్కలు జరగని విషయం తెలిసిందే.
కాగా, గత కొంత కాలంగా విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జనాభా లెక్కలతోపాటు కులగణన చేయాలంటూ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలు, దేశంలో కూడా కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలతోపాటు కులగణన కూడా చేసేందుకు నిర్ణయించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కాంగ్రెస్ పార్టీపై రాహుల్ విమర్శలు
కుల గణనపై తమ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. సామాజిక న్యాయానికి మోడీ సర్కార్ కట్టుబడి ఉందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ నిర్ణయం ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన తరగతులందరికీ సాధికారత కల్పిస్తుందన్నారు.
బలహీన, అణగారిన వర్గాల పురోగతికి కొత్త బాటలు వేస్తుందన్నారు. తాజా నిర్ణయం సామాజిక సమానత్వం, ప్రతి వర్గం హక్కుల పట్ల తమ ప్రభుత్వ నిబద్ధతను చూపిస్తుందని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు దశాబ్దాలుగా కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కుల గణనను వ్యతిరేకించాయని ఆరోపించారు. అదే ప్రతిపక్షంలోకి రాగనే దానిపై రాజకీయాలు చేశారని అమిత్ షా విమర్శించారు.












Click it and Unblock the Notifications