సభలో రాహుల్ నిద్ర!(ఫోటో): బీజేపీ వ్యంగ్యం, కాంగ్రెస్ వివరణ
న్యూఢిల్లీ: ఏఐసిసి ఉపాధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ లోకసభలో కునుకు తీశారు. పార్లమెంటు లోకసభలో ధరల పెరుగుదల పైన సీరియస్‌గా చర్చ సాగుతున్న సమయంలో రాహుల్ గాంధీ తన కుర్చీలో నిద్రపోయారు. చర్చ సమయంలో రాహుల్ కునుకు తీశారంటూ భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత షాన్‌వాజ్ హుస్సేన్ ట్వీట్ చేశారు.
షాన్‌వాజ్.. రాహుల్ గాంధీ కునుకు పైన వ్యంగ్యంగానే ట్వీట్ చేశారు. 'ధరల పెరుగుదల పైన పార్లమెంటులో చర్చ జరుగుతున్న సమయంలో రాహుల్ గాంధీ నిద్రపోతు కనిపించారు. కాంగ్రెస్ పార్టీ తన పదేళ్ల పాలనలో ఇదే చేసింది.' అని ఎద్దేవా చేశారు.

దీనిపై కాంగ్రెసు పార్టీ వెంటనే స్పందించింది. ఇది పూర్తి అబద్దమని వ్యాఖ్యానించింది. రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. తన పార్లమెంటు జీవితంలో చాలామంది ఎంపీలు కునుకు తీయడం చూశానని చెప్పారు.
అయితే ఇంకొందరు చర్చను జాగ్రత్తగా వినేందుకు కళ్లు మూసుకుంటారని, రాహుల్ గాంధీ కునుకు తీశారనే వాదనలో నిజం లేదని, ఇది కూడా చర్చను జాగ్రత్తగా వినేందుకేనని ఆయన చెప్పారు. భారతీయ జనతా పార్టీ అగ్ర నేత అటల్ బిహారీ వాజపేయి కూడా చర్చను జాగ్రత్తగా వినేందుకు కళ్లు మూసుకునే వారని చెప్పారు. కాగా, సీపీఐ-ఎం నేత కరుణాకరన్ మాట్లాడే సమయంలో ఇది జరిగింది. కళ్లు మూసినంత మాత్రాన నిద్రపోయినట్లు కాదని ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ అన్నారు.












Click it and Unblock the Notifications