రైళ్ల భద్రత డొల్లే ? నిరూపించిన ఒడిశా ఘటన- స్వరాష్ట్రంలోనే డిఫెన్స్ లో పడ్డ రైల్వే మంత్రి !
నిన్న రాత్రి ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో చోటు చేసుకున్న మూడు రైళ్ల ఢీ ఘటన భారతీయ రైల్వేల భద్రతపై మరోసారి సందేహాల్ని రేకెత్తించింది. అంతే కాదు ఘటన జరిగిన ఒడిశా.. రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్వరాష్ట్రం కూడా కావడంతో ఆయన కూడా ఇరుకునపడ్డారు. ఇన్నాళ్లు కవచ్ పరిజ్ఞానం దేశమంతా వాడేస్తున్నామంటూ ఇక రైల్వే ప్రమాదాలే జరగవన్న రీతిలో ఊదరగొట్టిన కేంద్రానికి ఈ ఘటనను ఎలా సమర్ధించుకోవాలో తెలియడం లేదు.
ఒడిశాలోని బహనాగ్ వద్ద జరిగిన కోరమాండల్, హౌరా-బెంగళూరు, గూడ్స్ రైళ్ల ఢీ ఘటన రైల్వేల్లో భద్రతా లోపాల్ని మరోసారి ఎత్తిచూపింది. ముఖ్యంగా కరోనా తర్వాత చోటు చేసుకున్న మార్పులతో వందే భారత్ రైళ్లను నడుపుతున్న రైల్వే ఈ ఘటనతో ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడిపోయింది. ఇలాంటి ట్రాక్ లు, సిగ్నలింగ్ సిస్టమ్ లను ఉంచుకుని వందే భారత్ రైళ్లను నడిపితే ఊహకందని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తేలిపోయింది.

దేశవ్యాప్తంగా అన్ని రైల్వే డివిజన్లలోనూ ప్రమాదాలు జరగకుండా కవచ్ వ్యవస్ధ తీసుకొచ్చామని కేంద్రం గతంలో గొప్పలు చెప్పుకుంది. ఇప్పుడు ఒడిశాలో జరిగిన మూడు రైళ్ల ప్రమాదం తర్వాత కవచ్ వ్యవస్ధ ఇక్కడ లేదని చెబుతోంది. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సొంత రాష్ట్రంలోనే కవచ్ వ్యవస్ధ లేకుండా రైళ్లను నడుపుతున్నారా అన్న ప్రశ్నల్ని ఈ ప్రమాదం తెరపైకి తెచ్చింది. ఈ ఘటనతో గతంలో జరిగిన రైల్వే ప్రమాదాల తర్వాత నెలకొన్న భయాలు ప్రయాణికుల్ని మరోసారి వెంటాడే అవకాశాలున్నాయి.

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పనితీరుపైనా సందేహాలు రేకెత్తిస్తోంది. స్వరాష్ట్రంలో రైల్వే ట్రాక్ లు, సిగ్నలింగ్ వ్యవస్ధలా ఇలా ఉంటే ఆయనేం చేస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రైల్వేతో పాటు ఐటీ, ఇతర శాఖల భారాన్ని మోస్తున్న మాజీ బ్యూరోక్రాట్ అశ్వినీ వైష్ణవ్ సమర్ధతపై ఈ ప్రమాదం అనుమానాలు కలిగేలా చేస్తోంది. గతంలో అయితే ఇంత ఘోర ప్రమాదాలు జరిగినప్పుడు రైల్వే మంత్రులు నైతిక బాధ్యతగా రాజీనామాలు చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్ధితి లేదు. ఇది తెలిసే విపక్షాలు కూడా ఆ డిమాండ్ చేయడం కూడా మానేశాయి.












Click it and Unblock the Notifications