వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజా మిర్చి: ఇది భారత్‌లోనే అత్యంత ఘాటైన మిర్చి

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
రాజా మిర్చా

ఇది అక్టోబరు 2016 నాటి కథ. అంటే ఐదేళ్లకు ముందు ఇది జరిగింది.

అమెరికాలో 47 ఏళ్ల వ్యక్తి ఓ బర్గర్ తిన్నాడు. ఈ బర్గర్ ప్రత్యేకత ఏమిటంటే, దీనికి ''భూత్ జోలోకియా’’గా పిలిచే మిర్చీలతో కోటింగ్ వేశారు.

బర్గర్ తిన్న వెంటనే, ఆయన నేలపై పడి దొర్లడం ప్రారంభించారు. కడుపు, ఛాతీలో ఆయనకు విపరీతమైన మంట వచ్చింది. కాసేపటికి వాంతులు కూడా మొదలయ్యాయి.

వెంటనే ఆయన్ను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అయితే, వైద్య పరీక్షల్లో అతడి ఆహార వాహికకు అంగుళం మందంలో రంధ్రం పడినట్లు గుర్తించారు.

మీడియాతోపాటు జర్నల్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్‌లోనూ ఈ ఘటన గురించి ప్రస్తావించారు.

ఈశాన్య భారతంలో సాగు..

ఈశాన్య భారత్‌లో పండే మిర్చీల్లో ''భూత్ జోలోకియా’’ ఒకటి. కింగ్ మిర్చి, రాజా మిర్చి, నాగా మిర్చి, గోస్ట్ పెప్పర్ అని కూడా దీన్ని పిలుస్తుంటారు.

విపరీతమైన ఘాటుగా ఉండటం వల్లే దీనికి కింగ్ మిర్చి అని పేరు వచ్చింది. అంటే భారత్‌లోని మిర్చీలకు ఇది రాజు అని అర్థం.

నాగాలాండ్‌లో ఎక్కువగా పండుతుందని కాబట్టి, దీనికి నాగా మిర్చి అనే పేరు వచ్చింది.

ఒక్కసారి దీన్ని తింటే ఆ ఘాటుతో శరీరంలోకి దెయ్యం ప్రవేశించినట్లు ప్రవర్తిస్తారు కాబట్టి, దీన్ని గోస్ట్ పెప్పర్ లేదా భూత్ జోలోకియా అని పిలుస్తుంటారు.

ఈ విషయాలను రాజా మిర్చి సాగుచేస్తున్న రైతులు చెప్పారు.

ప్రపంచంలోనే అత్యంత ఘాటైన ఐదు మిర్చీల్లో ఒకటి

ఒక అమెరికన్ ఆసుపత్రి పాలైన ఐదేళ్ల తర్వాత ఈ మిర్చి గురించి ఇప్పుడెందుకు మాట్లాడుకుంటున్నాం అని మీకు సందేహం వచ్చే ఉంటుంది.

ఎందుకంటే అప్పుడే పండిన ఈ తాజా మిర్చీలను ఇటీవల తొలిసారిగా భారత్ బ్రిటన్‌కు ఎగుమతి చేసింది.

నాగాలాండ్ నుంచి లండన్‌కు గత బుధవారం తొలి పార్సిల్ వెళ్లింది. ఇదివరకు ఈ మిర్చీల పౌడర్‌ను మాత్రమే ఎగుమతి చేసేవారు. ఇప్పుడు మిరపకాయలను ఎగుమతి చేస్తున్నారు.

ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు.

''ఈ మిర్చి తిన్నవారికి మాత్రమే.. దీని ఘాటు ఏంటో తెలుస్తుంది’’అని మోదీ ట్వీట్ చేశారు.

రాజా మిర్చా

పోర్చుగీసు వారు తేలేదు..

సాధారణంగా మిర్చిని దక్షిణ అమెరికా నుంచి పోర్చుగీసు వారు భారత్‌కు తీసుకొచ్చారని చెబుతారు.

అయితే, దీనిలో ఎలాంటి నిజమూలేదని నాగాలాండ్ మిర్చి రుజువు చేస్తోందని నిపుణులు వివరిస్తున్నారు.

''500ఏళ్ల క్రితం, అంటే 1498లో పోర్చుగీసువారు మొదట కేరళలో అడుగుపెట్టారు. ఆ తర్వాత వారు గోవాలో స్థిరపడ్డారు. క్రమంగా మిగతా ప్రాంతాలకూ విస్తరించారు. వారు వెళ్లిన చోటకు మిర్చిని కూడా తీసుకెళ్లారు.

అయితే, ఈశాన్య భారత్‌కు వారు వెళ్లినట్లు ఎలాంటి ఆధారాలూ లేవు. ఆ సమయంలో ఈశాన్య భారత్‌కు వెళ్లడం కూడా కష్టమే. దీని ప్రకారం.. పోర్చుగీసు వారు రావడానికి ముందే, భారత్‌లో ఈ కింగ్ మిర్చి పండేదని కొందరు వృక్షశాస్త్ర నిపుణులు చెబుతున్నారు’’ అని ఆహారంపై పుస్తకాలు రాసిన జేఎన్‌యూ విశ్రాంత ప్రొఫెసర్ పుష్పేశ్ పంత్ చెప్పారు.

ఈ వాదన ప్రకారం భూత్ జోలోకియా.. అంటే కింగ్ మిర్చి భారత్‌లోనే అత్యంత ప్రాచీనమైన మిర్చి. అయితే, ప్రాచీన చరిత్ర పుస్తకాల్లో దీని గురించి ప్రస్తావన లేదు.

''ఇదివరకు ఈశాన్య ప్రాంతం భారత ప్రధాన భూభాగంతో అంతగా అనుసంధామై ఉండేది కాదు. అందుకే చరిత్ర పుస్తకాల్లో దీని గురించి ప్రస్తావన లేదు. మరోవైపు నాగాలాండ్ జానపదాల్లోనూ దీని ప్రస్తావన లేదు. ఎందుకంటే అక్కడ ఈ మిర్చి ఎక్కడపడితే అక్కడే పండుతుంది. వారికి ఇది సర్వసాధారణమైన పంట’’ అని పంత్ అన్నారు.

రాజా మిర్చా

అలా మొదలైంది..

మిర్చిని ఇంగ్లిష్‌లో చిల్లీ అంటారు. మెక్సికన్‌లో దీన్ని క్యాప్సికమ్‌గా పిలుస్తారు.

మిర్చి శాస్త్రీయ నామం ''కాప్సికమ్ ఆనమ్’’.

పచ్చి మిరపకాయల్లో విటమిన్ ఏ,బీ,సీ పుష్కలంగా ఉంటాయి. వీటితోపాటు కాల్షియం, పాస్పరస్ కూడా లభిస్తాయి. మిర్చిలో ఉండే ''కేప్సాయ్‌సిన్’’వల్లే దీనికి ఘాటు వస్తుంది.

మిర్చి ఉత్పత్తిలో భారత్ మొదటి స్థానంలో ఉంది. అంతేకాదు వినియోగంలోనూ భారత్‌దే మొదటి స్థానం.

భారత్‌లోని చాలా రాష్ట్రాల్లో మిర్చి ఏడాది పొడవునా పండుతుంది. దీని సాగుకు 20 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు అవసరం. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు.. తదితర రాష్ట్రాలు మిర్చి పంటలతో ప్రఖ్యాతి గాంచాయి.

ప్రస్తుతం ఈ జాబితాలో నాగాలాండ్, అస్సాం కూడా చేరుతున్నాయి.

రాజా మిర్చా

నాలుగు అంగుళాలు...

రాజా మిర్చి నాలుగు నుంచి ఐదు అంగుళాల పొడవు ఉంటుంది. ఆకుపచ్చ రంగుతోపాటు ఎరుపు, చాక్లెట్ రంగుల్లోనూ ఇవి కనిపిస్తాయి.

ముఖ్యంగా ఆహారంలో ఘాటు పెంచేందుకు, ఊరగాయల్లో వీటిని ఉపయోగిస్తుంటారు. వీటితో తయారుచేసే మాంసాహారం చాలా రుచిగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. వీటితో సాస్‌లు కూడా తయారుచేస్తుంటారు.

భారత మార్కెట్లలో వీటి ధర కేజీ రూ.300 వరకు ఉంటుంది. లండన్ మార్కెట్‌లో అయితే వీటి ధర కేజీ రూ.600.

ప్రస్తుతం నాగాలాండ్, అస్సాంలలో వీటిని పండిస్తున్నారు. ఒక్కసారి ఎగుమతులు వేగం పుంజుకుంటే, భారీగా వీటిని సాగు చేసేందుకు స్థానికులు సిద్ధంగా ఉన్నారని కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.

రాజా మిర్చా

ఎంత ఘాటు?

మిర్చిలో ఘాటును కొలిచేందుకు ఒక స్కేల్ ఉంది. దీన్ని స్కోవిల్ హీట్ యూనిట్ (ఎస్‌హెచ్‌యూ)గా పిలుస్తారు.

అమెరికా శాస్త్రవేత్త విల్బర్ స్కోవిల్ పేరు ఈ స్కేల్‌కు పెట్టారు. మిర్చీల్లోని కేప్సాయ్‌సిన్ ఆధారంగా మిర్చీలకు దీని సాయంతో స్కోర్లు ఇస్తారు. అంటే ఎక్కువ ఘాటు ఉండే మిర్చికి ఎక్కువ స్కోర్ వస్తుంది.

ఈ స్కేల్‌పై రాజా మిర్చి రీడింగ్ ఒక మిలియన్ ఎస్‌హెచ్‌యూగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలో అత్యంత ఘాటైన మిర్చి స్కోర్ రెండు మిలియన్లు.

ఈ కింగ్ మిర్చి.. ప్రపంచంలో అత్యంత ఘాటైన ఐదు మిర్చీల్లో ఒకటని నిపుణులు చెబుతున్నారు.

''ఘాటు విషయంలో ప్యూర్ కేప్సాయ్‌సిన్‌కు మొదటి స్థానం, స్టాండార్డ్ పెప్పర్ స్ప్రేకు రెండో స్థానం, కరోలినా రీపెర్‌కు మూడోస్థానం, ట్రినిడాడ్ మోరుజా స్కోర్పిన్‌కు నాలుగవ స్థానంగా ఈ స్కేల్ నిర్ధారించింది. ఇప్పుడు ఐదో స్థానం మన రాజా మిర్చిదే’’ అని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులు బీబీసీతో చెప్పారు.

మనం ఇంట్లో వాడుకునే ఎండు మిర్చిలా ఈ రాజా మిర్చిని వాడకూడదని పంత్ వివరించారు. పైన పేర్కొన్న మిర్చీల్లో వేటినైనా కొంచెం వేస్తే సరిపోతుందని ఆయన చెప్పారు.

రాజా మిర్చా

ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికులు..

భారతీయ వంటల్లో కారం, పసుపుకు ప్రత్యేక స్థానముంది. దాదాపు అన్ని కూరల్లోనూ వీటిని వేస్తుంటారు.

2018లో సగటున ఒక్కొక్కరూ ఐదు కేజీల వరకు మిర్చిని ఆహారంలో భాగంగా తీసుకున్నారని మార్కెట్ విశ్లేషక సంస్థ ఇండెక్స్ బాక్స్ అంచనా వేసింది.

https://www.youtube.com/watch?v=xn3aMVffS4Y

అయితే, కొన్ని దేశాల్లో ఇంతకంటే ఎక్కువే తింటారు.

టర్కీలో అయితే ఒక వ్యక్తి సగటున రోజుకు 86.5 గ్రాముల చిల్లీ తింటారని అంచనాలు ఉన్నాయి. ప్రపంచంలో అత్యధికంగా మిర్చి తినేది టర్కీ వాసులే.

మెక్సికోలో సగటున ఓ వ్యక్తి రోజుకు 50.95 గ్రాముల మిర్చి తింటాడు. మరోవైపు ఆసియా దేశాలైన భారత్, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, మలేసియా కూడా మిర్చి వినియోగంలో ముందున్నాయి.

స్వీడన్, ఫిన్లాండ్, నార్వే లాంటి దేశాల్లో మిర్చిని చాలా తక్కువగా ఉపయోగిస్తారు.

ఇవి కూడా చదవండి:

https://www.youtube.com/watch?v=aClMDh7dZMw

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Raja Mirchi: It is the hottest chilli in India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X