రజనీకాంత్ రాజకీయాల్లోకి రావద్దు: తమిళ కాంగ్రెస్ చీఫ్
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ చుట్టూ తిరుగుతుంటాయి తమిళ రాజకీయాలు. తమిళనాడు కాంగ్రెస్ చీఫ్గా కొత్తగా ఎన్నికైన ఈవీకేఎస్ ఇళంగోవన్ రజినీకాంత్‌కు రాజకీయాల్లోకి రావద్దని సూచించారు. అంతేకాదు ఇంకో అడుగు ముందుకేసి రజనీకాంత్‌ను కాంగ్రెసులోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీకే వాసన్ రాజీనామా చేసిన తర్వాత ఈవీకేఎస్ ఇళంగోవన్‌ను తమిళనాడు కాంగ్రెస్ పార్టీ చీఫ్గా నియమించింది. బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన మాట్లాడుతూ "రజనీకాంత్ ఎప్పటికీ రాజకీయాల్లోకి రావద్దు. ఇది నా అభిప్రాయం. అన్ని రాజకీయ పార్టీల్లో రజనీకి ఫ్యాన్స్ ఉన్నారు. తమిళనాడు ప్రజల్లో రజనీ పట్ల అమితమైన గౌరవం ఉంది" అని అన్నారు.
"దేశంలో ప్రజలంతా సెక్యులరిజంకు కట్టుబడి ఉన్నారు. సెక్యలరిజానికి కట్టుబడి ఉన్న పార్టీ కాంగ్రెస్. అలాంటి కాంగ్రెస్ పార్టీలోకి రజనీకాంత్‌ను ఆహ్వానిస్తున్నాం" అని అన్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉందని అన్నారు.
2016లో తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో డీఎంకే, ఎఐడీఎంకే పార్టీలకు గట్టి పోటీ ఇవ్వాలంటే ఒక్క రజనీ వల్ల సాధ్యం అవుతుందని బీజేపీ, కాంగ్రెస్‌లు తమ పార్టీల్లో చేరాలంటూ ఆహ్వానిస్తున్నాయి. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఇప్పటి ప్రధాని నరేంద్రమోడీని రజనీకాంత్ కలిసిన విషయం తెలిసిందే.

ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీకే వాసన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన తండ్రి స్థాపించి, కాంగ్రెస్‌లో విలీనం చేసిన టీఎంసీ పార్టీని పునరుద్ధరిస్తానని ఆయన స్వయంగా ప్రకటించారు. జీకే వాసన్ కాంగ్రెస్ నుండి బయటకు రావడానికి కారణం మాజీ ఆర్ధిక మంత్రి చిదంబరం, ఇళంగోవనన్‌తో ఉన్న విభేదాలే.
కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి మూపనూర్ స్ధాపించిన "తమిళ మానిలా కాంగ్రెస్", కరుణానిధికి చెందిన డీఎంకే పార్టీ రెండు పొత్తుగా ఏర్పడి 1996 ఎన్నికల్లో పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో డీఎంకే, తమిళ మానిలా కాంగ్రెస్ పొత్తుగా ఏర్పడి విజయం సాధించాయి. ఈ ఎన్నికలకు ముందు రజనీకాంత్ "జయలలిత మళ్లీ పవర్‌లోకి వస్తే దేవుడు కూడా తమిళనాడుని కాపాడలేడు" అని తమిళ ప్రజలకు తన విన్నపాన్ని తెలిపాడు.
ఈ మాట తమిళనాడు ప్రజల్లోకి ఓ వేదవాక్కులాగా వెళ్లి ఎఐడీఎంకే ఓటమికి దారితీసింది. దీనిని బట్టి తమిళనాడు రాజకీయాలను రజనీకాంత్ ఏ విధంగా ప్రభావితం చేస్తారో ఈ ఒక్క మాటను బట్టే అర్ధమవుతుంది.
2016 ఎన్నికల్లో డీఎమ్‌డీకే పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్‌కాంత్‌తో పొత్తు పెట్టుకోవచ్చుగా అన్న ప్రశ్నకుగాను 2016 ఎన్నికల్లో ఇళంగోవనన్ మాట్లాడుతూ "అతను నాకు మంచి స్నేహితుడు.. కాంగ్రెస్ లీడర్ల పట్ల అతనికి చాలా గౌరవం ఉంది" అని అన్నారు.
తమిళనాడు కాంగ్రెస్ చీఫ్గా నవంబర్ 2న ఇళంగోవనన్ బాధ్యతలు చేపట్టారు. తమిళనాడు కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూర్చేందుకు గాను పార్టీ పేరు ప్రఖ్యాతులున్న నాయకులను, పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు చెప్పారు.
మాజీ కేంద్ర మంత్రి జీకే వాసన్ రాజీనామాతో తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. రస్తుతం ఆ రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో ముగ్గురు జీకే వాసన్ ప్రధాన అనుచరులు.
దీంతో వీరు వాసన్ వెంట నడిచేందుకు సిద్ధమయ్యారు. మిగిలిన ఇద్దరు కూడా వీరితోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే తమిళనాడు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిథ్యం వహించేందుకు ఒక్క ఎమ్మెల్యే కూడా మిగలరు. ఫలితంగా ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో నామరూపాల్లేకుండా కనుమరుగయ్యే దారుణ పరిస్థితి తలెత్తింది.












Click it and Unblock the Notifications