రాజ్యసభ ఎన్నికల సిత్రాలు- కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటాపోటీ-పలుచోట్ల క్రాస్ ఓటింగ్స్
దేశవ్యాప్తంగా 57 రాజ్యసభ స్ధానాలకు జరుగుతున్న ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ మధ్యపలుచోట్ల ముఖాముఖీ పోటీ నెలకొంది. ఇందులో ప్రత్యర్ధి పార్టీల ఓట్లను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కర్నాటక, మహారాష్ట్ర, రాజస్తాన్ వంటి రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.
రాజస్తాన్ లోని ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాజ్యసభ సీట్లలో అధికార కాంగ్రెస్ పార్టీ మూడు స్ధానాలు కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. బీజేపీకి ఓ స్ధానం దక్కబోతోంది. అయితే బీజేపీ స్వతంత్ర అభ్యర్ధిగా సుభాష్ చంద్రను నిలబెట్టడం ద్వారా బేరసారాలకు తెరదీసింది. దీంతో బీజేపీ తీరుపై అధికార కాంగ్రెస్ మండిపడుతోంది. బీజేపీ మాత్రం ఫలితాల్లో అద్భుతాలు చోటు చేసుకుంటాయమని చెబుతోంది.

అటు కర్నాటకలో జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ మంత్రులు ప్రత్యర్ధి పార్టీలైన కాంగ్రెస్, జేడీఎస్ కు వల వేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ తరుణంలో జేడీఎస్ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన రాజ్యసభ అభ్యర్ధికి ఓటేశారు. దీంతో తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ప్రలోభపెడుతోందని జేడీఎస్ నేత కుమారస్వామి ఆరోపిస్తున్నారు. మరో ఇద్దరు జేడీఎస్ ఎమ్మెల్యేలకు బీజేపీ మంత్రులు గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది.
మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ కూటమి తరఫున నిలబెట్టిన అభ్యర్ధులకు ఓటు వేయాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ నిర్ణయించడం విశేషం. ఇక్కడ మహావికాస్ అఘాడీ కూటమి తరఫున మూడు పార్టీలు శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ తమ అభ్యర్ధుల్ని నిలబెట్టాయి. ఈ మూడు సీట్లను కూటమిలో పార్టీలు గెల్చుకోబోతున్నాయి. అటు బీజేపీ రెండు సీట్లు గెల్చుకునే అవకాశాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications