ఫిల్మ్ ఇండస్ట్రీకి బిగ్ రిలీఫ్- కీలక బిల్లు ఆమోదం
న్యూఢిల్లీ: ఫిల్మ్ పైరసీ. సినిమా పరిశ్రమను వైరస్‌లా పట్టి పీడిస్తోన్న వ్యవస్థ ఇది. కోట్ల రూపాయలతో తెరకెక్కిన సినిమాలన్నీ విడుదలైన గంటలోనే ఆన్‌లైన్, టెలిగ్రామ్‌లల్లో విడుదల కావడానికి ప్రధాన కారణం పైరసీ. వేలాది మందికి ఉపాధి కల్పించే చిత్ర పరిశ్రమ.. ఈ పైరసీ వల్ల వల్ల భారీగా నష్టపోవాల్సి వస్తోంది. నిర్మాతలకు రావాల్సిన ఆదాయాన్ని పక్కదారి పట్టిస్తోంది.
దీన్ని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలకు దిగింది. సినిమాటోగ్రఫీ సవరణ బిల్లు 2023ని ఆమోదించింది. రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. దీనివల్ల పైరసీ దూకుడుకు అడ్డుకట్ట పడటం ఖాయంగా కనిపిస్తోంది. పైరసీదారులపై ఉక్కుపాదం మోపడానికి ఇది ఉపయోగపడుతుందని ఫిల్మ్ ఇండస్ట్రీ హర్షం వ్యక్తం చేస్తోంది.

సినిమాటోగ్రఫీ సవరణ బిల్లు 2023ని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్.. రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. సినిమాటోగ్రాఫ్ చట్టం 1952లో సవరణలను ప్రతిపాదించినట్లు తెలిపారు. దశాబ్దాల కాలం నాటి ఈ చట్టాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సవరణలు చేశామని వివరించారు.
సినిమాలను అనధికారికంగా రికార్డ్ చేయడం, వాటిని సోషల్ మీడియా లేదా ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌పై విడుదల చేయడాన్ని నిషేధించినట్లు మంత్రి చెప్పారు. అనధికారికంగా సినిమాలను టెలికాస్ట్ చేయడాన్నీ బిల్లు నిషేధిస్తుందని పేర్కొన్నారు. ఇకపై పైరసీలకు పాల్పడటాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తామని అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమాలకు విశ్వసనీయత పెరిగిందని, దేశంలో అత్యధిక చిత్రాలను నిర్మిస్తున్నామని అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ఆస్కార్‌లో భారతీయ చలనచిత్రాలు, డాక్యుమెంటరీలు సాధించిన ఘనతను ఆయన ప్రస్తావించారు. ఆర్‌ఆర్‌ఆర్, ఎలిఫెంట్ విష్పరర్స్.. ఆస్కార్ వేదికపై భారతీయుల ఘనతను చాటిచెప్పాయని అన్నారు.
దేశంలో సినీ పరిశ్రమలో పెరుగుతున్న సాఫ్ట్ పవర్‌ను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయంటూ ఆయన చురకలు అంటించారు. ఈ బిల్లు సినిమా పరిశ్రమతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూరుస్తుందని అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. ఈ బిల్లు వల్ల ఫిల్మ్ ఇండస్ట్రీకి భారీ నష్టాన్ని కలిగిస్తున్న పైరసీకి చెక్ పడుతుందని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications