పవన్ ఎఫెక్ట్: చిరంజీవిపై రాంగోపాల్ వర్మ ఘాటైన ట్వీట్
ముంబై: ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి పైన సంచలన ట్వీట్ చేశారు. చిరు హటావో.. రాష్ట్ర్ బచావో అంటూ ట్వీట్ చేశారు. రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదిక ద్వారా ఆసక్తికరమైన, సంచలనమైన కామెంట్స్ చేస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా.. కాంగ్రెసు హఠావో - దేశ్ బచావో... చిరంజీవి హఠావో... రాష్ట్ర్ బచావో అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు మరింత సంచలనం సృష్టిస్తోంది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి కొనసాగింపుగా రామ్ గోపాల్ వర్మ ఈ ట్వీట్ చేశారు.
కాగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టక ముందు నుండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా పవన్ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందంటూ అనేక సందర్భాల్లో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత కూడా వర్మ తన జోరు కొనసాగించారు.

పవన్ కళ్యాణ్‌ను మించిన నాయకుడు లేడంటూ డప్పు కొట్టి మరీ ప్రచారం చేశారు. అయితే బిజెపి ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని పవన్ కళ్యాణ్ కలవడం, ఆయనకు మద్దతు ప్రకటించడం రామ్ గోపాల్ వర్మకు అస్సలు నచ్చడం లేదు. ఈ విషయమై వర్మ తన ట్విట్టర్లో ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
మోడీ - పవన్ కళ్యాణ్ మీటింగును ఒక భయానక సంఘటనగా పేర్కొన్నారు వర్మ. ‘పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించడం ప్రజల్లో ఒక అద్భుతమైన ప్రభావం చూపింది. కానీ ఆయన కొందరు వ్యక్తులతో చేతులు కలపడం భయాన్ని కలిగిస్తోంది' అంటూ మోడీ - పవన్ మీటింగును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications