రాహుల్‌పై ‘రామ్’ అస్త్రం: అయోధ్య పేరుతో ఓట్ల గండికి కమలం ఎత్తు

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

అహ్మదాబాద్: గుజరాత్‌లో రెండు దశాబ్దాలకు పైగా అధికారంలో ఉన్న బీజేపీ పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. దాంతో ఎట్టి పరిస్థితుల్లో నెగ్గేందుకు ఆ పార్టీ రకరకాల ఆయుధాలను ప్రయోగిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో బీజేపీ గెలవడం ముఖ్యమని, ఆయన దేశ దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే నిర్ణయం తీసుకున్నందువల్ల తాత్కాలిక కష్టాలు వచ్చాయని ఆ పార్టీ చెబుతోంది. ఇది గుజరాత్‌ ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్యని, గుజరాతీలందరూ ఏకం కావాలనే ప్రచారం కూడా ఉధృతంగా సాగుతోంది. మరోవైపు నోటి దాకా వచ్చిన ముద్ద నోటికి అందకుండా పోయినట్టు తయారైంది కాంగ్రెస్ పరిస్థితి.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆశావాహ దృక్పథంతో.. ఉద్ధృతంగా సాగుతున్న ఆ పార్టీ ప్రచారానికి అయోధ్య రాముని రూపంలో పెద్ద సవాల్ ఎదురైంది. అయోధ్య విషయంలో సున్నీ వక్ఫ్‌బోర్డు తరఫున సుప్రీంకోర్టు ఎదుట హాజరైన కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్.. కేసును 2019 సాధారణ ఎన్నికలయ్యే వరకు వాయిదా వేయాలని కోరడమే ఇప్పుడు బీజేపీకి అందివచ్చిన అస్త్రంగా దొరికింది.

సిబల్ వ్యాఖ్య ఆధారంగా రాహుల్‌పై అమిత్ షా దాడి ఇలా

సిబల్ వ్యాఖ్య ఆధారంగా రాహుల్‌పై అమిత్ షా దాడి ఇలా

బాబ్రీ విధ్వంసం జరిగి 25 ఏళ్ల తర్వాత అయోధ్య మరోసారి ఎన్నికల అంశంగా మారింది. కేసును వాయిదా వేయాలని సిబల్ కోరిన కొద్ది నిమిషాల్లోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. కాంగ్రెస్, రాహుల్‌గాంధీపై దాడి మొదలుపెట్టారు. ‘మీరు గుజరాత్‌లోని అన్ని దేవాలయాలను సందర్శిస్తున్నారు. అయోధ్య అంశంపై కూడా మీ అభిప్రాయాన్ని స్పష్టం చేయండి'అని అమిత్‌షా కోరారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో కాషాయ దళాలు అప్పుడే ఉద్ధృత ప్రచారం ప్రారంభించాయి. మొదటిదశ పోలింగ్‌కు కేవలం మూడురోజులు మిగిలిన నేపథ్యంలో అయోధ్య ముఖ్యమైన ఎన్నికల అంశంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

మోదీ స్పందన ఎప్పుడు చేదుగానే ఉంటుందన్న కాంగ్రెస్ నేత ఆనందశర్మ

మోదీ స్పందన ఎప్పుడు చేదుగానే ఉంటుందన్న కాంగ్రెస్ నేత ఆనందశర్మ

22 ఏళ్లుగా గుజరాత్‌లో అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ నేతృత్వంలో బీజేపీ హిందూత్వ ఏకస్వామ్యంపై పదునైన దాడి మొదలుపెట్టింది. ఇదేక్రమంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్‌గాంధీ 15 రోజుల్లో 23 ఆలయాలను సందర్శించారు. ఇది బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులను సృష్టించింది. ఢిల్లీలో తన ఇంటికి దగ్గరలో ఉన్న అక్షరధామ్‌ను ఎన్నడూ సందర్శించని రాహుల్.. గుజరాత్‌లో ఆలయాలను సందర్శించడం కేవలం రాజకీయాల కోసమేనని బీజేపీ విమర్శించింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఏమాత్రం బెదరకుండా తమదైన శైలిలో ముందుకు వెళ్లడం, దేవాలయాల్లో రాహుల్ ప్రత్యేక పూజలు చేయడం హిందువులను ఆలోచింపజేస్తున్నది. గుజరాతీ ఆహారంలోనూ తియ్యదనం ఉంటుంది కానీ, మోదీ స్పందన మాత్రం ఎప్పుడూ చేదుగానే ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్‌శర్మ తెలిపారు. పదే పదే గాంధీ ప్రస్తావన తీసుకువచ్చే మోదీ, సత్యనిష్ఠను మాటల్లోనైనా చూపించరని ఆయన విమర్శించారు.

కుల సమీకరణాలపై అయోధ్య అంశం కేంద్రంగా బీజేపీ దాడి ఇలా

కుల సమీకరణాలపై అయోధ్య అంశం కేంద్రంగా బీజేపీ దాడి ఇలా

గుజరాత్‌లో ఎన్నడూలేని విధంగా ఈసారి బీజేపీకి వ్యతిరేకత ఎదురవుతున్నది. దీనికితోడు కులనాయకులు హార్దిక్‌పటేల్ (పటేల్ సామాజికవర్గం), అల్పేశ్ ఠాకూర్ (ఓబీసీ), జిగ్నేశ్ మేవానీ (దళిత) కాషాయ పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏండ్ల తరబడి కొనసాగుతున్న తన హిందుత్వ ఓట్లను కాపాడుకునేందుకు బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తున్నది. అయోధ్య అంశాన్ని తెరపైకి తేవడంద్వారా కులాల పోరుకు అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నది. 2002లో నరేంద్రమోదీ విజయానికి ఇదే కారణం కావడం గమనార్హం. ఇదే ఫార్ములాను బీజేపీ ఇతర రాష్ర్టాల్లో కూడా విజయవంతంగా ప్రయోగించింది. బీజేపీ వ్యూహంలో భాగంగానే ప్రధాని మోదీ.. తీవ్ర హిందూ వ్యతిరేకి అయిన మొఘల్ రాజు ఔరంగజేబుతో రాహుల్‌గాంధీని పోల్చారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా ఎన్నికల్లో ఓడిపోతామనే బీజేపీ అయోధ్య అంశాన్ని లేవనెత్తుతున్నదని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అహ్మద్ పటేల్ సీఎం అవుతారని కమలనాథులు ఇంటింటా చేపట్టిన ప్రచారంలో చెప్తూ హిందువుల ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

మతకల్లోలాలు జరుగుతాయని బీజేపీ ప్రచారం

మతకల్లోలాలు జరుగుతాయని బీజేపీ ప్రచారం

2002 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు.. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలకు ఎక్కడా పొంతన లేకుండా పోయింది. అప్పుడు ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లు ప్రధాన ఎన్నికల అంశంగా కాగా ప్రస్తుతం వారి ఊసే లేకుండా పోయింది. ప్రధాన పార్టీలు వారి మాట ఎత్తడం లేదు. లౌకికవాద పార్టీగా ముద్రపడిన కాంగ్రెస్ కూడా తన తీరును మార్చుకున్నది. రాహుల్‌గాంధీ హిందూ ఆలయాల సందర్శనే ఇందుకు తార్కాణం. 2002 తర్వాత ముస్లింలు పూర్తిగా అంతర్లీనంగా ఉంటూ విద్య, వ్యాపారాలపైనే దృష్టిపెడుతున్నారు. ‘ముస్లింలు రాజకీయంగా అవసరం లేని వారిగా మిగిలిపోయారు. ఇదేమీ బాధాకరమైన విషయం కాదు. ముస్లింలు లక్ష్యంగా ఉండాలని ప్రధాని మోదీ కోరుకుంటారు. కానీ ఈసారి గుజరాత్ ముస్లింలు సర్దుకుని ఉంటున్నారు' అని మాజీ ప్రొఫెసర్ బందూక్ వాలా అన్నారు. కపిల్ సిబాల్ ను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీపై బీజేపీ విమర్శల నేపథ్యంలో సున్నీ వక్ఫ్ బోర్డు స్పందిస్తూ లోక్ సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు బాబ్రీ కేసు విచారణను వాయిదా వేయాలన్న అభిప్రాయమేదీ తమకు లేదని సున్నీ వక్ఫ్‌బోర్డ్ ప్రకటించింది.ఇదిలా ఉంటే గుజరాత్‌లో కాంగ్రెస్‌ గెలిస్తే మళ్లీ మత కల్లోలాలు జరుగుతాయని, హిందువులు మైనారిటీలో పడిపోతారని చాపక్రింద నీరు లాగా బీజేపీ ప్రచారం సాగుతోంది. ప్రజలు ఈ ప్రచారానికి ఎంత మాత్రం స్పందిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Senior lawyer and Congress leader Kapil Sibal's appearance in Supreme Court for the Sunni Waqf Board seeking deferment of the Ram Janmabhoomi case hearing till after 2019 is likely to rip apart the Congress's well-cultivated campaign on the ground in Gujarat. About 25 years after the Babri Masjid demolition, the elusive Ram Mandir of Ayodhya has once again become a poll issue in Gujarat.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X