వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామారావు ఆన్ డ్యూటీ రివ్యూ: విధులు నిర్వ‌ర్తించ‌డంలో త‌డ‌బ‌డిన ర‌వితేజ‌

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
రవితేజ రామారావు ఆన్ డ్యూటీ

టైల‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్తే.. మ‌న కొల‌త‌ల‌తో చొక్కా కుట్టిపెడ‌తాడు. రెడీమెడ్ షాప్ కెళ్తే.. మ‌న కొల‌త‌ల‌కు స‌రిప‌డా చొక్కా కొనుక్కోవాలి. రెండింటిలోనూ.. మొద‌టిదే కాస్త సుల‌భం. ప‌ర్‌ఫెక్ట్ ఫిట్టింగ్ వ‌స్తుంది. తొడుక్కోవ‌డానికి కూడా హాయిగా ఉంటుంది. సినిమాల్లో ఈ సూత్రం రివ‌ర్స్ లో వ‌ర్తిస్తుంది.

హీరోల ఇమేజ్ కి త‌గిన‌ట్టు క‌థ‌లు ఎంచుకోవాల్సి వ‌స్తుంది. స్టార్ హీరోల విష‌యంలో ఇది ముమ్మాటికీ పాటించాల్సిన రూలు. హీరోలు ఇమేజ్ ప‌క్క‌న పెట్టి చేసిన సినిమాలూ ఉన్నాయి. అవీ సూప‌ర్ హిట్ అయ్యాయి. కానీ ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన అస‌లు విష‌యం ఏమిటంటే.. అలా ఇమేజ్ ప‌క్క‌న పెట్టిన సినిమాల‌న్నీ క‌థా ప‌రంగా బ‌ల‌మైన‌వి.

ర‌వితేజ కూ ఓ ఇమేజ్ ఉంది. త‌న ఎన‌ర్జీ లెవ‌ల్స్ ఓ రేంజ్‌లో ఉంటాయి. కామెడీ చేయ‌డంలో తిరుగులేదు. తెర‌పై క‌నిపిస్తే చాలు ... ప్రేక్ష‌కులు ఎంట‌ర్‌టైన్ అయిపోతారు. ర‌వితేజ సినిమాకి టికెట్ తెగేది అందుకోస‌మే. ఇప్ప‌టి వ‌ర‌కూ ర‌వితేజ అలాంటి సినిమాలే చేశాడు. అయితే రామారావు ఆన్ డ్యూటీ త‌న ఇమేజ్‌కి స‌రిప‌డ క‌థ కాదు. కాస్త డిఫ‌రెంట్. ఎప్పుడూ హుషారుగా ఉండే ర‌వితేజ‌తో సీరియ‌స్ గా డ్యూటీ చేయించే చిత్రం. సో.. ర‌వితేజ కొల‌త‌ల‌కు స‌రిప‌డ‌ని చొక్కా ఇది. మ‌రి... ఆ ప్ర‌య‌త్నం ఎందుకు చేయాల్సివ‌చ్చింది? బ‌ల‌మైన క‌థేమైనా ఉందా? రామారావు డ్యూటీ ఎవ‌రి కోసం చేశాడు? ఎందుకు చేశాడు?

నిజాయ‌తీ డ్యూటీ చేస్తే..?

ట్రైల‌ర్ చూస్తుంటే క‌థ అర్థ‌మైపోతుంది. మ‌ళ్లీ టూకీగా చెప్పుకొంటే.... రామారావు (ర‌వితేజ‌) డిప్యూటీ క‌లెక్ట‌ర్‌. నిజాయ‌తీగా పని చేస్తుంటాడు. ఎప్పుడూ ప్ర‌జ‌ల ప‌క్ష‌మే ఉంటాడు. 24 గంట‌లూ డ్యూటీలోనే.

త‌న‌కు హోదాకంటే తక్కువ బాధ్యతల్లో సొంత గ్రామానికి ఎం.ఆర్‌.ఓగా వెళ్లాల్సి వస్తుంది. ఆ ఊర్లో ఓ మిస్సింగ్ కేసు త‌న ముందుకొస్తుంది. ఆ కేసుని ఛేదించుకొంటూ వెళ్తే... క‌నిపించ‌కుండా పోయింది ఒక్క‌రు కాదు, ఇర‌వైమంది అనే విష‌యం తెలుస్తుంది. వీట‌న్నింటి వెనుక ఓ ముఠా ఉంద‌ని అర్థ‌మ‌వుతుంది. మ‌రి ఈ కేసుని రామారావు ఎలా ఛేదించాడు? ఈ ప్ర‌యాణంలో సీఐ ముర‌ళి (వేణు తొట్టెంపూడి) త‌న‌కు అండ‌గా నిలిచాడా? లేదంటే అడ్డుకొన్నాడా? పోలీసులు ఇన్వెస్టిగేష‌న్ చేయాల్సిన కేసుని... ఓ సివిల్ అధికారి ఎలా నెత్తిమీద పెట్టుకొన్నాడు? అనేది మిగిలిన క‌థ‌.

రవితేజ రామారావు ఆన్ డ్యూటీ

సినిమానా? డాక్యుమెంట‌రీనా?

సినిమాలో తొలి స‌గ భాగం చూస్తుంటే ఎం.ఆర్‌.ఓ.. వాళ్ల విధులు, హ‌క్కులు, అధికారాలు.. వీటిపై ఏదో డాక్యుమెంట‌రీ చూస్తున్న ఫీలింగ్ క‌లుగుతుంది. ఎం.ఆర్‌.ఓకి ఇన్ని అధికారాలు ఉన్నాయా? అంటూ ఆశ్చ‌ర్యం కూడా వేస్తుంది. నిజానికి.. ఎం.ఆర్‌.ఓకి అన్ని అధికారాలు ఉన్నాయ‌న్న సంగతి... స‌ద‌రు ఎం.ఆర్‌.ఓల‌కు సైతం తెలుసో తెలీదో..?

ద‌ర్శ‌కుడు ఈ అంశాన్ని రీసెర్చ్ చేసి తెలుసుకొన్నాడో, లేదో తేలీదు గానీ ఓ చోట మాత్రం వీడంత కాన్ఫిడెన్స్ గా ఫోర్స్ గా చెబుతుంటే.. వాడిక‌న్ని ప‌వ‌ర్స్ ఉన్నాయ‌నే అనిపిస్తోంది అంటూ ఓ పాత్ర‌తో చెప్పించారు. ప్రేక్ష‌కులు కూడా అలానే అనుకొని స‌ర్దుకుపోవాలి. తొలి స‌న్నివేశాల్లో హీరో ఎంత నిబ‌ద్ధ‌త‌తో ప‌నిచేస్తాడో చూపించేశారు. స‌హ ఉద్యోగులు మాటి మాటికీ.. ఈయ‌న ద‌గ్గ‌ర ప‌ని చేయ‌డం మ‌న పూర్వ‌జ‌న్మ సుకృతం అన్న‌ట్టు బిల్డ‌ప్పులు ఇచ్చి, హీరో ఎలివేష‌న్ స‌న్నివేశాల‌కు ఆద్యం పోస్తుంటారు.

మిస్సింగ్ కేసుని ఇన్వెస్టిగేష‌న్ చేయాల్సివ‌చ్చిన‌ప్పుడు అస‌లైన క‌థ మొద‌ల‌వుతుంది. ఈ క‌థ‌లో కొన్ని మ‌లుపులు ఉన్న మాట వాస్త‌వం. అనూహ్యంగా కొన్ని క్యారెక్ట‌ర్స్ లో నెగెటివ్ షేడ్స్ బ‌య‌ట ప‌డుతుంటాయి. వాటిని చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పొచ్చు కూడా. కానీ.. పేల‌వ‌మైన స్క్రీన్ ప్లేతో.. ఎక్క‌డా ఎలాంటి ఆస‌క్తి లేకుండా చేశాడు ద‌ర్శ‌కుడు. స్లో నేరేష‌న్ బాగా ఇబ్బంది పెడుతుంది. విశ్రాంతి కార్డుకి ముందు.. హీరోపై ఎటాక్ జ‌రుగుతుంది. ఆ అటాక్ చేసిందెవ‌రో చెబితే ప్రేక్ష‌కుడు షాక్ తినాలి. కానీ... అలాంటిదేం ఉండ‌దు. వీడు అలాంటివాడే అని మాకు ముందే తెలుసు అన్న‌ట్టు ప్రేక్ష‌కుడు రిలాక్స్ అయిపోతాడు. అంత పేల‌వంగా త‌యారైంది అస‌లు సిస‌లైన ఇంట్ర‌వెల్ బ్యాంగ్‌.

ఎప్ప‌టికీ ముడి విప్ప‌రా?

సీఐ ముర‌ళి (వేణు తొట్టెంపూడి) ముందు నుంచీ.. మాల్ (ఎర్ర చంద‌నం) కోసం వెదుకుతుంటాడు. హీరో ఏమో...మిస్స‌యిన వాళ్ల కోసం గాలిస్తుంటాడు. అంటే.. ఎర్ర చంద‌నానికీ, క‌నిపించ‌కుండా పోయిన వాళ్ల‌కీ ఏదో సంబంధం ఉండే ఉంటుంద‌న్న సంగతి.. ప్రేక్ష‌కుడికి ముందే తెలిసిపోతుంది. హీరోకి తెలిసేట‌ప్ప‌టికి సినిమా అయిపోతుంది. అదే.. ఈ క‌థ‌లో విడ్డూరం.

క్లైమాక్స్ లో త‌ప్ప చిక్కుముడి విప్ప‌కూడ‌ద‌ని ద‌ర్శ‌కుడు భీష్మించుకొని కూర్చుని ఉంటాడు. చివ‌రి వ‌ర‌కూ ఆ ముడి విప్ప‌లేదు. కానీ ఆ మ‌ధ్య‌లో సాగే క‌థ‌... ప‌ర‌మ బోరింగ్ గా త‌యార‌వుతుంది. హీరోయిన్లు ఉన్నారు కాబ‌ట్టి, ఫ్లాష్ బ్యాక్‌లూ, పాట‌లూ ఇరికించి - ర‌వితేజ సినిమా కాబ‌ట్టి ఓ ఐటెమ్ సాంగ్ పెట్టేసి - క‌థ‌ని అటూ ఇటూ ప‌ట్టుకొని బాగా సాగ‌దీశారు. దాంతో చివ‌రి వ‌ర‌కూ అస‌లు క‌థ ఎటుపోతోందో, ఎక్క‌డ ఆగుతుందో అర్థం కాదు. చివ‌ర్లో.. హీరోతో అస‌లేం జ‌రిగింద‌న్న‌ది డైలాగుల రూపంలో చెప్పించి మ‌మ‌ అనిపించారు.

సినిమాకి అత్యంత మూల‌మైన ఆ మిస్సింగ్ కేసు ట్విస్టుని ఇలా డైలాగులు రూపంలో విప్పేయ‌డంతో క‌థ మొత్తంగా తేలిపోయింది. అక్క‌డితో స‌రిపోద‌న్న‌ట్టు.. పార్ట్ 2 కూడా ఉంది.. అన్న‌ట్టు చివ‌ర్లో హింట్ ఇచ్చారు. ఇది మాత్రం... కేజీఎఫ్‌, పుష్ప, విక్ర‌మ్ సినిమాల స్ఫూర్తితోనే అనిపిస్తుంది.

రవితేజ రామారావు ఆన్ డ్యూటీ

క్యారెక్ట‌రైజేష‌న్లు ఏవి?

ఈ సినిమాలో హీరోకంటూ ఓ క్యారెక్ట‌రైజేష‌న్ ఉంది. ఓకే..! కానీ మిగిలిన వాళ్ల పాత్ర‌ల‌కు స‌రైన ప్రారంభం, ముగింపు క‌నిపించ‌వు.

ఇద్ద‌రు హీరోయిన్లు ఉన్నా... వాళ్లిద్ద‌రికీ క‌లిపి ప‌ది డైలాగులు ఉండ‌వేమో..?

వేణు చాలా కాలం త‌ర‌వాత క‌నిపించాడు. త‌ను హీరోనా, విల‌నా? క‌మెడియ‌నా? అనేది అర్థం కాదు.

సింగ‌పూర్‌లో ఈ మాఫియా కింగ్ ఉన్న‌ట్టు చూపించారు. అది కూడా రెండు నిమిషాల పాత్రే.

రామారావు ఆన్ డ్యూటీ అని చెప్పి ఎం.ఆర్‌.ఓ ప‌నులు త‌ప్ప‌.. మిగిలిన‌వ‌న్నీ చేసిన‌ట్టు చూపించారు. ఎం.ఆర్‌.ఓ అంటే.. సీఎం త‌ర‌వాత అన్ని అధికారాలు త‌న ద‌గ్గ‌రే ఉన్న‌ట్టు బిల్డ‌ప్ ఇచ్చారు. సినిమా టిక్ లిబ‌ర్టీ చాలా తీసుకొన్నారు.

డ్యూటీ.. డ్యూటీ అని చెప్పి సీసా పాట‌లో.. ఐటెమ్ గాళ్‌తో స్టెప్పులు వేస్తున్న ఎం.ఆర్‌.ఓ గారిని చూస్తే... బాధేస్తుంటుంది.

ట్విస్టులు ఉన్నా, వాటిని స‌రైన టైమ్ లో విప్ప‌డంలో ద‌ర్శ‌కుడు విఫ‌ల‌మ‌య్యాడు. ర‌వితేజ లుక్ బాగుంది. త‌న డ్ర‌స్సింగ్ స్టైల్ బాగుంది. ఐటెమ్ గాళ్ ని తీసుకొచ్చారు. కానీ... త‌న ఒంపుసొంపుల్ని సెన్సార్ వాళ్లు బ్ల‌ర్‌ చేయ‌డం క‌నిపించింది.

అడ్డొచ్చిన పాట‌లు

క‌థ‌, క‌థ‌నాలు పేల‌వంగా ఉన్న‌ప్పుడు టెక్నిక‌ల్ గా ఎంత క‌ష్ట‌ప‌డినా వ్య‌ర్థ‌మే. పాట‌లు బాగానే ఉన్నా.. క‌థ‌ని ఆపి.. పాట ప్లే చేసిన‌ట్టు అనిపించింది.

కొన్ని చోట్ల మాట‌లు మ‌రీ డ్ర‌మెటిక్‌గా అనిపిస్తాయి.

ర‌వితేజ అంటే క‌మ‌ర్షియ‌ల్ హీరో. త‌న‌తో ఓ డాక్యుమెంట‌రీ టైపు థ్రిల్ల‌ర్ చేశాడు ద‌ర్శ‌కుడు. ర‌వితేజ నుంచి ఆశించే వినోదం ఈ సినిమాలో జీరో.

ఇన్వెస్టిగేష‌న్ ని థ్రిల్లింగ్ గా చెప్పాల్సింది పోయి.. నీర‌సాన్ని తెప్పించాడు. పార్ట్ 2 ఉంది అని చెప్పారు గానీ, నిర్మాత‌లు ఇప్పుడు అంత ధైర్యం చేయ‌క‌పోవొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Rama Rao on duty review: Ravi Teja has failed in performing duties
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X