వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామోజీ తండా: ‘పోలీస్ కావాలనుకున్న నా కొడుకును దొంగను చేశారు’

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
గుగులోత్ వీరశేఖర్

తెలంగాణలోని సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలంలోని రామోజీ తండా ఒక సాధారణ లంబాడ గిరిజన పల్లె.

ఈ తండాకు చెదిన గుగులోత్ వీరశేఖర్(23) అనే గిరిజన యువకుడిని దొంగతనం ఆరోపణల పై ఆత్మకూరు(ఎస్) పోలీసులు చితకబాదారు.

ఆ తర్వాత గిరిజన సంఘాలు, వివిధ రాజకీయ పక్షాలు, హక్కుల సంఘాల ఆందోళనలకు దిగాయి.

పోలీసుల తీరు పై తీవ్ర విమర్శలు వచ్చాయి.

రామోజీ తండా

ఇంతకూ ఏమిటీ కేసు?

నవంబర్ 4న తన దుకాణంలో చోరీ జరిగిందని.. 40 క్వార్టర్ సీసాల మద్యం, 10 వేల నగదు ఎత్తుకెళ్లారని ఏపూర్ గ్రామానికి చెందిన షేక్ సైదులు ఆత్మకూర్(ఎస్) పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.

విచారణలో భాగంగా సీసీ ఫుటేజ్ ఆధారంగా రామోజీ తండాకు చెందిన 'బానోత్ నవీన్'ను అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు.

ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా బుధవారం (నవంబర్ 10)న బానోత్ బుచ్యా, బానోత్ లాల్ సింగ్, గుగులోత్ వీరశేఖర్‌లను గ్రామం నుండి తీసుకెళ్లారు. అదే రోజు రాత్రి వీరశేఖర్‌ను వదిలేశారు.

మళ్లీ ఉదయాన్న మరోసారి విచారించాలని, స్టేషన్ కు రావాలని అడిగారు.

అయితే అప్పటికే తీవ్రంగా అస్వస్థతకు గురైన వీరశేఖర్‌ను ఏమైందంటూ కుటుంబ సభ్యులు ఆరా తీయగా... విచారణ పేరిట పోలీసులు తనను చిత్రహింసలకు గురిచేసినట్టు వెల్లడించాడు.

ఆగ్రహంతో గ్రామస్తులు, కుటుంబసభ్యులు కదల్లేని స్థితిలో ఉన్న వీరశేఖర్‌ను ట్రాక్టర్ లో తీసుకుని వెళ్లి ఆత్మకూరు(ఎస్) పోలీస్ స్టేషన్ ముట్టిడించి, అక్కడి పోలీస్ సిబ్బందిని నిలదీశారు.

గుగులోత్ భీల్ సింగ్, గుగులోత్ వీరన్న

వీరశేఖర్‌తో పాటు రామోజీతండా గ్రామస్తులు ట్రాక్టరులో సూర్యాపేటలో ఎస్పీ కార్యాలయం ముందు ధర్నా చేసేందుకు బయల్దేరారు. వీరిని చివ్వెంల మండలం 'కుడకుడ' వద్ద పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో అక్కడే రోడ్డు పై గిరిజనులు ఆందోళనకు దిగి రాస్తారోకో చేపట్టారు. వారితో సూర్యాపేట డీఎస్పీ చర్చలు జరిపారు. న్యాయం జరిగేలా చూస్తామని ,ఎస్సై పై చర్యలుతీసుకుంటామని బాధితునికి మెరుగైన చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు.

వీరశేఖర్‌తో పాటు లాల్ సింగ్‌పైనా కేసు లేకుండా చూస్తామన్నారు. దీంతో వారంతా ఆందోళన విరమించారు.

అనంతరం చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లాల్ సింగ్ ను పోలీసులు విడిచిపెట్టారు. బానోత్ నవీన్, బానోత్ బుచ్యా లు ఇంకా రిమాండ్ లో ఉన్నారు.

వీరశేఖర్ ప్రస్తుతం సూర్యాపేట లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

వీరశేఖర్

'తలపై కొట్టారు.. ఎవరినీ గుర్తుపట్టలేకపోతున్నాను’

రామోజీతండాకు చెందిన గుగులోత్ భీల్ సింగ్‌కు నలుగురు పిల్లలు. అందరిలో చిన్నవాడైన వీరశేఖర్ డిగ్రీ చదువు మధ్యలో ఆపేశారు.

2015 లో తెలంగాణ పోలీస్ సివిల్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కు ప్రిపేర్ అయ్యారు. తండ్రి భీల్ సింగ్ మోకాళ్ల నొప్పితో బాధపడుతుంటడంతో వ్యవసాయం బాధ్యతలు చూసుకుంటున్నారు. తమ 8 ఎకరాలతో పాటు మరో 4 ఎకరాలను భూమి కౌలుకు తీసుకుని అన్న వీరన్నతో కలిసి వీరశేఖర్ వ్యవసాయం చేస్తున్నారు.

ఈ క్రమంలో దొంగతనం ఆరోపణలపై అతన్ని పొలంలో పనిచేస్తుండగా ఆత్మకూరు(ఎస్) పోలీసులు విచారణ పేరుతో తీసుకెళ్లారు.

"మిరప తోటకు నీరు పెడుతుండగా సివిల్ డ్రెస్‌లో ఇద్దరు వచ్చారు. ఎందుకొచ్చారని అడిగితే చెప్పకుండానే బండిమీద ఎక్కించుకుని తీసుకెళ్లారు. స్టేషన్‌లో టార్ఛర్ పెట్టారు. మూత్రం పోసుకుంటే, నాతో నాకించారు. నా ప్యాంట్‌తోనే శుభ్రం చేయించారు. ఆ తర్వాత నేను దెబ్బలకు స్పృహ తప్పిపోయాను."

బాధితుడి తల్లి గుగులోత్ ఖీరా

''నువ్వు ఒప్పుకో అంటూ బలవంతం చేశారు. నేనేం తప్పు చేసాను, ఏం ఒప్పుకోవాలని అడిగితే కొడుతూనే ఉన్నారు. ఎంత అరిచినా వదల్లేదు. నాకు తెలియదంటే ఒప్పుకోమని బలవంతం చేశారు. చచ్చిపోవాలని అనిపించింది. మనుషులను గుర్తుపట్టలేకపోతున్నాను. తలపై కొట్టారు".

"ముగ్గురు కానిస్టేబుళ్లు నన్ను అన్యాయంగా కొట్టారు. నాతో మూత్రం నాకించారు. ఆ తర్వాత 'నువ్వు ఆదిమ మానవుడివా’ అని ఎస్సై లింగం , తోటి కానిస్టేబుళ్లతో కలిసి అవహేళన చేశారు" అని విచారణలో భాగంగా పోలీసులు తనతో ప్రవర్తించినతీరును బీబీసీకి వివరించారు గుగులోత్ వీరశేఖర్.

" నా కొడుకు సద్ది తినకుండా పొలంలో నుంచి పట్టుకుపోయారు. నేను చదువుకున్నోన్ని, చోరీ చేయనని నా కొడుకు చెప్పినా వినిపించుకోలేదు. నా కొడుకు పోలీస్ అవుదామనుకుంటే, దొంగను చేశారు' అని వీరశేఖర్ తల్లి 'గుగులోత్ ఖీరా' బీబీసీతో వాపోయారు.

ఆత్మకూరు (ఎస్ )మండల పరిధిలో ఎస్సారెస్పీ కాలువ

పొలాల్లో వరుస చోరీలు: వ్యవసాయ సామగ్రి ఎత్తుకెళ్తున్న దొంగలు

ఆత్మకూరు (ఎస్ )మండల పరిధిలో ఎస్సారెస్పీ కాలువ ఉంది. ఈ ప్రాంతంలో ప్రధానంగా వరి, మిరప,పత్తి పంటలను ఇక్కడి రైతులు సాగుచేస్తున్నారు. కాలువ నుంచి మోటార్ల ద్వారా నీరు పంప్ చేసి పొలాలకు వాడుకుంటున్నారు.

కొంతకాలంగా రామోజీ తండా, నశీంపేట, పుప్పాలగూడెం, కాసింగూడెం, ఏపూర్ గ్రామాల పరిధిలో వ్యవసాయ పరికరాల దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మోటార్లు, వాటి స్టార్టర్లు, పంపుసెట్లు, పైపులు ,విద్యుత్ వైర్లు లాంటి వి దొంగలు ఎత్తుకెళ్తున్నారు. స్థానిక రైతుల నుంచి పోలీసులకు పిర్యాదులు అందాయి

అయితే ఈ దొంగతనాలను ఒప్పుకోవాల్సిందిగా రామోజీ తండా యువకులను బలవంతం చేస్తున్నారని, చిత్రహింసలకు గురిచేశారన్నది పోలీసులపై ఈ గ్రామస్తుల ఆరోపణ.

చేయని నేరాలను కొందరితో ఒప్పించి కేసులను పూర్తిచేయాలనుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.

గుగులోత్ ఖీరా

'బెల్ట్ షాప్ లో దొంగతనం వదిలేసి, మోటార్ దొంగతనాలపై పడ్డారు. మా గ్రామానికి రెండుసార్లు వచ్చి నలుగురని తీసుకెళ్లారు. కొట్టి ,బలవంతంగా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు" అని రామోజీ తండాకు చెందిన ధరావత్ సుజాత ఆరోపించారు.

తరచూ పోలీసులు గ్రామంలోకి వస్తుండటంతో భయం గుప్పిట్లో బతుకుతున్నామని ఇదే గ్రామానికి చెందిన బానోత్ రూప్ చంద్ బీబీసీ తో చెప్పారు.

"భయంగానే ఉంది సార్, కానిస్టేబుళ్లు వస్తుండ్రంటే ఎక్కడివారిమి అక్కడే పారిపోతున్నాం. రోడ్లపొంటి చేండ్లల్లకు పోయి దాసుకుంటుండ్రు. కంది చేలల్లో, పత్తిచేలల్లో పోయి దాక్కుంటున్నామని' తెలిపారు.

నా కొడుక్కి ఆరోగ్యం బాగాలేదు. కిడ్నీ రోగం తో బాధపడుతుంటే ఆరునెలల క్రితం 2 లక్షలు పెట్టి వైద్యం చేయించిన బాగాకాలేదు. ఆరోగ్యం బాగులేదని చెప్పినా కూడా కొట్టి నేరం ఒప్పించారు. దెబ్బలకు తాళలేక చేయని నేరాన్ని చేసినట్టుగా ఒప్పుకున్నారు.

ప్రజా సంఘాల ఆందోళన

రామోజీతండా ఘటన పై ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. గిరిజన సంఘాలతో పాటు, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్, సిపిఐ జాతీయ కార్యదర్శి , నారాయణ బాదితుడు వీరశేఖర్‌ను పరామర్శించారు. ఈ ఘటనలో బాధ్యులను చట్టప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఈ కేసులో పిర్యాదుదారు, బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నారని ముందుగా అక్రమంగా బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న పిర్యాదు దారునిపైనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

ఆత్మకూర్ పోలీస్ స్టేషన్

కొనసాగుతున్న పోలీస్ విచారణ

సూర్యాపేట జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు ఈ ఘటన పై విచారణకు ఆదేశించారు. సూర్యాపేట డీఎస్పీ మోహన్ కుమార్‌ను విచారణ అధికారిగా నియమించారు. ఈ ఘటన జరిగిన రెండో రోజు ఆత్మకూరు(ఎస్) పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై లింగంను సస్పెండ్ చేసారు.

"బాధితుని పిర్యాదులో ప్రాథమిక అంశాల ఆధారంగా ఆత్మకూరు (ఎస్) ఎస్సైను వీఆర్‌లో పెట్టాం. ఘటనపై విచారణకు ఆదేశించాం. విచారణ ఇంకా కొనసాగుతోంది. పూర్తి స్థాయి విచారణ నివేదిక వచ్చాక, దాని ఆధారంగా అవసరమైతే మరిన్ని చర్యలను తీసుకుంటాం' అని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ బీబీసీకి తెలిపారు.

ఆత్మకూరు (ఎస్ ) ప్రాంతంలో తరచూ వ్యవసాయ పంప్ సెట్ మోటార్లు, కేబుల్స్, స్టార్లర్లు దొంగతనాలను గురవుతున్నాయి. రైతులు ఇబ్బందిపడుతున్నారు.

మేం కేసు నమోదు చేసింది కిరాణా షాప్ లో దొంగతనం అయ్యిందని, ఆ షాప్ బెల్ట్ షాప్ అయ్యిండొచ్చు. కొంతమంది గ్యాంగ్‌గా ఏర్పడి పొలాల్లో రైతుల విద్యుత్ మోటార్లు దొంగతనం చేస్తున్నారు. ఇప్పటికి 6 మోటార్లను రికవరీ చేశాం అని ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

'ఎస్సైను సస్పెండ్ చేస్తే ఏమయ్యింది, శుభ్రంగా ఇంట్లో కూర్చున్నారు. నా కొడుకు పరిస్థితి ఏమిటి? వాడు కూలిపోయి ఉన్నాడు. పనిచేసుకుని తినే పరిస్థితి లేదు. మా పిల్లాడికి న్యాయం జరగాలి" అని వీరశేఖర్ తండ్రి 'గుగులోత్ భీల్ సింగ్' డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Ramoji Tanda: 'Police kidnapped my son who wanted to become a cop
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X