బీజేపీ భాగస్వామ్య పార్టీ అరుదైన చర్య: తొలి అభ్యర్థిగా ముస్లిం నేతను ప్రకటించిన అప్నా దళ్
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తాజాగా, అధికార భారతీయ జనతా పార్టీ భాగస్వామ్య పక్షమైన అప్నాదళ్(ఎస్) తమ తొలి అభ్యర్థిగా ముస్లిం నేతను ప్రకటించింది.
పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలోని సువార్ నుంచి, జైలులో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆజం ఖాన్ కుమారుడు అబ్దుల్లా ఆజం పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుంచి అప్నా దళ్ అభ్యర్థిగా హైదర్ అలీ ఖాన్ పోటీలో దిగుతున్నారు.
అనుప్రియా పటేల్ నాయకత్వంలోని అప్నా దళ్ (ఎస్), సంజయ్ నిషాద్‌కి చెందిన నిషాద్ పార్టీ - బీజేపీ దాని కూటమి భాగస్వాముల మధ్య సీట్ల పంపకాల ఏర్పాటుపై అధికారిక సమాచారం లేనప్పటికీ ఈ ప్రకటన రావడం గమనార్హం.

బిజెపి మిత్రపక్షం నుంచి హైదర్ ఖాన్ అభ్యర్థిత్వం ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో బీజేపీ కూటమి ముస్లిం అభ్యర్థిని నిలబెట్టిన అరుదైన సందర్భాలలో ఒకటి.
హైదర్ అలీ ఖాన్ రాంపూర్ రాజ కుటుంబానికి చెందినవారు, అతని తాత జుల్ఫికర్ అలీ ఖాన్ రాంపూర్ నుంచి ఐదు సార్లు కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు. హైదర్ తండ్రి, నవాబ్ కాజిమ్ అలీ ఖాన్, నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రస్తుతం సువార్ పక్కనే ఉన్న రాంపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు.
అప్నా దళ్ (ఎస్) అభ్యర్థి యూ-టర్న్‌ల ద్వార వార్తల్లో నిలిచారు. ఆయన తొలుత సువార్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపికయ్యారు. తరువాత అతను ఢిల్లీకి వెళ్లి అనుప్రియా పటేల్‌ను కలిశారు. ఆమె ఇప్పుడు అధికారికంగా హైదర్‌ను సువార్ నుంచి తన పార్టీ అభ్యర్థిగా పేర్కొంది.
అబ్దుల్లా ఆజం 2017 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా సువార్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. డిసెంబరు 2019లో, అలహాబాద్ హైకోర్టు.. అబ్దుల్లా 2017 ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసినప్పుడు 25 ఏళ్లలోపు ఉన్నారనే కారణంతో ఆయన ఎన్నికల విజయాన్ని రద్దు చేసింది.
ఫిబ్రవరి 2020 నుంచి, అబ్దుల్లా మోసంతో సహా పలు ఆరోపణలపై జైలులో ఉన్నారు. కొద్ది రోజుల క్రితం బెయిల్ పొందిన ఆయన.. ఈసారి సమాజ్‌వాదీ పార్టీ సువార్ నుంచి బరిలోకి దిగే అవకాశం ఉంది.
అబ్దుల్లా తండ్రి ఆజం ఖాన్ రాంపూర్ నుంచి ప్రస్తుత లోక్‌సభ ఎంపీ, వివిధ కేసులలో ఫిబ్రవరి 2020 నుంచి జైలులో ఉన్నారు. త్వరలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు మధ్యంతర బెయిల్ కోరుతూ ఆజం ఖాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాను ఖైదులో ఉండేలా తన మిగిలిన మూడు బెయిల్ దరఖాస్తులపై విచారణను ఆలస్యం చేసేందుకు రాష్ట్రం "అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను అవలంభించిందని" తన పిటిషన్‌లో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications