మహా సీఎం ఎవరైనా మా మద్దతు ఉంటుంది: శివసేన
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేసినా తమ మద్దతు ఉంటుందని శివసేన పార్టీ తన పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొంది. మహారాష్ట్రను ముందుకు నడిపించే నేతకు తమ మద్దతు తప్పక ఉంటుందని తెలిపింది.
మహారాష్ట్రలో బీజేపీతో పొత్తు అధికారంగా ఖరారు కాకపోయినా.. ఆదివారం జరిగిన సమావేశంలో కొంత మంది బీజేపీ నాయకులు శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
ఇది ఇలా ఉంటే మంగళవారం బీజేపీ శాసనసభపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్, మహారాష్ట్ర పార్టీ వ్యవహారాల బాధ్యుడు జెపి నడ్డా హాజరుకానున్నారు.

మరోవైపు, అక్టోబర్ 30న బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే.
మోడీ, అమిత్ షాలను పొగుడుతూ సామ్నా సంపాదకీయం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు భారతీయ జనాతా పార్టీని చీల్చిచెండాడిన శివసేన తాజాగా పొగడ్తలు మొదలుపెట్టింది. పార్టీ పత్రిక 'సామ్నా'లో రాసిన సంపాదకీయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలను పొగడ్తలతో ముంచెత్తింది.
ఇందుకు కారణం ఆ పార్టీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి మహారాష్ట్రలో అతి పెద్ద పార్టీగా అవతరించడమే. అంతేకాదు, బీజేపీ నేతృత్వంలో రాష్ట్ర పాలన సాగడం చాలా సంతోషమని తెలిపింది. మహారాష్ట్రలో ఈ విజయానికి కారణమైన ప్రధాని మోడీ, అమిత్ షాలను కూడా ప్రశంసించింది.












Click it and Unblock the Notifications