మోడీని కలుస్తా, రాజకీయాల్లో ఢీకొడతా: నితీష్, మాంఝీ హాజరు
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ ముఖ్యనేత నితీష్ కుమార్ ఆదివారం నాడు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్‌లో గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారానికి బీహార్ మాజీ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ, మాజీ ప్రధాని దేవేగౌడ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, యూపీ సీఎం అఖిలేష్ యాదవ్, అసోం సీఎం తరుణ్ గొగోయ్ తదితరులు హాజరయ్యారు.
నితీష్‌తో పాటు 22 మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అందులో 20 మంది మాంఝీ మంత్రివర్గంలో పని చేసిన వారే. ఈ సందర్భంగా నితీష్ మాట్లాడారు. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ బీహార్ అభివృద్ధి కోసం ప్రధాని మోడీ సహకారాన్ని కోరుతానని చెప్పారు. ఇందుకోసం త్వరలో ప్రధానిని కలుస్తానని చెప్పారు. రాజకీయంగా ఒకరినొకరం ఎదుర్కొంటామని, బీహార్ అభివృద్ధి కోసం ప్రధానిని కలవడానికి సంకోచించనని చెప్పారు.
కేంద్ర, రాష్ట్ర సత్సంబంధాలకు కృషి చేస్తానన్నారు. తనకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారని చెప్పారు. తనకు శుభాకాంక్షలు తెలిపినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఆర్జేడీ అధ్యక్షులు లాలూ ప్రసాద్ యాదవ్ తన కుమార్తె వివాహం కారణంగా హాజరుకాలేకపోయారని చెప్పారు. తనకు సోనియా గాంధీ శుభాకాంక్షలు తెలిపారని, ప్రజలకు సుపరిపాలన అందించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు.

నితీష్, మాంఝీ కేబినెట్లో...
మంత్రులుగా ప్రమాణం చేసినవారిలో 20 మంది గతంలో నితీశ్ కేబినెట్‌లోనూ, ఆ తరువాత మాంఝీ కేబినెట్‌లోనూ కొనసాగారు. పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు వీరిలో 18 మంది నితీశ్‌కు మద్దతుగా పదవులకు రాజీనామాలు చేశారు. ఇద్దరిని మాంఝీ తొలగించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులెవరూ పాల్గొనలేదు. కానీ, మాజీ ముఖ్యమంత్రి మాంఝీ పాల్గొన్నారు. ఆసాంతం జనతా పరివార్ నేతల సందడి కనిపించింది.
జనతా పరివార్ పేరిట బీజేపీయేతర పక్షాలను ఒక వేదిక మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలకు నితీశ్ పునరుద్ధానం చక్కని సందర్భమని భావిస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా లౌకిక పార్టీలు ఏకమవ్వాల్సిన అవసరముందని దేవెగౌడ చేసిన వ్యాఖ్యలను మమత, అఖిలేష్, గొగోయ్‌తోపాటు ఇతర నేతలు సమర్థించారు. సీఎం నితీశ్‌కు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు.
దుష్టశక్తి అన్న లాలు అండగా...
ఏ కుర్చీని వద్దు అని వదిలేశారో ఇప్పుడు దాన్నే తిరిగి వరించారు. ఎవరినైతే బీహార్ పాలిట దుష్టశక్తి అని దుయ్యబట్టారో అదే నేత అయిన లాలుకు ఇప్పుడు నితీష్ దగ్గరయ్యారు. పదవిని చేజార్చుకోవడం, అంతే వేగంగా చేపట్టడం ఈ ఇంజనీరింగ్ పట్టభద్రుడికి స్విచ్ వేసినంత తేలిక.
జేపీ, లోహియా సిద్ధాంతాలకు ప్రభావితుడైన ఈ సోషలిస్టు నేత తొలి దశలో వరస పరాజయాలను చవిచూశారు. 1974 నుంచి ఎన్నికల్లో పోటీపడుతున్నా 1985లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2000లో తొలిసారి సీఎం అయినా సభలో సంఖ్యా బలం లేక ఏడు రోజులకే వైదొలగాల్సి వచ్చింది. ఆ తరువాత ఐదేళ్లకు 2005లో బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చారు.
2010లోనూ అదే ప్రభంజనం కొనసాగించారు. ఇప్పుడు.. మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరుగుతాయనగా నాడు తాను అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆర్జీడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు.
కాగా, నితీష్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరైన మాజీ సీఎం మాంఝీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, బీహార్‌లో నితీష్ ప్రమాణ స్వీకారం సందర్భంగా కొన్ని ఫ్లెక్సీలు వెలిశాయి. అందులో నితీష్ కుమార్‌ను అర్జునుడిగా చూపించారు. అతను తన ప్రత్యర్థులు మాంఝీని, బీజేపీ నేతలను ఎదుర్కొంటున్నట్లుగా ఉంది.












Click it and Unblock the Notifications