కర్నాటకలో రిజర్వేషన్ల రాజకీయం-75 శాతానికి పెంచుతామన్న కాంగ్రెస్-ప్రైవేటులోనూ ఇస్తామన్న జేడీఎస్..
కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. మే 10న ఒకే విడతలో రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ తరుణంలో రిజర్వేషన్ల రాజకీయాలు ఊపందుకున్నాయి. ఇప్పటివరకూ రాష్ట్రంలో రిజర్వేషన్ల కోసం ఉన్న డిమాండ్లన్నీ తెరపైకి వచ్చేస్తున్నాయి. అదే సమయంలో వాటిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు విపక్ష కాంగ్రెస్, జేడీఎస్ పావులు కదుపుతున్నాయి. ఓవైపు ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసిన బీజేపీకి కౌంటర్ గా విపక్షాల ఎత్తులు చర్చనీయాంశమవుతున్నాయి.
కర్నాటకలో తాము అధికారంలోకి వస్తే మొత్తం రిజర్వేషన్లను 75 శాతానికి పెంచుతామని కాంగ్రెస్ తమ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న 50 శాతం కోటా పరిమితితో సమస్యలు తప్పడం లేదని, సమాజంలో అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే రిజర్వేషన్ల పరిమితిని పెంచక తప్పదని కాంగ్రెస్ చెబుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో రిజర్వేషన్ల కోసం ఉన్న డిమాండ్లు అన్నింటినీ అమలు చేయాలంటే రిజర్వేషన్లను 75 శాతానికి పెంచాల్సిందేనంటోంది. అధికారంలో ఉన్న బీజేపీ ఈ హామీ ఇచ్చే పరిస్ధితి లేదు కాబట్టి ఆ మేరకు ఒత్తిడి పెరుగుతోంది.

మరోవైపు మరో విపక్షం జేడీఎస్ కూడా రిజర్వేషన్లపై కొత్త బాణీ వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో అమలు చేస్తున్న రిజర్వేషన్లను ప్రైవేటుకు కూడా వర్తింపచేస్తామని హామీ ఇస్తోంది. ఇప్పటికే సమాజంలోని పలు వర్గాల నుంచి వినిపిస్తున్న ఈ డిమాండ్ ను అమలు చేస్తామని హామీ ఇవ్వడం ద్వారా నిరుద్యోగుల్ని ఆకట్టుకోవాలని జేడీఎస్ భావిస్తోంది. అయితే జేడీఎస్ కు ఈ హామీ అమలు చేసే సత్తా లేకపోవడం, సొంతంగా అధికారంలోకి వచ్చే అవకాశం కూడా లేకపోవడంతో దీనికి అంతగా ఆదరణ లభించడం లేదు. మరోవైపు ముస్లింలకు బీజేపీ తీసేసిన 4 శాతం కోటా తిరిగి అమలు చేస్తామని కూడా జేడీఎస్ హామీ ఇచ్చింది.
అటు బీజేపీ మాత్రం ఇప్పటికే ఉన్న ముస్లిం రిజర్వేషన్లను తొలగించి ఒక్కళిగలు, లింగాయత్ లకు పంచేయడంపై నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో విపక్ష పార్టీలైన కాంగ్రెస్, జేడీఎస్ ఇలా కొత్త కొత్త రిజర్వేషన్ల హామీలు ఇస్తుండటం సహజంగానే అధికారపక్షంపై ఒత్తిడి పెంచేస్తోంది. అలాగే జేడీఎస్, కాంగ్రెస్ రెండూ ముస్లిం రిజర్వేషన్లను తిరిగి యథాతథంగా అమలు చేస్తామని హామీలు ఇస్తుండటంతో అది కూడా బీజేపీపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications