60 మీటర్ల మృత్యుమార్గం: లక్షిత దాడులపై మేజర్ టాంగో

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

న్యూడిల్లీ: నియంత్రణ రేఖ దాటి వెళ్లి, పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు వేగంతో అలవోకగా దాడులు చేసిన భారత సైనిక కమాండోలకు.. తిరుగు ప్రయాణమే చాలా కష్టమైంది. నాడు ఆలస్యంగా మేల్కొన్న పాకిస్థాన్‌ సైనికులు.. మన ధీర యోధులపై తూటాల వర్షం కురిపించారు. ఆ బులెట్లు.. వారిని చెవులను రాసుకుంటూ వెళ్లాయి. చిమ్మచీకటిలో వాటిని తప్పించుకుంటూ అతికష్టం మీద మన యోధులు తిరిగొచ్చారు.

జమ్మూ కశ్మీర్‌లోని యురిలో గత ఏడాది సెప్టెంబర్‌లో పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత సైనిక స్థావరంపై దాడి చేసి 19 మంది సైనికులను హతమార్చారు. దీనికి ప్రతిగా సెప్టెంబర్‌ 29న భారత సైన్యంలోని ప్రత్యేక బలగాలు ఆక్రమిత కశ్మీర్‌లోకి చొచ్చుకెళ్లి, ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి పెద్ద సంఖ్యలో ముష్కరులను హతమార్చిన సంగతి తెలిసిందే.శత్రువు వెన్నులో దడ పుట్టించిన ఆ సాహసోపేత దాడికి నాయకత్వం వహించిన ఒక మేజర్‌ నాటి పరిణామాలను ఒక పుస్తకంలో పూసగుచ్చినట్లు వివరించారు.

'ఇండియాస్‌ మోస్ట్‌ ఫియర్‌లెస్‌: ట్రూ స్టోరీస్‌ ఆఫ్‌ మోడర్న్‌ మిలటరీ హీరోస్' పేరుతో వస్తున్న ఈ పుస్తకాన్ని శివ్‌ అరూర్‌, రాహుల్‌ సింగ్‌ రాశారు. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో భారత వీర సైనికులు ప్రదర్శించిన 14 సాహసోపేత చర్యలను పేర్కొన్నారు. భారత్‌లో అత్యంత కుతూహలం రేపిన మెరుపు దాడి అంశాన్ని ప్రస్తావించారు. ఇందులో.. సదరు అధికారి పేరును మేజర్‌ 'మైక్‌ టాంగో'గా పేర్కొన్నారు. ఈ పుస్తకాన్ని 'పెంగ్విన్ ఇండియా' సంస్థ ప్రచురించింది.

యురి ఉగ్రవాద ఘాతుకానికి ప్రతీకారంగా ఆక్రమిత కశ్మీర్‌లో మెరుపు దాడులకు భారత సైన్యం ప్రణాళిక రచించింది. ముష్కరుల దుశ్చర్యలో నష్టపోయిన రెండు రెజిమెంట్ల (10 డోగ్రా, 6 బీహార్‌)కు చెందిన సైనికులను ఇందులో భాగం కల్పించారు. వీరితో ఒక 'ఘాతక్‌' ప్లటూన్‌ ఏర్పాటు చేశారు. మెరుపు దాడుల సమయంలో సరిహద్దు శిబిరాల వద్ద గస్తీకి, దాడులు చేయడానికి రంగంలోకి దిగిన ప్రత్యేక దళాలకు ఆ ప్రాంత భౌగోళిక అంశాలపై సమాచారం ఇవ్వడానికి, ఇతరత్రా తోడ్పాటుకు వారిని ఉపయోగించుకున్నారు.

ఆచితూచి నిర్ణయం

ఆచితూచి నిర్ణయం

లక్షిత దాడుల కోసం ఎంపిక చేసిన లక్ష్యాలపై ఉన్నతాధికారులు చాలా నిశితంగా మదింపు జరిపారు. అతికొద్దిమందికి మాత్రమే విషయాన్ని చేరవేశారు. ‘సదరు అధికారికి ఈ విషయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉందా' అన్న సూత్రాన్ని ఇక్కడ వర్తింపచేశారు. దాడి వ్యూహాలను ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ), రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ (రా) అధికారులు పరిశీలించారు. ఈ కసరత్తు తర్వాత తుది సిఫార్సులు ప్రభుత్వానికి చేరాయి. దాడి బాధ్యతలను మేజర్‌ టాంగోకు అప్పగించారు. అత్యుత్తమ నైపుణ్యాలు కలిగిన మరో 19 మందిని తన బృంద సభ్యులుగా ఆయన ఎంచుకున్నారు. దాడి అనంతరం క్షేమంగా స్థావరానికి తిరిగి రావడం ఎలా అన్నది టాంగో బుర్రను తొలిచేసింది. ఆ సమయంలో తన బృందానికి ప్రాణనష్టం తలెత్తవచ్చని ఆయన ఆందోళన చెందారు.

ఇన్ ఫార్మర్లుగా పీఓకే వాసులు ఇలా

ఇన్ ఫార్మర్లుగా పీఓకే వాసులు ఇలా

దాడి కోసం పాకిస్థాన్‌ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ నిర్వహణలో ఉన్న నాలుగు ఉగ్రవాద శిబిరాలను భారత సైనిక ఉన్నతాధికారులు ఎంచుకున్నారు. అవి పాక్‌ సైనిక రక్షణలో ఉన్నాయి. దాడి కోసం టాంగో బృందం.. ఆక్రమిత కశ్మీర్‌లోని ఇద్దరు గ్రామస్థులను, ఆ ప్రాంతంలో కార్యకలాపాలు సాగిస్తున్న మరో ఇద్దరు పాక్‌ జాతీయుల సేవలను ఉపయోగించుకుంది. వీరు కొన్నేళ్లుగా జైషే మహ్మద్‌ ఉగ్రవాద ముఠా సభ్యులుగా ఉంటున్నట్లు నటిస్తూ భారత నిఘా సంస్థలకు సమాచారం అందిస్తున్నారు.

మొబైల్‌ ఫోన్ల ద్వారా అత్యంత గోప్యంగా టాంగో బృందం.. వీరిని సంప్రదించింది. ఎంపిక చేసిన లక్ష్యాల వివరాలను ఆ నలుగురు ఇన్‌ఫార్మర్లు విడివిడిగా ధ్రువీకరించారు. దాడిలో ఉపయోగించాల్సిన ఆయుధాలు, ఇతర సాధనాల జాబితాను సిద్ధం చేసుకున్నారు. దీని ప్రకారం మేజర్‌ టాంగో.. ఎ4ఏ1 కార్బైన్‌ తుపాకీని తీసుకెళ్లాలి. మిగతావారి వద్ద ఇజ్రాయెల్‌ తయారీ టావోర్‌ టార్‌-21 అసాల్ట్‌ తుపాకులు, ఎం4ఏ1లు, ఇన్‌స్టాలాజా సి90 డిస్పోజబుల్‌ గ్రెనేడ్‌ లాంచర్లు, గాలిల్‌ స్నైపర్‌ రైఫిళ్లు ఉండాలి. రాత్రిపూట వీక్షణకు ఉపయోగపడే సాధనాల్లో అమర్చే బ్యాటరీలను క్షుణ్నంగా తనిఖీ చేసుకున్నారు. మిగతా సాధనాలకు ఛార్జింగ్‌ పెట్టుకుని సంసిద్ధం అయ్యారు.

రెండు బృందాలుగా దాడులు

రెండు బృందాలుగా దాడులు

టాంగో బృందానికి రెండు ఉగ్రవాద శిబిరాలను నాశనం చేసే బాధ్యతను అప్పగించారు. అవి ఆక్రమిత కశ్మీర్‌లో చాలా దూరంగా ఉన్నాయి. పరస్పరం 500 మీటర్ల దూరంలో ఉన్నాయి. భారత్‌లోకి చొప్పించడానికి ముందు మజిలీలుగా ఈ శిబిరాలను ఉగ్రవాదులు వాడుకుంటున్నారు. వాటికి చాలా దగ్గర్లోనే పాక్‌ సైనిక శిబిరాలు ఉన్నాయి. అర్ధరాత్రి వేళ నడక ద్వారా నియంత్రణ రేఖ దాటి ఆక్రమిత కశ్మీర్‌లోకి ప్రవేశించిన టాంగో బృందం రెండుగా విడిపోయి నిర్దేశిత రెండు లక్ష్యాల వద్దకు చేరుకున్నారు. ముష్కరులపై కాల్పులతో విరుచుకుపడ్డారు. గంటలోనే పోరు ముగిసింది. తర్వాత రెండు బృందాలు మళ్లీ ఒక్కటయ్యాయి. మొత్తం మీద మెరుపుదాడుల్లో మూడు బృందాలు నాలుగు లక్ష్యాలపై దాడి చేశాయి. ఇందులో 38 - 40 మంది ఉగ్రవాదులు, ఇద్దరు పాక్‌ సైనికులు హతమయ్యారని తేలింది.

పాక్ సైన్యం ప్రతి దాడులు ఇలా

పాక్ సైన్యం ప్రతి దాడులు ఇలా

ఇక టాంగో బృందం విజయవంతంగా దాడి ముగించుకొని.. తమ స్థావరానికి తిరుగు ప్రయాణమైంది. ఆక్రమిత కశ్మీర్‌లోకి ప్రవేశించడానికి ఉపయోగించిన మార్గంలో కాక మరో దారిని ఎంచుకున్నది. ఇది చాలా చుట్టు తిరుగుడు ప్రయాణమైనా కొంత మేర సురక్షితమైంది. మన సైనికుల దాడితో.. గాఢ నిద్ర నుంచి మేల్కొన్న పాక్‌ సైనికులు ఆగ్రహంతో భారత కమాండోలపై విరుచుకుపడ్డారు. తమ వద్ద ఉన్న అన్ని ఆయుధాలతో ఏకబిగిన కాల్పులు జరిపారు. ‘‘ఒక దశలో తూటాలు నా తల పక్క నుంచి దూసుకెళ్లాయి. వాటి శబ్దం నాకు స్పష్టంగా వినిపించింది. నా పొడవు అడుగు మేర ఎక్కువ ఉంటే.. నాకు అనేక తూటాలు తగిలి ఉండేవి'' అని టాంగో చెప్పారు.

జడివానలా వస్తున్న తూటాల ధాటికి కొన్నిచోట్ల చెట్లు తునాతునకలు కావడంతో సైనికులు నేలమీద బోర్లా పడుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా ఒక చోట 60 మీటర్ల మేర ప్రయాణం చాలా ప్రమాదకరంగా సాగింది. తూటాల నుంచి రక్షణ పొందడానికి చెట్లు, బండ రాళ్లు వంటివేమీ లేక సైనికులు జతలు జతలుగా విడిపోయి నేలమీద పాక్కుంటూ కాల్పుల నుంచి బయటపడ్డారు. ఆ సమయంలో వారి పక్కన కొన్ని అంగుళాల దూరంలో తూటాలు నేలను తాకాయి. అవరోధాలను అధిగమిస్తూ సూర్యోదయంలోగా అంటే.. ఉదయం 4.30గంటల కల్లా నియంత్రణ రేఖను దాటి భారత భూభాగంలోకి క్షేమంగా అడుగుపెట్టారు. ఒకవేళ తెల్లవారి తర్వాత మన భూభాగంలోకి రావాల్సి వచ్చినా తమ ప్రాణాలు కోల్పోయేవారమని మేజర్ టాంగో చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
NEW DELHI: The surgical strikes across the LoC+ were precise and conducted at frenetic pace but the major, who led the daredevil mission, says that the return was the most difficult part and bullets fired by the enemy soldiers were so close that these were whistling past the ears.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X