మమ్మల్ని చూసి నేర్చుకోండి; ఓటేస్తేనే ప్రశ్నించే హక్కు: ఇన్ఫోసిస్ నారాయణమూర్తి దంపతులు
కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఏడు గంటల నుండి ఓటు హక్కును వినియోగించుకోవడానికి కర్ణాటక ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఈసారి త్రిముఖ పోరుగా ఉన్న కర్ణాటక ఎన్నికలలో అధికారం కోసం ఎవరికి వారు శతవిధాలా ప్రయత్నం చేశారు. ప్రజల మద్దతును చూరగొనే ప్రయత్నం చేసిన అన్ని రాజకీయ పార్టీల నేతల భవిష్యత్తు ఈరోజు ఈవీఎంలలో నిక్షిప్తమవుతుంది.
కర్ణాటక రాష్ట్రం లోని మొత్తం 224అసెంబ్లీ నియోజక వర్గాలకు జరుగుతున్న ఎన్నికలలో 5.3 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక కర్ణాటక ఎన్నికలలో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి పిలుపునిచ్చారు. ఈరోజు బెంగళూరులోని జయనగర్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్న నారాయణ మూర్తి దంపతులు ఓటు వేసిన అనంతరం మాట్లాడారు.

ఓటు వేస్తేనే ఏదైనా అడిగే హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి మొదటి ఓటు వేయాలని తరువాత ఇది మంచిది, మంచిది కాదని చెప్పే అవకాశం ఉంటుందని అన్నారు. ఒకవేళ ఓటు వేయకపోతే ఎవరికి ఇతరులను విమర్శించే హక్కు ఉండదని స్పష్టం చేశారు. ఓటు ఎందుకు ముఖ్యమో యువతకు తెలిసేలా వివరించడం పెద్దల బాధ్యత అని ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి పేర్కొన్నారు.
నారాయణమూర్తి భార్య సుధామూర్తి ఓటు హక్కు గురించి చెబుతూ,తాము ముసలి వారమైనప్పటికీ ఉదయం 6:00 గంటలకే నిద్రలేచి ఓటు వేయడానికి వచ్చామని,యువ ఓటర్లు తమను చూసి నేర్చుకోవాలని సుధా మూర్తి తెలిపారు.యువ ఓటర్లు కచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా పవిత్రమైనదని,శక్తివంతమైనదని ఆమె తెలిపారు.












Click it and Unblock the Notifications