వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోవిడ్ సహాయం పేరుతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో పెరుగుతున్న ఆన్‌లైన్ మోసాలు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కరోనా సైబర్ నేరాలు

కరోనా సమయంలో అవసరాలకు ఆన్‌లైన్‌పై ఆధారపడటం మరింత పెరిగింది.

కరోనా బాధితులకు మందులు, ఆక్సిజన్, ఆహారం కావలసిన వారు సోషల్ మీడియా వేదికగా సమాచారం, సహాయం కోరుతున్నారు.

ఇదే అదనుగా ఆన్‌లైన్‌లో మోసాలు చేసేవారు విజృంభిస్తున్నారు.

కరోనా కష్టాలను ఆసరాగా చేసుకుని ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్నాయని, జాగ్రత్త వహించమని తెలుగు రాష్ట్రాల ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

కోవిడ్ వ్యాక్సీన్, కరోనాకు మందులు, క్వారంటైన్ గదులు, ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు.. ఇలా అన్నీ ఇప్పుడు బ్లాక్ మార్కెట్ పాలవుతున్నాయి.

కొందరు నిస్వార్థంగా కోవిడ్ బాధితులకు ఉచిత సేవలు చేస్తుంటే, మరి కొందరు మాత్రం బాధితుల కష్టాన్నే తమ బలంగా మార్చుకుని మోసాలు చేస్తున్నారు.

కరోనా మోసాలు

వ్యాక్సీన్ పేరుతో రెండు రకాల మోసాలు

ప్రస్తుతం కరోనా రాకుండా ఉండాలంటే వ్యాక్సీన్ ఒక్కటే మార్గమని వైద్యులు చెప్తున్నారు. దీంతో, ప్రజలంతా వ్యాక్సీన్ వేయించుకోడానికి భారీగా క్యూలు కడుతున్నారు.

అయితే, డిమాండ్‌కు తగ్గట్టు వ్యాక్సీన్ సరఫరా లేకపోవడంతో 'మేం మీకు వ్యాక్సీన్ అందిస్తాం' అంటూ కొందరు మోసాలకు పాల్పడుతున్నారు.

ఆన్‌లైన్‌లో వ్యాక్సీన్ పేరుతో ప్రజలను రెండు రకాలుగా మోసాలు చేస్తున్నారు.

ఇటువంటి సంఘటనలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపించాయి.

"దేశంలో ఏ ప్రాంతంలోను అవసరానికి సరిపడా వ్యాక్సీన్ సరఫరా జరగడం లేదు. దాంతో సంస్థలకు, అపార్ట్‌మెంట్ వాసులకు, కుటుంబాలకు మూకుమ్మడిగా కోవిడ్‌ టీకాలు వేయిస్తామంటూ ఆన్‌లైన్‌లో పోస్టర్లు క్రియేట్ చేస్తున్నారు. వ్యాక్సీన్ కావాలా అంటూ కొందరు నేరుగా ఫోన్ చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఫలానా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేయండని, అవి అందగానే మీకు వ్యాక్సీన్ వేస్తామని ఆశ చూపిస్తున్నారు. డబ్బులు వేసిన తర్వాత, మళ్లీ ఆ ఫోన్ నెంబర్ పని చేయదు. ఇది ఒక రకమైన మోసం.

మరో వైపు, "మీరు ఇంకా వ్యాక్సీన్ వేయించుకోలేదు, వ్యాక్సీన్ యాప్‌లో మీ పేరు ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు, మేం డ్రగ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కాల్ చేస్తున్నాం. మీకు వ్యాక్సీన్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. మీ ఆధార్ నెంబర్ చెప్పండి. అలాగే మీ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది, అది కూడా చెప్పండి" అంటూ ఫోన్లు చేస్తున్నారు. తీరా చెప్పిన తర్వాత వాళ్ల బ్యాంకు అకౌంట్లు గుల్లవుతున్నాయి. వ్యాక్సినేషన్ పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండటమే కాకుండా, అటువంటి ఫోన్ కాల్స్ వస్తే పోలీసులకు సమాచారం అందించండని విశాఖ సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఆర్వీఆర్కే చౌదరి చెప్పారు.

కరోనా సైబర్ నేరాలు

పేమెంట్ చేయగానే ఫోన్ స్విచ్ ఆఫ్

హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు కోవిడ్ బాధితులు ఆక్సిజన్ సిలిండర్లు దొరక్క ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల కోసం ప్రయత్నించారు.

అవి స్థానికంగా ఎక్కడ దొరక్కపోవడంతో ఆన్‌లైన్‌లో వెతికారు.

'ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఇక్కడ లభించును' అంటూ కొన్ని ఫోన్ నెంబర్లు కొన్ని కనిపించాయి. ఆ నంబ్లరకు ఫోన్ చేస్తే, మెషీన్ ఉందిగాని, అడ్వాన్సుగా కొంత డబ్బు చెల్లిస్తే తప్ప ఈ కరోనా టైమ్‌లో మెషీన్ పంపించలేమని చెప్పారు.

అది నమ్మి వారిద్దరూ కూడా అవతలి వ్యక్తులు చెప్పిన అకౌంటుకు రూ. 3 లక్షల 25 వేలు బదిలీ చేశారు. డబ్బు పంపిన కొద్దిసేపటి తర్వాత నుంచి అవతల వ్యక్తి ఫోన్ స్విచ్‌ ఆఫ్ అని వచ్చింది. దాంతో బాధితులు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఏపీలో కూడా ఇలాంటి మోసాలు జరిగాయి.

ఆక్సిజన్ కావాల్సిన వాళ్లు కేవలం వెయ్యి రూపాయలు కడితే చాలు, మీ ఇంటికి లేదా మీరు చెప్పిన హాస్పిటల్‌కు ఆక్సిజన్ సిలిండర్లు పంపిస్తామని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

డబ్బు చెల్లించిన వెంటనే ఆ నంబర్‌ను బ్లాక్ చేసేవారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో అప్రమత్తమైన పోలీసులు.. సైబర్ దొంగలను విశాఖ, తిరుపతిలో అరెస్టు చేశారు.

'మీ షాపులోని సిబ్బందికి కరోనా టీకాలు వేస్తాం' అని హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ బట్టల దుకాణం యాజమానికి ఫోన్ వచ్చింది.

అది ఎవరు చేశారు, అసలు వాళ్లకు టీకాలు ఎలా వస్తాయి అనే కనీస విషయాలను కూడా పట్టించుకోకుండా, ఫోన్‌లో చెప్పిన బ్యాంకు అకౌంటుకు లక్ష రూపాయలు ట్రాన్స్‌ఫర్‌ చేశారు.

డబ్బులు వేయగానే అవతలి వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. మోసపోయామని తెలుసుకున్న ఆ షాపు యాజమాని హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కరోనా సైబర్ నేరాలు

లింకుల‌పై క్లిక్ చేస్తే అంతే

కోవిడ్ మందులు, ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్లు, వ్యాక్సినేషన్ పేరుతో ఆన్‌లైన్ వేదికగా పెరుగుతున్న మోసాలపై తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు.

కోవిడ్ సర్వీసెస్ పేరిట సోషల్ మీడియాలో వస్తున్న పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు సోషల్ మీడియా వేదికగా తెలంగాణ పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.

"ఆన్‌లైన్‌లో కరోనా మెడిసిన్స్ అంటూ మోసం చేసే ముఠాలున్నాయి. కరోనా సోకిన వాళ్లు ఆందోళనలో ఉంటారు. ఇటువంటి వారిని నమ్మి మోసపోతున్నారు. అన‌ధికారిక వెబ్‌సైట్లు, వ్య‌క్తుల నుంచి కోవిడ్ చికిత్స పేరుతో అమ్ముతున్న‌ మందుల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో కొనుగోలు చేయ‌కండి. ఇవి ప్రాణాంతకమయ్యే ప్ర‌మాదం కూడా ఉంది. ముఖ్యంగా అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌లు, మెయిల్ లింకులు ఓపెన్ చేయకండి. అలా చేస్తే మన ఫోన్‌లో ఉన్న సమాచారం మొత్తం వారి చేతికి చిక్కుతుంది. ఈ విషయంలో అప్రమత్తంగా ఉంటూ కరోనా మందులు, వ్యాక్సీన్‌లు అందిస్తామంటూ ఎవరైనా మీకు ఫోన్ చేస్తే అది మోసమని గ్రహించాలి. అనుమానం వచ్చిన వెంటనే 100కు ఫోన్ చేయండి" అని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ చెప్పారు.

కరోనా సైబర్ నేరాలు

జాయింట్ కలెక్టర్ పేరుతో..

మన ఫేస్‌బుక్ అకౌంట్‌లో వివరాలు, ఫొటోలు సంపాదించి, మన పేరుతో ఓ నకిలీ అకౌంట్ క్రియేట్ చేస్తారు. దాని ద్వారా మన ఫేస్‌బుక్ స్నేహితులకు రిక్వెస్ట్ వెళ్తుంది.

అది మీదే అనుకుని మీ స్నేహితులు యాక్సెప్ట్ చేస్తారు. కొన్ని రోజుల పాటు మీ ఫొటోలు, మీ పోస్టులకు లైకులు కొట్టడం, మీతో చాట్ చేయడం వంటివి చేస్తారు.

ఆ తర్వాత.. "భయ్యా, నాకు కరోనా పాజిటివ్. హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్‌లో ఉన్నా. ఇంట్లో వాళ్లకు చెప్తే భయపడతారని ఎవరికీ చెప్పలేదు. అర్జెంటుగా ట్రీట్‌మెంట్‌కు డబ్బులు అవసరం. రావాల్సిన డబ్బులున్నాయి, అవి రాగానే మీ అప్పు తీర్చేస్తా" అంటూ రిక్వెస్ట్ చేస్తారు. అది నమ్మి, తెలిసిన వ్యక్తే కదా అని డబ్బులు ఇస్తారు.

చివరకు విజయనగరం జాయింట్ కలెక్టర్ పేరుతో కూడా ఇలా ఫేస్‌బుక్ ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి డబ్బులు అడుగుతున్నారు.

"ఇటువంటి మోసాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆన్‌లైన్‌లో తమ గురించి ప్రతి విషయం పోస్ట్ చేయడం చాలా మందికి అలవాటైపోయింది. ఇది చాలా నష్టం కలిగిస్తుంది" అని సింబయాసిస్ సాప్ట్‌వేర్ సొల్యూషన్స్ ఎండీ నరేష్ చెప్పారు.

కరోనా సైబర్ నేరాలు

కేంద్రపాలిత ప్రాంతాలే అడ్డా

"కరోనాతో ప్రతి ఇంటిలోనూ ఆందోళనకర పరిస్థితులే ఉన్నాయి. సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు, ఆన్‌లైన్‌లో నకిలీ వెబ్‌సైట్లు, మోసగాళ్లు చేసే ఫోన్ కాల్స్ నిజమని నమ్మి మోసపోతున్నారు.

ముఖ్యంగా కరోనా సమయంలో అవసరమవుతున్న ఆక్సిజన్ సిలిండర్లు, హాస్పిటల్ బెడ్లు, ఇంజెక్షన్లు, మందులు.. ఇలా అన్ని విషయాల్లో మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు సిద్ధంగా ఉన్నారు. వీటిపై మాకు వస్తున్న ఫిర్యాదులు పరిశీలించాం.

కేంద్రపాలిత ప్రాంతాలు, ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఈ ముఠాలు తమ ఆపరేషన్లు చేస్తున్నట్లు తేలింది.

ప్రభుత్వం అందించే సమాచారాన్ని మాత్రమే నమ్మండి. కోవిడ్ సేవలంటూ ఫోన్లు, మేసేజులు వస్తే వెంటనే అనుమానించండి" అని ఆర్వీఆర్కే చౌదరి చెప్పారు.

డూప్లికేట్ యాప్స్, వెబ్ సైట్స్

డూప్లికేట్ యాప్స్, వెబ్‌సైట్లు

కరోనా మందులు, వ్యాక్సీన్ కోసం ఆన్‌లైన్‌లో వెతుకుతున్నవారి సంఖ్య పెరిగిపోయింది.

కావలసిన మందులు, వ్యాక్సీన్, ఆక్సిజన్ సిలిండర్ల కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు.

అయితే, వారు రిజిస్టర్ చేసుకుంటున్న వైబ్‌సైట్లు, యాప్స్ నిజమైనవేనా, నకిలీవా అనేది చెక్ చేసుకోవడం లేదు.

కోవిడ్ నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్లకు వచ్చే సోషల్ మీడియా ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

"తెలియని నంబర్స్ నుంచి వచ్చే లింకులు, డౌన్‌లోడ్స్‌‌పై క్లిక్‌ చేయవద్దు. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌, ఇతర అంశాలకు సంబంధించి నకిలీ లింకులు పంపుతూ సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. విజయనగరం జిల్లాలోనే ఈ తరహా మోసాలు 5 శాతం నమోదవుతున్నాయి. ఓటీపీ, పిన్‌ నంబర్. ఆధార్‌ నంబర్, క్రెడిట్‌, డెబిట్‌ కార్డు వివరాలు, ఇతర వ్యక్తిగత సమాచారం ఎవరికీ షేర్‌ చేయవద్దు. కోవిడ్ వ్యాక్సినేషన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ప్రభుత్వ వెబ్‌సైట్స్‌.. కోవిన్ పోర్టల్‌, ఆరోగ్య సేతు, UMANG మొబైల్‌ అప్లికేషన్లు మాత్రమే వాడండి" అని విజయనగరం జిల్లా ఎస్పీ బి. రాజకుమారి చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Rising online scams in Andhra Pradesh and Telangana in the name of covid help
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X