Bihar Result: తేడా వస్తే నేపాల్ సీన్ రిపీట్.. ! ఆర్జేడీ నేత హెచ్చరిక..!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొన్న ముగిసింది. రెండు విడతలుగా జరిగిన పోలింగ్ లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించడం ఖాయమని అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. ఈ అంచనాలపై ఎన్డీయే నేతలు సంతోషంలో మునిగితేలుతుండగా.. విపక్ష మహాకూటమి నేతలు మాత్రం మండిపడుతున్నారు. ఇదే క్రమంలో బీహార్ ఎగ్జిట్ పోల్స్ ను తోసిపుచ్చిన మహాకూటమి పార్టీలు.. రేపు అసలు ఫలితాల్లో తేల్చుకుందామంటున్నారు. అలాగే తమ నేతల్ని అలర్ట్ చేస్తున్నారు.
అయితే ఈసారి బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే ఓట్ల చోరీ చేస్తే తప్ప గెలిచే ఛాన్స్ లేదని భావిస్తున్న మహా కూటమి పార్టీలు.. కౌంటింగ్ సందర్భంగా అధికార కూటమి అక్రమాలకు తెరలేపితే మాత్రం దీటుగా అడ్డుకుంటామని ముందుగానే హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ల వద్ద కూటమి నేతలు భారీ ఎత్తున కాపలా కాస్తున్నారు. అదే సమయంలో ఎన్నికల ఫలితాలు తేడా వస్తే నేపాల్ తరహాలో, బంగ్లాదేశ్ తరహాలో నిరసనలు తప్పవని అధికారుల్ని హెచ్చరిస్తున్నారు.

బీహార్ ఫలితాల్ని తారుమారు చేయాలని చూస్తే నేపాల్, బంగ్లాదేశ్ తరహా నిరసనలు పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉందని ఆర్జేడీ నేత సునీల్ సింగ్ రాష్ట్రంలోని ఎన్నికల అధికారులను హెచ్చరించారు. లెక్కింపులో పాల్గొనే అధికారులందరూ ప్రజా తీర్పును తారుమారు చేయవద్దని ఆయన కోరారు. అలా చేస్తే, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలో జరిగిన విధంగా బీహార్‌లో అశాంతి చెలరేగవచ్చని హెచ్చరించారు. తమ పార్టీ ఆర్జేడీ అప్రమత్తంగా ఉందని, ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరించవద్దని అధికారులను కోరినట్లు సింగ్ తెలిపారు.

2020లో తమ అభ్యర్థులలో చాలా మంది బలవంతంగా ఓడిపోయారని, ప్రజలు తమ తీర్పు ఇచ్చిన వ్యక్తిని మీరు ఓడిస్తే, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలోని రోడ్లపై మీరు చూసిన దృశ్యాలు బీహార్ రోడ్లపై కూడా కనిపిస్తాయని కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొన్న అధికారులందర్ని సునీల్ సింగ్ హెచ్చరించారు. ఆర్జేడీ 140 నుండి 160 సీట్లను గెలుచుకుని తేజస్వి యాదవ్ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని భావిస్తున్నట్లు ఆర్జేడీ నేత సునీల్ సింగ్ తెలిపారు.












Click it and Unblock the Notifications